భూమి గుండ్రంగానే ఉంది! పథకం ఒక్కటే.. పేర్లే మార్పు

భూమి చుట్టూ ప్రధాన పార్టీలు ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడో అనుమానం రావాలి. భూమి గుండ్రంగానే ఉంది కదా..? మ‌రి ఆ పథకం ఏంటి..?

Reporter :  The Federal
Update: 2023-11-29 23:48 GMT
Dharani portal

ఏదో సామెత చెప్పినట్టు పేరు మారినంత మాత్రాన ఆ పథకంలో ఏమైనా మార్పులు ఉంటాయా..? లేక పూర్తిగా రద్దైతాదా..? అన్న అనుమానం కలుగుతోంది ఇప్పుడు.  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓటరు నాడిని పట్టుకోవడానికి రాజకీయపార్టీలు నానా తంటాలు పడుతుంటాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అదే జరుగుతోంది. భూమి చుట్టూ... ప్రధాన పార్టీలు ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడో అనుమానం రావాలి. భూమి గుండ్రంగానే ఉంది కదా..? మరి ఆ పథకం ఏంటి..? ఆ కథేంటి అని. భూమి చుట్టూ తిరగడం ఏంట‌ని.  అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్ ) ధరణి పోర్టల్ ను (Dharani Portal) ప్రారంభించి గత నాలుగేళ్లుగా విమర్శలను ఎదుర్కొంటోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను మా భూమి*గా మార్చి ప్రజలకు మేలు చేస్తామని చెబుతోంది. తాజాగా బీజేపీ విడుదల చేసిన ప్రజాకర్షణలో 'మీ భూమి' అంటూ కొత్త పాట మొదలెట్టింది.

అధికార బీఆర్ఎస్ పార్టీపై ఒంటికాలు మీద లేస్తున్న కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ ఎక్కడికక్కడ విమర్శలను ఎక్కుపెడుతోంది. ముందుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయడంతో... తరువాత పార్టీల మేనిఫెస్టోలన్నీ తమను కాపీ కొట్టాయంటూ ఊదరగొడుతోంది. ఎన్నికలకు ముందే  ప్రచారం ప్రారంభించి, విజయం సొంతం చేసుకోవాలన్న తపనలో బీఆర్ఎస్ వుంద.  స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ (Slow and Study Win the Race)  అంటూ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తూ.. అధికారపార్టీ వైఫల్యాలపై విమర్శలు ఎక్కుపెట్టింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 అక్టోబరు 29వ తేదీన ప్రారంభించిన ధరణి పోర్టల్ లో లోపాలెన్నో ఉన్నాయని మొదట్లో రెవెన్యూశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటిని ఒక్కొక్కటి సవరించడానికి అంటూ కొంతకాలం పోర్టల్ ను

ప్రభుత్వం నిలిపివేసింది.  కొంత కాలం తరువాత మళ్లీ ధరణి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే... ధరణిలో ఒకసారి  భూములకు సంబంధించిన అంశాలు  రెకార్డులకెక్కితే  వాటిని సరిచేయడం మరెవ్వరి తరం కాదు.  ఈ ఒక్క అంశంతో ఈ పోర్టల్ ఆధారంగా అధికారపార్టీ నేతలు భూ దందాలకు పాల్పడ్డారని ప్రతిపక్షపార్టీ కాంగ్రెస్, బీజేపీలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించాయి. 

కొండమీది కోతి దిగివచ్చిందన్నట్టు.. గత మూడేళ్లుగా ధరణిలో లోపాలున్నాయని ప్రతిపక్షాలు, వివిధ రాజకీయపార్టీల నేతలతో పాటు సొంత పార్టీలోని చోటా బడా నాయకులు పదేపదే  నెత్తీనోరు కొట్టుకున్నా... పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం ఇప్పడు 'ధరణి' పోర్టల్ ను  సవరిస్తామంటూ ఎన్నికల సభల్లో సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించింది.  ఇందుకు కేటీఆర్ కూడా ఒప్పుకోవడమే సాక్ష్యం. గత మూడున్నరేళ్లుగా ధరణి పోర్టల్ లోని లోపాలపై ఎందుకు నోరెత్తలేదంటూ కాంగ్రెస్ పార్టీ అధికారపార్టీపై ఎదురు దాడి ప్రారంభించింది.

ధరణి పోర్టల్లో ఉన్న ప్రధానమైన లోపం ఏంటో...?

తల్లి, తండ్రి పేరు మీద ఉన్నభూమి ఏదైనా ఆస్తిపాస్తులు వారి సంతానానికి వారసత్వంగా (Legal Heir) వచ్చేస్తుంది. అలాగే ఎవరైనా వ్యవసాయ భూమి (Agricultural Land) లేదా నాన్ అగ్రికల్చరల్ భూములు (Non-Agricultural Land) కొంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తరువాత కొన్నవారి పేరుమీద ఆ భూమికి సంబంధించిన వివరాలు మార్పులు జరగాలి. దాన్నే మనం మ్యుటేషన్ అని పిలుస్తాం. కానీ ఇప్పుడు ధరణిలో ప్రభుత్వం దగ్గర ఉన్న భూ లెక్కల (Land Records) ఆధారంగా రికార్డులు నమోదు చేయడంతో పాటు, ఎవరైనా ఆ గ్రామంలో లేదా, ఆపట్టణంలో దీర్ఘకాలంగా లేనట్టయితే వారి భూములు కనునమరుగైపోతున్నాయన్నది ఆరోపణ. ఎక్కువగా పట్టణ ప్రాంతాల కంటే.. పల్లెల్లోని వ్యవసాయ భూముల వివరాలు గల్లంతైయ్యాయని ప్రజలు గగ్గోలు పెట్టారు. దీంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది. పోర్టల్ లోని లోపాలు సరిచేయడం అంత సులభం కాకపోవడంతో సమస్య తలెత్తిన వారంతా కాళ్లకున్న చెప్పులు అరిగిపోయేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి తోడు ధరణి లోపాలు అడ్డంపెట్టుకొని అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపణ.

కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టల మధ్య జరుగుతున్న ధరణి విమర్శలను ఇప్పుడు బీజేపీ తన భుజాన వేసుకుంది. తమపార్టీ అధికారంలోకి వస్తే... ధరణి స్థానంలో 'మీ భూమి'ని ఏర్పాటు చేసిన ప్రజల భూములకు ప్రభుత్వం గ్యారంటీ అంటూ ఓటర్లను ఆకట్టుకోవడానికి కల్లబొల్లి కబుర్లు చెప్పడం  ప్రారంభించింది.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు ఓటర్లకు కొత్త ఆలోచన తెచ్చిపెట్టాయి. ధరణి పోర్టల్ పైనే మూడు పార్టీల నేతలు దృష్టి సారిస్తున్నారేంటి..? అని గుసగుసలాడుకొంటున్నారు. నిన్న మొన్నటి దాకా ధరణి తో ప్రజలకు ఎంతో మేలే చేశామన్న అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు ఏంటి...? లోపాలు సవరిస్తామంటూ... మున్సిపల్ పరిపాలనాశాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించడం అనుమానాలకు దారితీస్తోంది. అయితే ధరణిలో లోపాలున్న మాట నిజమే కదా..? అని బాహాటంగా చెప్పుకుంటున్నారు. అదే ధరణిపై కాంగ్రెస్పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదటి నుండీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. భూ మాత పేరుతో కాంగ్రెస్ ఏం చేస్తుందో..? మీ భూమి అంటూ బీజేపీ ఎం ఒరగబెడుతుందోనని ఇప్పుడు తెలంగాణ ఓటర్లు కొత్త ఆలోచనలో పడ్డారు.

హైదరాబాద్ నగరంలోని హబ్సిగూడ ప్రాంతానికి చెందిన నరేష్ రెడ్డి తనకున్న 10 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను ధరణి పోర్టల్లో చెక్ చేసుకుంటే.. ఆభూమి 22ఏ విభాగంలో (22A- Land sealing Act) ఉన్నట్లు చూపిస్తోందని వాపోయారు. అంటే నరేష్ రెడ్డికి చెందిన సొంత భూమి ధరణిలో ప్రభుత్వ నిషేదిత భూమిగా చూపించడంతో ఇప్పుడాయన నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. తన తాత ముత్తాతల నుండి వారసత్వంగా సంక్రమించిన ఈ భూమి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్ గ్రామ పంచాయితీ పరిధిలో ఉందని, సర్వే నెంబరు ను ధరణి పోర్టల్ లో తప్పుగా నమోదు చేయడం వల్లే తన భూమి 22ఏ విభాగంలోకి చేరడం జరిగిందని వాపోయారు. ఇప్పుడు ఆయన భూమి మళ్లీ తిరిగి ఆయనకు చెందాలంటే దశాబ్ధాల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే.

ఇదొక్కటే కాదు... తెలంగాణ రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని రైతులు, సామాన్యులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా తమ భూముల విషయంలో జరిగిన పొరపాట్లపై లబోదిబో మంటున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ ఎన్నికలకు భూమి అంశం ఒక ప్రచారాస్త్రంగా మారిందనే చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ధరణి... కాంగ్రెస్ భూమాత... ఇక బీజేపీ మీ భూమి... పేరేది పెట్టినా... పథకం ఒక్కటే.. ప్రజలకు మేలు చేస్తే చాలు... చావుకు తేవద్దంటున్నారు తెలంగాణ ప్రజలు... భూమాతా జిందాబాద్...!

Similar News