‘ఈ జడ్డి మాకొద్దు’
నిరసనకు దిగిన అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్..;
ఢిల్లీ హైకోర్టు(Delhi High court) న్యాయమూర్తి యశ్వంత్ వర్మను అలహాబాద్(Allahabad) హైకోర్టుకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ అక్కడి బార్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం నిరవధిక సమ్మె(Indefinite strike)కు పూనుకున్నారు. కోర్టు గేట్ నంబర్ 3 వద్ద సమ్మెకు నాయకత్వం వహిస్తున్న బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ విలేఖరులతో మాట్లాడుతూ.. "ఈ నిరసన ఏ కోర్టు లేదా న్యాయమూర్తికి వ్యతిరేకం కాదు. అయితే న్యాయ వ్యవస్థను మోసం చేసిన వారికి ఈ నిరసన వ్యతిరేకం. యశ్వంత్ వర్మ బదిలీ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలన్నదే మా డిమాండ్" అని అన్నారు.
జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో మార్చి 14న రాత్రి 11.35 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది కాలిపోయిన నోట్లను గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇది కాస్త బయటకు పొక్కడంతో.. ఘటనపై అంతర్గత విచారణ చేయాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయను సుప్రీంకోర్టు కొలీజియం ఆదేశించింది. ఆయన తన నివేదికను సుప్రీంకోర్టు(Supreme Court) సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. మరోవైపు యశ్వంత్ వర్మ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు చీఫ్ 3 రాష్ట్రాల హైకోర్టు జడ్జీలతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు సీజీఐ. ఇందులో పంజాబ్-హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ సభ్యులుగా ఉంటారు. అయితే కాలిపోయిన నోట్లతో తనకు ఎలాంటి సంబంధంలేదని జస్టిస్ యశ్వంత్ వర్మ చెబుతున్నారు. అసలు స్టోర్‌రూమ్‌లో నగదు ఉందన్న విషయం నాకుగాని, మా కుటుంబ సభ్యులకుగాని తెలియదని పేర్కొన్నారు. తనను అప్రతిష్ట పాలు చేయడానికి ఎవరో కుట్ర పన్నారని చెప్పారు.
ఇటు సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ వర్మను విధులకు దూరంగా ఉంచుతూ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. జస్టిస్ వర్మ ఆగస్టు 8, 1992న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. అక్టోబర్ 13, 2014న అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన ఫిబ్రవరి 1, 2016న అలహాబాద్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు, అక్టోబర్ 11, 2021న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.