ఢిల్లీ సీఎంను టార్గెట్ చేసిన మాజీ సీఎం..
అధికారిక సమావేశాల్లో రేఖా గుప్తా భర్త పాల్గొనడాన్ని తప్పుబట్టిన అతిశీ..;
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య మళ్లీ ఎక్స్ వేదికగా మాటల యుద్ధం మొదలైంది. అధికారిక సమావేశాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా (CM Rekha Gupta) భర్త మనీష్ గుప్తా పాల్గొనడాన్ని మాజీ సీఎం అతిశీ తప్పుబట్టారు. ఎంసీడీ, డీజేబీ, పీడబ్ల్యూడీ, డీయూఎస్ఐబీ అధికారుల అఫీషియల్ మీట్‌లో రేఖ గుప్తా భర్త ఉన్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశారు.
ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆయనే నడుపుతున్నారని విమర్శ..
"ఈ ఫోటోను జాగ్రత్తగా చూడండి. MCD, DJB, PWD, DUSIB అధికారుల సమావేశాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా భర్త" అని ఫోటో కింద పేర్కొన్నారు.
"ఒక గ్రామంలో ఒక మహిళా సర్పంచ్ ఎన్నికైతే.. ప్రభుత్వ పనులన్నీ ఆమె భర్తే చూసుకుంటారని గతంలో మనం వినేవాళ్ళం..కానీ దేశ చరిత్రలో ఒక మహిళ ముఖ్యమంత్రి ప్రభుత్వ పనులన్నీ ఆమె భర్తే చూసుకోవడం ఇదే మొదటిసారి" అని రాసుకొచ్చారు. తరచుగా విద్యుత్ కోతలు, ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల పెంపు వెనుక తన భర్త పాత్ర ఉందా అన్న అనుమానాన్ని కూడా అతిశీ వ్యక్తం చేశారు.
స్పందించిన సచ్‌దేవా..
అతిశీ పోస్టుపై బీజేపీ(BJP) ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా (Virendra Sachdeva) స్పందించారు. ‘‘కఠిన శ్రమ, దృఢ సంకల్పంతో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి రేఖా గుప్తా అని, కుటుంబ సభ్యులు ప్రజా ప్రతినిధులకు మద్దతు ఇవ్వడం సాధారణ విషయమేనని ఢిల్లీ సీఎంను సమర్థిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
"అతిశీ (Atishi) స్వయంగా ఒక మహిళ అయి ఉండి, మరో మహిళా నాయకురాలిని అవమానించడం ఆశ్చర్యంగా ఉంది. రేఖ గుప్తా DUSU కార్యదర్శి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఆమె భర్త ఆమెకు మద్దతు ఇవ్వడం చట్టవిరుద్ధం లేదా అనైతికం కాదు." అని కూడా పేర్కొన్నారు.
మరి కేజ్రీవాల్ (Kejriwal) భార్య మాట్లాడారుగా..
కేజ్రీవాల్ అరెస్టు తర్వాత.. అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal) సీఎం కార్యాలయం నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగించడం, ఆప్ నాయకుల జీవిత భాగస్వాములు రాజకీయ వ్యవహారాల్లో పాల్గొన్న సందర్భాలను కూడా సచ్‌దేవా ఎత్తి చూపుతూ .."అది ప్రజాస్వామ్యానికి అవమానం కాదా?" అని ప్రశ్నించారు.