ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారోత్సవం.. ఆమెతో పాటు మరో ఐదుగురు

ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిశీ ఈ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆమెతో పాటు మరో ఐదురుగు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు.

Update: 2024-09-21 07:49 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిశీ ఈ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమెతో పాటు మరో ఐదురుగు ఆప్ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు గవర్నర్ కార్యాలయ అధికారులు తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు రాజ్ నివాస్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవ వేళ పార్టీలో జోష్ కనిపించడం లేదు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ప్రమాణ స్వీకారోత్సవ వేడుక నిరాడంబరంగా నిర్వహించే యోచనలో పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు మంగళవారం రాజీనామా లేఖను సమర్పించారు. ఆ వెంటనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఫైల్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ వారం ప్రారంభంలో ఆప్ ఎమ్మెల్యేలంతా సమావేశమై అధికార శాసనసభా పక్ష నేతగా అతిశీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కొత్తమంత్రిమండలిలో ఒక్కరే కొత్తవారు..

కొత్త మంత్రి మండలిలో గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్‌, సుల్తాన్‌పూర్ మజ్రా నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖేష్ అహ్లావత్ ఉన్నారు. రాయ్, గహ్లోత్, భరద్వాజ్, హుస్సేన్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు.

అందుకే రాజీనామా..

ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సెప్టెంబరు 13న తీహార్ జైలు నుంచి బయటికి వచ్చారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ఐదు నెలలకు పైగా జైలు జీవితం గడిపారు. రెండు రోజుల తర్వాత ఆశ్చర్యకర ప్రకటన చేశారు. జనం నుంచి తిరిగి నిజాయితీ సర్టిఫికేట్ పొందిన తర్వాతే మళ్లీ ముఖ్యమంత్రి పదవికి వస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు.

కొత్త ప్రభుత్వ పదవి కాలం 5 మాసాలే..

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున అతిశీ ప్రభుత్వ పదవీకాలం 5 నెలలు మాత్రమే ఉంటుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మహిళా సమ్మాన్ యోజన, ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0 లాంటి కొన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేయాల్సి ఉంటుంది. కేజ్రీవాల్ ప్రభుత్వంలో అతిశీ ఫైనాన్స్, రెవెన్యూ, పిడబ్ల్యుడి, పవర్, ఎడ్యుకేషన్‌తో సహా 13 పోర్ట్‌ఫోలియోలు ఉండేవి. అలాగే రాయ్ పర్యావరణం, అభివృద్ధి, సాధారణ పరిపాలన శాఖలకు ఇన్‌ఛార్జ్‌గా ఉండగా.. భరద్వాజ్ ఆరోగ్యం, పర్యాటకం, పట్టణాభివృద్ధి శాఖలు చూసేవారు. హుస్సేన్ ఆహారం, సరఫరాల మంత్రిగా ఉండగా, గహ్లోత్ రవాణా, గృహ మహిళా, శిశు అభివృద్ధి శాఖల బాధ్యతలను నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేయడంతో ఆయన శాఖలు అహ్లావత్ కు అప్పగించే అవకాశం ఉంది. కాగా కొత్త క్యాబినెట్‌లో పాత నలుగురు మంత్రులు వారి మునుపటి శాఖల్లోనే కొనసాగుతారని సమాచారం. 

Tags:    

Similar News