BJP Politics | మహా కుంభమేళాలో పారిశుద్ధ్య సిబ్బందికి రాజ్యాంగ ప్రతులు

ఉత్తర్ ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా శానిటరీ వర్కర్లకు రాజ్యాంగ ప్రతులు పంచి రాజ్యాంగం మీద తమకున్న గౌరవాన్ని చాటుకుంటున్నారు.;

Update: 2025-01-17 08:15 GMT

వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో కమలనాథులను మించి మరొకరు ఉండరేమో. సందర్భాన్ని క్యాష్ చేసుకోవడం వారికి బాగా తెలుసు. ప్రయాగ్ రాజ్‌ మహాకుంభ (Maha Kumbh) మేళాలో పారిశుధ్య సిబ్బందికి ప్రస్తుతం రాజ్యాంగ ప్రతులు పంచడం హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ ఉత్తరప్రదేశ్ నాయకులు వీటిని అందజేస్తున్నారు. పైగా ఈ ఆధ్మాతిక సంగమం దేశ ఐక్యతకు నిదర్శనమని, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని చెప్పుకొస్తున్నారు.

భారత రాజ్యాంగం 75 ఏళ్ల వేడుకలను బీజేపీ ఇటీవల ఘనంగా నిర్వహించింది. "సంవిధాన్ గౌరవ్ అభియాన్" కింద రాష్ట్రవ్యాప్తంగా దళితులను సన్మానిస్తోన్న విషయం తెలిసిందే. గురువారం మహా కుంభ మేళాలో శానిటేషన్ సిబ్బందికి దండలు వేసి, రాజ్యాంగ ప్రతులను అందజేశాక బీజేపీ(BJP) యూపీ కార్యదర్శి అభిజాత్ మిశ్రా మాట్లాడారు. "దళితులు, ఇతర వెనుకబడిన కులాలను ఇతర పార్టీలు ఓటు బ్యాంకుగా చూస్తున్నాయి. కాని వాటికి బీజేపీ భిన్నం. వారిని మేం గౌరవిస్తాం. మేళా ఐక్యతకు నిదర్శనం. ఇది రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు" అని పేర్కొన్నారు.

బీజేపీపై విమర్శలు...

లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ  "400 పార్" నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అనుకున్న స్థానాల్లో విజయం సాధించలేకపోయింది. చివరకు ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మరోవైపు ఇండియా కూటమి అనూహ్య విజయాన్ని సాధించింది.

అత్యధిక మెజార్టీ సాధించి రాజ్యాంగాన్ని మార్చాలనుకున్న బీజేపీ.. ఇప్పుడు రాజ్యాంగానికి విలువ ఇస్తున్నట్లు చెప్పుకోవడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి

కాషాయ పార్టీకి ధీటుగా..

బీజేపీ చర్యలకు సమాంతరంగా..సమాజ్‌వాదీ(SP) పార్టీ కూడా మహా కుంభమేళాలో తమ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ జనవరి 27న "జై బాపు, జై భీమ్, జై సంవిధాన్" ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

బీజేపీ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. దళిత ఐకాన్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించినవారు ఆయన రచించిన రాజ్యాంగాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని విమర్శించారు. 

"ఏకతా కా మహాకుంభ్"

2019లో ఉత్తరప్రదేశ్‌ (UP)లో కుంభ మేళాను సందర్శించినప్పుడు ప్రధాని మోదీ దళిత పారిశుధ్య సిబ్బందికి కాళ్లు కడిగి వారి పట్ల గౌరవం చాటుకున్నారు.

ఈ ఏడాది మహా కుంభమేళాకు కొన్ని రోజుల ముందు ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించారు. కుంభ మేళాను "ఏకతా కా మహాకుంభ్" గా అభివర్ణించారు. ఇటీవల ఆయన శ్రింగవేర్పురులో నిషాద్ రాజ్ పార్కులో నిషాద్ రాజ్ (నది ప్రాంతీయ సముదాయం రాజు), రాముడి విగ్రహాలను కూడా ఆవిష్కరించారు. ఓబీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతం నిషాద్.

"మహా కుంభ మేళా సంఘీభావానికి ఒక రూపం. భిన్నత్వాల ఐక్యతకు వేదిక," అని RSS సీనియర్ నాయకుడొకరు పేర్కొన్నారు. ఇక రాజకీయ విశ్లేషకుడు సుధీర్ పన్వార్ మాట్లాడుతూ.. "బీజేపీకి ఓబీసీల జనగణనపై ఓ సమస్య ఉంది. అందుకే మహా కుంభమేళా లాంటి కార్యక్రమాల ద్వారా వారి మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది" అని పేర్కొన్నారు.  

Tags:    

Similar News