వర్చువల్ హియరింగ్‌‌కు CJI ఆదేశాలు

ఢిల్లీలో గాలి నాణ్యత బాగా పడిపోయిన నేపథ్యంలో న్యాయవాదులు వర్చువల్‌గా హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయమూర్తులను ఆదేశించారు.

Update: 2024-11-19 08:16 GMT

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత బాగా పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సోమవారం ఉదయం 8 గంటలకు 484‌గా రికార్డయ్యింది. కొన్ని ప్రాంతాల్లో 500 దాటింది. దీంతో వీలున్న చోట వర్చువల్ హియరింగ్‌కు న్యాయవాదులను అనుమతించాలని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా న్యాయమూర్తులందరికి సూచించారు.

జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం సమావేశమైన వెంటనే సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ (SCBA) అధ్యక్షుడు కపిల్ సిబల్‌తో పాటు మరికొంతమంది న్యాయవాదులు.. ఢిల్లీ, NCRలో పెరిగిపోయిన కాలుష్యం గురించి ప్రస్తావించారు. దాంతో CJI న్యాయవాదులు ఆన్‌లైన్‌లో హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. అయితే పిటీషన్లను ఆన్‌లైన్‌లో సమర్పించేందుకు CJI నిరాకరించారు.

పెరిగిపోయిన కాలుష్యం గురించి దేశ రాజధానిలోని ఇతర కోర్టులు, ట్రిబ్యునల్‌లకు చెప్పాల్సిన అవసరం ఉందని సిబల్ CJIతో అన్నారు. సిబాల్‌కు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, గోపాల్ శంకరనారాయణన్‌ కూడా మద్దతు తెలిపారు. రోజూ దాదాపు 10,000 మంది న్యాయవాదులు తమ సొంత వాహనాలతో సుప్రీంకోర్టుకు వస్తున్నారని, న్యాయవాదుల గుమస్తాలు కూడా తరచుగా వ్యక్తిగత వాహనాలను ఉపయోగిస్తారని శంకరనారాయణన్‌ చెప్పారు. "ఆ విషయాన్ని మేం న్యాయవాదులకే వదిలేశాం. వారు వర్చువల్‌గా హాజరు కావాలనుకుంటే హాజరుకావచ్చు." అని CJI చెప్పారు. ఇటు సుప్రీం కోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. గాలి నాణ్యత పడిపోయిన నేపథ్యంలో సాధ్యమయినంతవరకు అందరూ మాస్క్‌లు ధరించాలని, ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ లెక్కలివి..

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవాలి.

Tags:    

Similar News