ఢిల్లీ సీఎం రేఖ గుప్తాపై దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు

‘ప్రజావాణి’లో ఘటన.. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది..దాడిని ఖండించిన పార్టీల నేతలు..;

Update: 2025-08-20 09:29 GMT
Click the Play button to listen to article

ఢిల్లీ(Delhi)సీఎం రేఖ గుప్తా(Rekha Gupta)పై ఈ రోజు (ఆగస్టు 20) ఉదయం దాడి జరిగింది. సివిల్ లైన్స్‌లోని తన అధికారిక నివాసంలో ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఓ వ్యక్తి రేఖాగుప్తాపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమయిన సిబ్బంది దాడికి పాల్పడ్డ వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడిని గుజరాత్‌లోని రాజ్‌కోట్ నివాసి రాజేష్ భాయ్జీగా గుర్తించారు.

"ఈరోజు 'జన్ సున్వై' (ప్రజావాణి) కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై ఒక వ్యక్తి దాడి చేశాడు. ఢిల్లీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు" అని సీఎంవో ఘటన తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది.

సీఎంపై దాడిని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఖండించారు. దాడి జరిగిన తీరును ఆయన వివరించారు. "ప్రజావాణి సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజల ఫిర్యాదులను తెలుసుకుంటున్నారు. ఒక వ్యక్తి ముందుకు వచ్చి ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నించాడు. అకస్మాత్తుగా సీఎం చేయి పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఘటనా స్థలంలో ఉన్న సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకున్నారు. పోలీసులు అతని నేపథ్యాన్ని పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి నిలకడగా ఉన్నారు. వైద్యులు ఆమెను పరీక్షించారు. ముఖ్యమంత్రి ధైర్యశీలి. తన పనిని తిరిగి కొనసాగించారు," అని చెప్పారు.


దాడిని ఖండించిన AAP, కాంగ్రెస్..

సీఎం రేఖాగుప్తపై జరిగిన దాడిని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్ ఖండించాయి. అదే సమయంలో ‘దేశ రాజధానిలో మహిళల భద్రత అంశం’పై పోలీసులను ప్రశ్నించాయి. ప్రజాస్వామ్యవ్యవస్థలో అభిప్రాయ భేదాలు, వ్యతిరేకతలు సహజమేనని, అయితే హింసకు చోటు లేదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

"ఢిల్లీ పోలీసులు తగిన చర్య తీసుకుంటారన్న నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను" అని హిందీలో ఎక్స్‌లో పోస్ట్ చేశారు కేజ్రీవాల్.

మాజీ ముఖ్యమంత్రి అతిశీ కూడా రేఖ గుప్తాపై దాడికి ఖండించారు. ఢిల్లీ పోలీసులు నిందితుడిపై చర్య తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు ఇలాంటి చర్యలను ఖండించాలని ఢిల్లీ మాజీ మంత్రి, AAP ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ కోరారు. "ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు. ఈ ఘటనను మేం పూర్తిగా ఖండిస్తున్నాం. ఏ రకమైన హింస కూడా సమర్థనీయం కాదు" అని పేర్కొన్నారు.

ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ దాడి విచారకరమన్నారు. "ముఖ్యమంత్రిపై దాడి ఖండించదగ్గ విషయం. ఢిల్లీలో మహిళలు సురక్షితంగా లేరనే వాస్తవాన్ని ఈ ఘటన బయటపెడుతుంది," అని పేర్కొన్నారు.


‘నా కొడుకు జంతు ప్రేమికుడు..’

నిందితుడి వివరాలను తెలుసుకున్న పోలీసులు అతడి తల్లితో మాట్లాడారు. తన కొడుకు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అని, తనకు ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధంలేదని తల్లి భానుబెన్ చెప్పింది. జంతు ప్రేమికుడయిన తన కొడుకు రాజేష్.. దేశ రాజధానిలో వీధి కుక్కలను తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లాడని ఆమె పోలీసులకు చెప్పారు.

"అతనికి కుక్కలు, ఆవులు, పక్షులంటే చాలా ఇష్టం. ఢిల్లీలో వీధి కుక్కలను పట్టుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పు అతన్ని బాధపెట్టింది. కొన్ని రోజుల క్రితం హరిద్వార్ వెళ్లాడు. కుక్కలకు మద్దతుగా జరిగే నిరసనల్లో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్తానని ఫోన్‌లో చెప్పాడు" అని భానుబెన్ పేర్కొంది. 

Tags:    

Similar News