‘‘కాంగ్రెస్ దేశ ద్రోహులకు అండగా నిలబడింది’’
భారత సైన్యానికి బదులుగా, టెర్రరిస్టుల అనుకూల భాష మాట్లాడుతోందన్న ప్రధాని;
By : The Federal
Update: 2025-09-14 13:37 GMT
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. భారత సైన్యానికి మద్దతు ఇవ్వడానికి బదులుగా, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులకు మద్దతు ఇస్తూ వారి భాష మాట్లాడుతోందని ఆయన ఆరోపించారు.
అస్సాంలోని దరంగ్ జిల్లాలోని మంగళ్ డోయ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ఆ పార్టీ చొరబాటుదారులు, దేశ వ్యతిరేక శక్తులను రక్షిస్తోందని ఆరోపించారు. చొరబాటుదారులు భూమిని ఆక్రమించుకుని, జనాభాను మార్చడానికి చేస్తున్న కుట్రలను బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోదని ప్రధాని ఉద్ఘాటించారు.
‘‘కాంగ్రెస్ పార్టీ భారత సైన్యానికి మద్దతు ఇవ్వడానికి బదులుగా, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోంది. చొరబాటుదారులను, దేశ వ్యతిరేక శక్తులను రక్షిస్తోంది’’ అని ప్రధాని బహిరంగ సభలో ఆరోపించారు.
ఆపరేషన్ సిందూర్ తరువాత తొలిసారిగా అస్సాంలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి.. తన పర్యటనను కామాఖ్య దేవి, శ్రీ కృష్ణుడికి అంకితం చేశారు. ‘‘ కామాఖ్య దేవీ ఆశీస్సులతో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది’’ అని ఆయన అన్నారు.
అది దైవిక సంబంధం అని తనకు అనిపించిందని అన్నారు. నిన్న సాయంత్రం అస్సాం చేరుకున్న మోదీ, భారత రత్న అవార్డ్ గ్రహీత భూపేన్ హజారికా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
మొదటి ఇథనాల్ ప్లాంట్..
అస్సాం పర్యటన సందర్భంగా మోదీ అస్సాంలోని నుమాలి గడ్ లో రూ. 12,230 కోట్ల విలువైన ప్రాజెక్ట్ లను ప్రారంభించారు. గోలాఘాట్ జిల్లాలోని నుమలిఘర్ లో రూ. 5 వేల కోట్లతో నిర్మించిన వెదురు ఆధారిత ఇథనాల్ ప్లాంట్ ను ప్రధానమంత్రి ప్రారంభించారు.
‘‘ప్రపంచంలోనే మొట్టమొదటి, రెండోతరం బయో ఇథనాల్ ప్లాంట్, జీరో వేస్ట్ తో పాటు వెదురు మొక్క అన్ని భాగాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. రాష్ట్రంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రూ. 200 కోట్ల ప్రోత్సాహాన్ని ఇస్తుందని అధికారులు తెలిపారు.
ఇది నాలుగు ఈశాన్య రాష్ట్రాల నుంచి 5 లక్షల టన్నుల ఆకుపచ్చ వెదురును సేకరిస్తుంది. దీని వలన 50 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది.
కొత్త ప్రాజెక్ట్ లు..
నుమాలిఘర్ లోని నుమాలి ఘర్ రిఫైనరీలో రూ. 7,230 కోట్లతో నిర్మించనున్న పెట్రో ప్లూయిడైజ్డ్ కాటలిక్ క్రాకర్ యూనిట్ ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన అంతకుముందు దరాంగ్ జిల్లాలోని మంగళ్ డోయ్ లో రూ. 6,300 కోట్ల విలువైన ఆరోగ్య, మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు. దరంగ్ మెడికల్ కాలేజీ, హస్పిటల్ నిర్మాణం, నర్సింగ్ కాలేజీ, జీఎన్ఎం స్కూల్ నిర్మాణం కూడా ప్రారంభించారు.
రోడ్డు, వంతెన ప్రాజెక్ట్ లు
రాష్ట్రంలో రూ. 12 00 కోట్ల అంచనా వ్యయంతో నరేంగీ-కురువా వంతెన, అస్సాంలోని కామరూప్, దరంగ్ జిల్లాలను, మేఘాలయలోని రిభోయ్ ను కలిపే 118.5 కిలోమీటర్ల పొడవైన గువహాటి రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ కు ప్రధాని శంకుస్థాపన చేశారు. దీని ఖర్చు రూ.4,530 కోట్లుగా అంచనా వేశారు.
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
తన ప్రసంగంలో ఇజ్రాయెల్ రక్షణ ఛత్రం లాగే సుదర్శన చక్ర గురించి మోదీ ప్రస్తావించారు. ఇది స్వదేశీయంగా అభివృద్ది చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్ధాలుగా అస్సాం ను పాలించిందని, కానీ బ్రహ్మపుత్రా నదీపై కేవలం మూడు వంతెనలు మాత్రమే నిర్మించిందని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో పది బ్రిడ్జిలను నిర్మించిందని చెప్పుకొచ్చారు. ఆక్రమిత భూమి నుంచి చొరబాటుదారులను తరిమి కొట్టి, రైతులకు అప్పగించిన సీఎం హిమాంత బిశ్వ శర్మను ఆయన ప్రశంసించారు.
అభివృద్ది..
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్ అని, అస్సాం వృద్దిరేటు 13 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ‘‘డబుల్ ఇంజన్ ప్రభుత్వ కృషి వల్ల ఇది సాధ్యమైంది.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అస్సాంను ఆరోగ్య కేంద్రంగా అభివృద్ది చేస్తున్నాయి. వికసిత్ భారత్ కలను సాధించడంలో ఈశాన్య ప్రాంతాలకు పాత్ర ఉంది’’ అని ప్రధాని అన్నారు.