మియా ముస్లిం జనాభాపై అస్సాం సీఎం ఆందోళన
అస్సామీయులను రక్షించుకోవడానికి కొత్త చట్టాలు తెస్తామని హమీ
By : The Federal
Update: 2025-10-11 09:30 GMT
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం మియా ముస్లింలకు హెచ్చరిక జారీ చేశారు. ఈశాన్య భారతాన్ని మొత్తం ఆక్రమిస్తూ అతిపెద్ద కమ్యూనిటీగా మారడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ సొంత ప్రజలను రక్షించుకోవడానికి త్వరలో చట్టాలు చేస్తామన్నారు. ఈశాన్య రాష్ట్రాలలో బెంగాల్ భాష మాట్లాడే ముస్లింలను మియా ముస్లింలుగా పిలుస్తారు. వీరి జనాభా రాబోయే కొన్ని సంవత్సరాలలో 40 శాతంగా మారే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ.. దిబ్రూఘర్ లో విలేకరులతో మాట్లాడారు. ‘‘వచ్చే జనాభా లెక్కలు పూర్తయి ఫలితాలు వెలువడే సమయం వరకూ మియా ముస్లిం జనాభా మొత్తం జనాభాలో దాదాపుగా 38 శాతంగా ఉంటారని అనుకుంటున్నాము. అప్పుడే వారే ఇక్కడ అతిపెద్ద కమ్యూనిటీగా ఉంటారు. ఇది అస్సాం వాస్తవికత’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
మియా అనే పదాన్ని అస్సాంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలకు ఉపయోగించారు. నిజానికి ఇది చాలా అవమానకరమైన పదం. బెంగాలీ మాట్లాడని ప్రజలంతా వారిని బంగ్లాదేశ్ వలసదారులుగా భావిస్తారు. ఇటీవల సంవత్సరాలలో దీనిని ధిక్కార పదంగా భావిస్తున్నారు.
‘‘గత ఐదు సంవత్సరాలలో జరుగుతున్న పని 30 సంవత్సరాల క్రితం ప్రారంభించి ఉంటే అస్సాంలో.. ఈశాన్యంలో ఇంత పరిస్థితి ఉండేది కాదు’’ అని హిమాంత బిశ్వశర్మ వాదించారు.
‘‘ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. దానిని ఆశించిన స్థాయికి తీసుకెళ్తాం’’ అని ఆయన చెప్పారు. అస్సామీయులను రక్షించడానికి, వారికి సురక్షితమైన భవిష్యత్ ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు శర్మ చెప్పారు.
‘‘రాబోయే అసెంబ్లీ సమావేశాలలో రెండు ముఖ్యమైన చట్టాలను ప్రవేశపెడతాము. వాటి గురించి నేను ఇప్పుడూ పెద్దగా చెప్పను కానీ, మన సమాజం, భూమి, ఇల్లు(జాతి, మతి, భేటీ) కాపాడుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి’’ అని సీఎం అన్నారు. మియాలను ఒత్తిడిలో ఉంచాలని చెప్పిన ఆయన, దీర్ఘకాలికంగానే ఇవి చేయగలిగితే పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని స్థానిక జనాభాను మైనారిటీలుగా చేయడానికి ఒక మతం ప్రజల నుంచి దండయాత్రను ఎదుర్కొంటున్నారని, స్థానిక ప్రజల జనాభా స్థితిగతులను మార్చడానికి వివిధ ప్రాంతాలలో భూమిని ఆక్రమించుకుంటున్నారని అస్సాం సీఎం హిమాంత బిశ్వ శర్మ గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు.
తన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలలో ఏకకాలంలో బాగా పనిచేస్తోందని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ భారీ ఆధిక్యంతో అధికారాన్ని నిలుపుకుంటుందని శర్మ ధీమా వ్యక్తం చేశారు.
‘‘వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని నాకు వందశాతం నమ్మకం ఉంది. ఎన్నికలు మాకు ప్రధాన సమస్య కాదు. ఉద్యోగాలు ఇవ్వడం, భూమి పట్టాలు ఇవ్వడం మా ప్రధాన సమస్యలు’’ అని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి గత నెలలో అస్సాం పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం చొరబాటుదారులకు మద్దతు ఇస్తోందని, వారిని అక్రమంగా స్థిరపరిచి రాష్ట్రం జనాభా స్వరూపాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.