మణిపూర్ లో మరోసారి రెండు గ్రామాల మధ్య అలజడి

భూ వివాదంపై పరస్పరం దాడి చేసుకున్న రెండు నాగా గ్రామాలు;

Translated by :  Chepyala Praveen
Update: 2025-05-01 10:37 GMT

ఈశాన్య రాష్ట్రాలలో మరోసారి అలజడి రేగింది. భూ వివాదాలకు సంబంధించి రెండు నాగా గ్రామాల ప్రజల మధ్య జరిగిన ఘర్షణలో 12 మంది భద్రతా సిబ్బందితో సహ కనీస 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మణిపూర్ లోని తమెంగ్ లాంగ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించినట్లు సంబంధిత అధికారులు గురువారం వెల్లడించారు.

నిన్న సాయంత్రం ఓల్డ్ టామెంగ్ లాంగ్ గ్రామానికి చెందిన దాదాపు 2 వేల మంది నివాసితులు, భూ వివాదంపై మెమోరాండం సమర్పించడానికి కమిషనర్, ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న సందర్భంగా ప్రత్యర్థి గ్రామం వారు ఈ గుంపుపై దాడి చేశారు.

డైలాంగ్ గ్రామానికి చెందిన నివాసితులు ఊరేగింపుపై దాడి చేశారని, దీనితో రెండు వర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయని అధికారులు వెల్లడించారు. సమీపంలోని డ్యూయిలాంగ్ గ్రామ ప్రజలు కూడా డైలాంగ్ కు మద్దతుగా పోరాటంలో పాల్గొన్నారని వారు తెలిపారు.
హింసాకాండ సమయంలో ప్రజాపనుల శాఖ(పీడబ్ల్యూటీ) భవనానికి నిప్పు పెట్టారని అధికారులు తెలిపారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.
ఈ హింసలో భద్రతా సిబ్బంది గాయపడటంపై ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఘర్షణల తరువాత జిల్లా ప్రధాన కార్యాలయ పట్టణంలో అలాగే డైలాంగ్, డ్యూయిలాంగ్, ఓల్డ్ టామెంగ్ లాంగ్ సరిహద్దు ప్రాంతాలలో బీఎన్ఎస్ సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించబడ్డాయి.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని నోటిఫికేషన్ తెలిపింది. నాగా కమ్యూనిటీ తమెంగ్ లాంగ్ లో నివసిస్తుందని, రెండు గ్రామాల మధ్య సరిహద్దు విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఈ ఘర్షణ జరిగిందని ఇంఫాల్ లో ఒక అధికారి తెలిపారు.
మే 2023 లో ప్రారంభమైన మెయితీ- కుకీల మధ్య జరిగిన జాతీ ఘర్షణలతో దీనికి ఎటువంటి సంబంధం లేదని ఆయన అన్నారు. 


Tags:    

Similar News