‘కావేరీ జలాల కోసం తమిళనాడు సీఎం స్టాలిన్ ఏం చేయబోతున్నారు?

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ జవాల వివాదం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. తమకు రావాల్సిన వాటా కోసం తమిళనాడు సీఎం స్టాలిన్ ఏం చేయబోతున్నారంటే..

Update: 2024-07-16 11:31 GMT

కర్ణాటక నుంచి రాష్ట్రానికి కావేరీ జలాలను రాబట్టుకునేందుకు అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తమిళనాడు అసెంబ్లీలో శాసనసభా పక్ష నేతలు నిర్ణయం తీసుకున్నారు. రోజూ ఒక టీఎంసీ నీటిని విడుదలచేయాలన్న కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ సూచనను కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోవడం సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. నీటిని విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీని మరో తీర్మానంలో కోరారు.

ఏమిటీ వివాదం..

ఆంగ్లేయుల కాలంలోనే కావేరీ జలాల కోసం తమిళనాడు, కర్ణాటక మధ్య గొడవ మొదలైంది. 1892లో ఓసారి, 1924లో మరోసారి మద్రాస్‌ ప్రెసిడెన్సీ, మైసూరు రాజవంశీకుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఎగువన ఉన్న రాష్ట్రాలు ఏవైనా ప్రాజెక్టులు నిర్మించాలంటే లోతట్టు రాష్ట్రాల అనుమతి పొందాలి. నది ప్రవహించే ప్రతి రాష్ట్రానికి ఆయకట్టు పరిధి మేరకు నీటిని వినియోగించుకునే అవకాశం కల్పించారు. 50 ఏళ్ల కాలపరిమితి వరకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ తరవాతే అసలైన వివాదం మొదలైంది. ఆ ఒప్పందం ముగియగానే కర్ణాటక రాష్ట్రం నీటి మళ్ళింపు మొదలుపెట్టింది. కావేరీ నదిపై హారంగి, హేమావతి, కృష్ణరాజ సాగర, కబిని జలాశయాలు నిర్మించారు. వాటిలో 124 అడుగుల సామర్థ్యమున్న కృష్ణరాజ సాగర కర్ణాటక రాజధాని బెంగళూరుకు తాగునీరు అందిస్తుంది. కర్ణాటక నుంచి తమిళనాడుకు ప్రవహించే కబిని నదిపై జలాశయాన్ని 50 ఏళ్ల ఒప్పందం ముగిసిన తరవాత తమను సంప్రతించకుండానే నిర్మించారని తమిళనాడు 1974లో కోర్టుకెక్కింది. ఈ గొడవ పరిష్కరించేందుకు 1990లో ఏర్పాటైన కావేరీ జల వివాద ట్రైబ్యునల్‌ (సీడబ్ల్యూడీటీ) 2007లో తుది తీర్పు వెల్లడించింది. దాని ప్రకారం తమిళనాడుకు 404.25 టీఎంసీలు, కర్ణాటకకు 284.75 టీఎంసీలు, కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7టీఎంసీల నీటిని వాడుకునే వీలుంది. ఓ సాధారణ నీటి ఏడాదిలో కావేరి బేసిన్‌లో 740 టీఎంసీల నీటి లభ్యత ఉంటేనే ఈ తీర్పు పరిగణనలోకి వస్తుంది. ఇక్కడే రాష్ట్రాల మధ్య పుట్టుకొచ్చే వ్యాజ్యాలు సీడబ్ల్యూడీటీకి సవాలుగా మారాయి. 2007 నుంచి సమృద్ధిగా వర్షాలు పడటంతో కర్ణాటక నుంచి నిబంధనల ప్రకారం తమిళనాడుకు 12టీఎంసీల నీరు తరలి వెళ్ళింది. 2013లో కర్ణాటకలో కరవు పరిస్థితులు నెలకొనడంతో ఒక టీఎంసీ నీటినే మెట్టూరు జలాశయానికి విడుదల చేశారు. మళ్ళీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులే తలెత్తాయి. ముఖ్యంగా, జల వివాదాలు తరచూ తలెత్తకూడదంటే నదీ జలాల పంపిణీపై సరైన విధివిధానాల రూపకల్పనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Similar News