హిందూ ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్న పవన్‌ కళ్యాణ్‌

హిందూ ధర్మ ప్రచారం చేసే వారి పనిని ఏపీ ఉప ముఖ్యమంత్రి తన బాధ్యత అనుకున్నారా? దేశంలో తనను మించిన హిందుత్వ వాది లేడని పీఎం వద్ద మార్కులు కొట్టేయ నున్నారా?

Update: 2024-09-23 03:02 GMT

భాతర దేశంలో హిందూ ధర్మ పరిరక్షణ అనగానే మొదట బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగదళ్‌ వంటి సంస్థలు గుర్తుకొస్తాయి. అయితే జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్‌ కళ్యాణ్‌ ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలను మరిపిస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మ వ్యాప్తి కోసం ఆయన చేస్తున్న దీక్షలు, పూజలు పలువురిలో చర్చకు దారి తీసాయి.

తాను సనాతన ధర్మాన్ని నమ్ముతాను. ఎవరికైనా దేవుడంటే భయమూ, భక్తీ ఉండాలి. అప్పుడే సమాజం బాగుంటుంది అనే మాటలు పవన్‌ కళ్యాణ్‌ నుంచి చాలా సార్లు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. డిప్యూటీ సీఎం హోదాలోనే ఆయన 11 రోజుల పాటు దీక్ష చేసి ప్రభుత్వంలో ఉన్న అందరి కంటే తనకే అధికంగా భక్తీ భావం ఉన్నట్లు చాటుకున్నారు. సీఎం చంద్రబాబుతో సహా ప్రభుత్వంలోని ఇతర పెద్దలంతా మొక్కులు చెల్లించుకుంటే పవన్‌ కళ్యాణ్‌ మాత్రం దీక్షలు పూని ప్రత్యేకతను నిరూపించుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసే సమయంలో వారణాసి వెళ్లిన పవన్‌ కళ్యాణ్‌ అక్కడి వారాహి అమ్మ వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. తనకు ఉప ముఖ్యమంత్రి పదవి రావడం, తన పార్టీ నుంచి బరిలోకి దిగిన వారందరూ గెలవడం, అమ్మ వారి అనుగ్రహం అనుకున్నారో ఏమో కానీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు తీసుకోగానే దీక్షలు చేపట్టి బీజేపీ వారి కంటే పవన్‌ కళ్యాణ్‌కే ఎక్కువ భక్తి భావం ఉందని నిరూపించారు.
నిజానికి భారతీయ జనతా పార్టీ హిందూ భావజాలానికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలోను పాల్గొంటుంది. ఆ సిద్ధాంతాల మీదే ఆ పార్టీ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్న వ్యక్తుల్లో పవన్‌ కళ్యాణ్‌ ముందు వరుసలోకి వచ్చారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని మంట గలిపిందని, 219 హిందూ దేవాలయాలను జగన్‌ ప్రభుత్వం అపవిత్రం చేసిందని ఆరోపణలు కూడా చేశారు. ఇలాంటి విమర్శలు సహజంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వస్తుంటాయి. కానీ పవన్‌ కళ్యాణ్‌ ఈ విమర్శలు చేయడం వెనుక వారి కంటే తానే హిందూ ధర్మం పరిరక్షణ బాధ్యతలు మోస్తున్నట్లు చూసే వారందరికి అనిపిస్తోందనే చర్చ కూడా వినిపిస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ కూడా అటువంటిదే తనకు కావాలనే ఆలోచనల్లో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తిరుపతి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కలియుగ దైవమైన వెంకటేశ్వరుని ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో గొడ్డు కొవ్వును కల్తీ చేసి వాడారని, ఇది తీరని ద్రోహమని, తనకు తానుగా దేవుడిని క్షమించమని కోరుతూ ప్రాయశ్చిత్త దీక్షను పవన్‌ కళ్యాణ్‌ చేపట్టారు. ఇలాంటి సందర్భాల్లో ఈ రకమైన దీక్షలు బీజేపీ వారే చేస్తుంటారని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఆ పాత్రను పవన్‌ కళ్యాణ్‌ చేపట్టారని పలువురు చర్చించుకోవడం విశేషం.
ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ దీక్షలు చేపట్టాలన్నా, కలిసి చర్చించుకుని ముందుకు అడుగులు వేస్తారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ విషయంలో ఈ చర్చ జరిగిందా? లేదా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఏ చర్చ లేకుండా పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి ఉంటే బీజేపీ భావజాలం దాదాపు పూర్తి స్థాయిలో పవన్‌ కళ్యాణ్‌కు ఒంట బట్టినట్టే అనే చర్చ సాగుతోంది.
కలియుగ దైవమైన వెంకటేశ్వరుని ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం విశ్వవ్యాప్తమైందంటే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆందోళనలు సహజంగా మిన్నునంటే అవకాశాలు ఉంటాయి. కానీ ఏపీలో అలాంటి సంఘటనలు ఏమీ చోటు చేసుకోలేదు. అక్కడక్కడ చిన్న ఆందోళనలు, ప్రకటనలతో సరిపెట్టారు. ఆదివారం మాత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇంటిని భారతీయ యువ మోర్చా కార్యకర్తలు ముట్టడించారు. బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, ఇతర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటనలకే పరిమితమయ్యారు. హిందూ ధర్మ ప్రచార బాధ్యతలు పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌లో నెత్తికెత్తుకున్నారనే చర్చలు జోరందుకున్నాయి.
Tags:    

Similar News