నాలాపైనే జన్వాడ ఫాం హౌస్, ప్రభుత్వానికి సర్వే నివేదిక
కేటీఆర్ లీజుకు తీసుకున్న జన్వాడ ఫాం హౌస్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.ఈ ఫాం హౌస్ నాలా,బఫర్ జోన్ భూమిని ఆక్రమించి నిర్మించారని అధికారుల సర్వేలో వెల్లడైంది.
By : The Federal
Update: 2024-09-23 01:23 GMT
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామంలోని కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫాం హౌస్ బుల్కాపూర్ నాలాను ఆక్రమించి నిర్మించారని అధికారుల సర్వేలో వెల్లడైంది. బుల్కాపూర్ నాలాకు చెందిన 14 గుంటల భూమిని ఫాంహౌస్ నిర్మాణానికి ఆక్రమించారని అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో తేల్చారు.
- రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారుల ఉమ్మడి సర్వేలో బుల్కాపూర్ నాలాపై ఫాం హౌస్ ప్రహరీగోడ, గేటు నిర్మించారని గుర్తించారు.
- జన్వాడ ఫాంహౌస్ నిర్మాణంపై 2020వ సంవత్సరంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేశారు. ఈ ఫాం హౌస్ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆరోపిస్తుండగా, ఈ ఫాంహౌస్ తన స్నేహితుడైన బి ప్రదీప్ రెడ్డిదని, తాను కేవలం దాన్ని లీజుకు తీసుకున్నానని కేటీఆర్ చెబుతున్నారు.
జన్వాడ ఫాంహౌస్ లోపల తనిఖీలకు యోచన
జన్వాడ ఫాంహౌస్ నాలా భూమిలో నిర్మించారని తేలడంతో తెలంగాణ హైకోర్టు అనుమతి పొంది, ఫాం హౌస్ లోపల తనిఖీలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. నీటిపారుదల, రెవెన్యూశాఖ అధికారులు ఉమ్మడి ఫాంహౌస్ బయట సర్వే చేసి నివేదిక సమర్పించారు. ఫాంహౌస్ లో తనిఖీలు చేసేందుకు హైకోర్టు అడ్వకేట్ కమిషనరును నియమిస్తే,ఆయన సమక్షంలోనే ఫాంహౌస్ లోపల తనిఖీలు చేయాలని భావిస్తున్నారు. ఫాం హౌస్ యజమాని బి ప్రదీప్ రెడ్డి 3,800 చదరపు అడుగుల ఫాంహౌస్ నిర్మాణానికి తాను ప్రాపర్టీ టాక్స్ చెల్లిస్తున్నానని చెబుతున్నారు.
నాలా భూమి, బఫర్ జోన్ లో ఫాం హౌస్
జన్వాడ ఫాం హౌస్ 2.24 గుంటాస్ లో నిర్మించారని రంగారెడ్డి జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. బుల్కాపూర్ నాలా బెడ్ కు చెందిన 11 గుంటాస్ భూమిని ఆక్రమించారని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. సరస్సు బఫర్ జోన్ కు చెందిన సర్వే నంబరు 313 పరిధిలోని భూమిని ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మించారని అధికారుల సర్వేలో వెల్లడైంది. దీంతోపాటు ఫాంహౌస్ కు నిర్మించిన రోడ్డు సైతం నాలా భూమిలోనే నిర్మించారని తేలింది.
కుచించుకు పోయిన బుల్కాపూర్ నాలా
బుల్కాపూర్ నాలా ఫాంహౌస్ ఆక్రమణలతో కుచించుకు పోయిందని అధికారుల సర్వేలో వెల్లడైంది. బుల్కాపూర్ నాలా 25 మీటర్లు కాగా కబ్జాలతో కేవలం ఆరు నుంచి 8 మీటర్లకు కుచించుకు పోయినట్లు సర్వేలో అధికారులు గుర్తించారు. జన్వాడ ఫాం హౌస్ ను కూల్చవద్దంటూ దాని యజమాని బి ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో దీనిపై సమగ్ర సర్వే చేశాక చర్యలు తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రంగారెడ్డి జిల్లా అధికారులు ఆగస్టు నెలలో సర్వే చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
జన్వాడ ఫాం హౌస్ అక్రమ నిర్మాణమే...
జన్వాడ ఫాం హౌస్ అక్రమ నిర్మాణమేనని, ఎలాంటి అనుతులు లేకుండా నిర్మించారని అధికారుల సర్వేలో తేలింది. జీఓ 111 ప్రకారం దీని పరిధిలోని భూముల్లో ఎలాంటి భవన నిర్మాణాలు చేపట్టకూడదు. తాను ఫాం హౌస్ కు 2015 వ సంవత్సరం నుంచి ఏడాదికి 1627 రూపాయల ఆస్తిపన్ను చెల్లిస్తున్నానని ఫాంహౌస్ యజమాని చెబుతున్నారు. కాగా అక్రమంగా అనుమతి లేకుండా నిర్మించిన ఫాంహౌస్ కు పన్ను చెల్లిస్తున్నా, దీన్ని కూల్చకుండా ఎలాంటి రక్షణ ఉండదని రంగారెడ్డి జిల్లాకు చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రెవన్యూ అధికారి చెప్పారు.
కేటీఆర్ పై డాక్టర్ లుబ్నా సార్వత్ ఆగ్రహం
నాలాను ఆక్రమించి నిర్మించిన జన్వాడ ఫాంహౌస్ ను కేటీఆర్ లీజుకు తీసుకోవడంపై చెరువుల పరిరక్షణ ఉద్యమ నాయకురాలు, క్లైమెట్ కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ లుబ్నా సార్వత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి కూడా అక్రమ నిర్మాణమైన ఫాం హౌస్ ఎలా లీజుకు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. 2022 లోనే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలపై శాటిలైట్ చిత్రాలు తీసుకొని ఫిర్యాదు చేశానని ఆమె చెప్పారు. ఈ రెండు జలాశయాలకు చెందిన 300 ఎకరాలు తగ్గించి చూపించారని ఎఫ్ టీఎల్ మ్యాపులు కూడా హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాటు చేయలేదని ఆమె ఆరోపించారు. పదివేల ఎకరాల జంటజలాశయాల విస్తీర్ణం 10వేల ఎకరాలు కాగా ఆర్టీఐ కింద ఇచ్చిన సమాచారంలో 6,300 ఎకరాలని ఇచ్చారని, కానీ అధికారులు ఆరు వేల ఎకరాలే అని పేర్కొన్నారని ఆమె వివరించారు.
The Bulkapur Nala from Bulkapur Janwada to Hussain Sagar; The Phirangivoni Nala from Chandanvelli to Ibrahimpatnam Tank; NOW IS THE TIME -Thanks, Team Climate Congress Hyderabad @RahulGandhi @AICCMedia @priyankagandhi @Director_EVDM @UNEP @COP28_UAE @UNFCCC #Hyderabad #Telangana
— Dr Lubna Sarwath (@LubnaSarwath) August 24, 2024