I.N.D.I.A కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి..

పార్లమెంటు ఉభయ సభల్లో NDA కూటమికి అవసరమైన మెజార్టీ ఉండడంతో తమ అభ్యర్థి ఎంపికకు ఆసక్తి చూపని I.N.D.I.A కూటమి పార్టీలు..;

Update: 2025-08-19 08:44 GMT
Click the Play button to listen to article

భారత ఉపరాష్ట్రపతి పదవికి I.N.D.I.A కూటమి తరుపున సుప్రీంకోర్టు(Supreme Court) మాజీ జడ్డి సుదర్శన్ రెడ్డి(Sudershan Reddy) పోటీచేయనున్నారు. కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Kharge) ఆయన పేరును మంగళవారం ప్రకటించారు. కాగా కొన్ని గంటల క్రితమే ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్న సీపీ రాధాకృష్ణన్‌.. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రేపు(ఆగస్టు 19) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీలో ప్రధాని మోదీని, ఇతర మంత్రులతో సమావేశమయ్యారు. జూలైలో జగదీప్ ధంకర్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9న ఎన్నిక జరుగుతుంది.

ఎవరీ సుదర్శన్ రెడ్డి ?

సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైరయ్యారు. గతంలో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. గోవాకు మొదటి లోకాయుక్తగా కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి.. ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించారు. నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ ఆగస్టు 21.

సుదర్శన్ రెడ్డికి I.N.D.I.A కూటమి పార్టీల మద్దతు..

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కూడా సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ'బ్రెయిన్ తెలిపారు. పార్లమెంటు ఉభయ సభలలో ఉపరాష్ట్రపతి ఎంపికకు NDA కూటమికి అవసరమైన మెజార్టీ ఉండడంతో I.N.D.I.A కూటమి పార్టీలు తమ అభ్యర్థిని ప్రతిపాదించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం.

మరికొంతమంది పేర్లు..

ఉపరాష్ట్రపతి పదవికి సుదర్శన్ రెడ్డి పేరుతో పాటు మరికొంత మంది పేర్లను పరిశీలించినట్లు సమాచారం. జాబితాలో ఇస్రో మాజీ శాస్త్రవేత్త మైలస్వామి అన్నాదురై, మహాత్మగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ కూడా ఉన్నారని తెలుస్తోంది.

వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏ అదే రాష్ట్రానికి చెందిన సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. 

Tags:    

Similar News