ఢిల్లీ ఎన్నికలు | మోదీ, కేజ్రీవాల్, ప్రియాంక ఏమన్నారు?

"ప్రజా తీర్పు సర్వోన్నతం" అని పేర్కొన్న ప్రధాని మోదీ. మరి ఆప్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎలా స్పందించారు?;

Update: 2025-02-08 12:00 GMT
Click the Play button to listen to article

ఢిల్లీ అసెంబ్లీ (Delhi polls) ఎన్నికల్లో బీజేపీ(BJP) భారీ విజయానికి చేరువవుతున్న నేపథ్యంలో.. ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ.. "ప్రజా తీర్పు సర్వోన్నతం" అని వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సుపరిపాలనే తమను గెలిపించాయని ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఇక ఢిల్లీ సమగ్రాభివృద్ధికి ఏ మాత్రం వెనుకాడకుండా పనిచేస్తాం. అలాగే భారత్ నిర్మాణంలో ఢిల్లీ కీలక పాత్ర పోషించేలా చేస్తాం" అని హామీ ఇచ్చారు.


"ఇక కొత్త యుగంలోకి" – అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫలితాలపై స్పందించారు. "ఇది మోసపూరిత పాలనకు ముగింపు. నూతన యుగానికి ఆరంభం. మురుగు సమస్య, బ్రష్టాచార పాలనకు ఢిల్లీ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు,"అని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో ఢిల్లీ ప్రపంచంలో నెంబర్ వన్ రాజధాని అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

"అభివృద్ధి చెందిన ఢిల్లీ అవసరం" – రాజ్‌నాథ్ సింగ్

కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. "అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ఢిల్లీ అభివృద్ధి అవసరం. డబుల్ ఇంజిన్ సర్కారుతో అది సాధ్యం," అని పేర్కొన్నారు.

"ప్రజలు అండగా నిలిచారు" – నడ్డా

బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా మాట్లాడుతూ.. "ఈ భారీ విజయం ప్రజలు మోదీ పాలనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఢిల్లీ ప్రజలు అవినీతి, మోసపూరిత పాలనను వ్యతిరేకించారు," అని పేర్కొన్నారు.

"ఢిల్లీని బీజేపీ పూర్తిగా మారుస్తుంది" – నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. "ఈ ఫలితాలతో బీజేపీ ఢిల్లీకి సుపరిపాలన అందించబోతోంది. ఢిల్లీ ప్రజలకు సరైన మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం," అని అన్నారు.

"ఈ గెలుపు కేజ్రీవాల్ పాలనకు వ్యతిరేకం" – కాంగ్రెస్

"ఇది మోదీ పాలనను సమర్థించే ఓటింగ్ కాదు, కేజ్రీవాల్ పాలనను తిరస్కరించే ఓటింగ్. కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతిని ప్రజలు ఖండించారు. 2030లో మళ్లీ కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తుంది" అని జైరాం రమేష్ ధీమా వ్యక్తం చేశారు.

"మార్పు కోరుకున్నారు" – ప్రియాంక గాంధీ

"ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారు. మిగిలిన వాళ్లం మరింత కష్టపడాలి, ప్రజల కోసం నిలబడి పోరాటం చేయాలి," అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.

"ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం" – కేజ్రీవాల్

AAP అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమిని అంగీకరిస్తూ.."ప్రజల తీర్పును మేము గౌరవిస్తున్నాం. బీజేపీకి శుభాకాంక్షలు. అధికారంలో ఉండటం మా లక్ష్యం కాదు, ప్రజాసేవ మాకు ముఖ్యం" అని చెప్పారు.

"బీజేపీ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడుతాం" – అతిశీ

ఆప్ నేత, ముఖ్యమంత్రి అతిశీ మాట్లాడుతూ.. "ఈ ఓటమి తాత్కాలికమైనది, ప్రజల కోసం మా పోరాటం కొనసాగిస్తాం," అని పేర్కొన్నారు.

"AAP అవినీతి పాలనలో మునిగిపోయింది" – అన్నా హజారే

కేజ్రీవాల్ గురువు అన్నా హజారే మాట్లాడుతూ.. "ఆప్ ప్రభుత్వం మద్యం పాలసీతో అవినీతిలో మునిగిపోయింది. ప్రజలు వారి వాస్తవ రూపాన్ని గుర్తించారు," అని పేర్కొన్నారు.

"నిజాయితీని గెలిపించారు" – ఏక్‌నాథ్ షిండే

"ఢిల్లీ ప్రజలు అబద్ధపు వాగ్దానాలను తిరస్కరించారు. ఇది మోదీ హామీల మాయాజాలం కాదు, నిజాయితీ, సుపరిపాలనకు నిదర్శనం," అని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు.

"ఢిల్లీలో విపత్తు ముగిసింది" – జ్యోతిరాదిత్య సింధియా

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ.. ‘‘ఢిల్లీలో AAP పాలన ముగిసింది. ఇక అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది" అని పేర్కొన్నారు.

ఈ ఎన్నికల ఫలితాలు మోదీ నాయకత్వానికి బలమైన మద్దతుగా నిలవగా.. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయినట్లు స్పష్టమైంది. ఇక బీజేపీ నాయకత్వం ఢిల్లీని ఎలా మారుస్తుందో చూడాలి!


Tags:    

Similar News