‘దయచేసి అర్థం చేసుకోండి’

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీకి ఓడించేందుకు శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ ప్లానేంటి?

Update: 2025-12-01 11:05 GMT
Click the Play button to listen to article

ముంబై స్థానిక సంస్థల(Mumbai civic polls) ఎన్నికలలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేయడం మంచిదికాదన్నారు శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut). అలా చేస్తే బీజేపీ(BJP) లాభపడుతుందన్నారు. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) మహా వికాస్ అఘాడి(Maha Vikas Aghadi )తో జతకట్టాలని హస్తం పార్టీని కోరారు. ఈ విషయంపై తాను కాంగ్రెస్ హైకమాండ్‌తో కూడా మాట్లాడతానని చెప్పారు.

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. అయితే జనవరి 31, 2026 నాటికి పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


కాంగ్రెస్ ఒంటరి పోరు..

గత నెలలో ముంబై కాంగ్రెస్ MNS‌తో పొత్తుకు నో చెప్పింది. ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమని పేర్కొంది. ఈ నేపథ్యంలో రౌత్ తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. "కాంగ్రెస్‌తో చర్చలు జరుగుతున్నాయి. బీహార్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో విశ్వాసం పెరిగి, ముంబైలో స్వతంత్రంగా పోటీ చేయాలనుకుంటే.. అది వారి ఇష్టం" అని పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో..మొత్తం 243 స్థానాలకు ఎన్డీఏ 200‌కి పైగా సీట్లను గెలుచుకుని అధికారాన్ని నిలుపుకుంది. ప్రతిపక్ష మహాఘటబంధన్ కూటమిలో భాగమైన కాంగ్రెస్‌కు కేవలం ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి.


‘కలిసి పోరాడితేనే ఓడించగలం..’

"డిసెంబర్ రెండో వారంలో నేను ఢిల్లీ వెళ్తున్నాను, వీలయితే కాంగ్రెస్ హైకమాండ్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తా. ముంబైలోని మహా వికాస్ అఘాడితో కాంగ్రెస్ జతకట్టాలన్నది మా వైఖరి. అలాగయితేనే బీజేపీని ఓడించగలం," అని రౌత్ అన్నారు.


‘బీజేపీ భ్రష్టుపట్టించింది’

మహారాష్ట్రలో ఎన్నికల సంస్కృతిని బీజేపీ భ్రష్టుపట్టించిందని ఆరోపించారు. మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ ఎన్నికలకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ఎప్పుడూ ఉపయోగించలేదన్నారు. డబ్బు కోసం ప్రజలు రాష్ట్ర భవిష్యత్తును అమ్మేస్తున్నారని మండిపడ్డారు.


‘ఓటును అమ్ముకోవద్దు..’

"డబ్బుతో మనుషులను కొనవచ్చు. ప్రజలు తమ పిల్లల భవిష్యత్తును రూ. 10వేల నుంచి 15వేలకు అమ్మేస్తున్నారు. నిరుద్యోగం తాండవిస్తోంది. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. మహిళల భద్రత గాలికొదిలేశారు. దయచేసి ఎవరూ ఓటును అమ్ముకోవద్దు.’’ అని రౌత్ విజ్ఞప్తి చేశారు. 

Tags:    

Similar News