ఓటరు వీపు రుద్దుతున్న సర్పంచ్ అభ్యర్థి భర్త

మంచిర్యాల జిల్లా ముత్యంపేట పంచాయతీలో అభ్యర్థి విన్నూత్న ప్రచారం

Update: 2025-12-01 12:05 GMT

ఎన్నికలు వచ్చాయంటే ఓటర్ల మీద ప్రేమ ఒలకబోసే రాజకీయ నాయకులు ఎక్కువగానే ఉంటారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ఇటువంటివి కామన్. కానీ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన ఒక మహిళ మరుక్షణమే ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఆదివారం నామినేషన్ వేసి ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఓ ఓటరు ఇంటి ముందు అభ్యర్థి ఆగారు. ఇంటి ఆరు బయట నర్సయ్య అనే ఓటరు స్నానం చేస్తున్నారు.

ఇదే మంచి అవకాశం అని భావించిన అభ్యర్థి భర్త విన్నూత్న ప్రచారం చేశారు. నర్సయ్య అనే ఓటరు వీపు రుద్దుతూ తన భార్యకే వోటు వేయాలని ప్రాధేయపడ్డారు.

మంచిర్యాల జిల్లా ముత్యంపేట పంచాయతీలో 6వ వార్డులో పోటీ చేస్తున్న కొండా రజిత తన భర్తతో కలిసి చేస్తున్న ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. రజిత భర్త ఓ ఓటరుకు స్నానం చేయించడం పలువురిని ఆకర్షించింది. అభ్యర్థి భర్త ఓటరు వీపు రుద్దేసమయంలో నగేశ్ అనే వ్యక్తి వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. తన భార్యకే ఓటు వేయాలని రజిత భర్త ప్రాదేయపడటం అందరినీ ఆకర్షించింది. ఎన్నికల వేళ ఓటర్లను ప్రాధేయపడే అభ్యర్థులు గెలిచిన తర్వాత మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమౌతున్నారని గ్రామస్థులు అంటున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు విలువను గుర్తించి సరైన అభ్యర్థికి ఓటు వేయాలని ప్రజాస్వామిక వాదులు కోరుతున్నారు.

Tags:    

Similar News