వద్దన్నా వస్తున్న సర్పంచ్ స్థానాలు
వరంగల్, మహబూబాబాద్‌లో ప్రాధేయపడి పోటీలో నిల్చోపెడుతున్న గ్రామస్థులు.
తెలంగాణ పంచాయతీ రాజ్ ఎన్నికల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం కోసం భారీ మొత్తంలో ఆఫర్లు ప్రకటిస్తుంటే.. మరికొన్ని గ్రామాల్లో కొందరికి వద్దన్నా సర్పంచ్ స్థానాలు వస్తున్నాయి. మహబూబ్‌బాద్ దంతాలపల్ల మండలం దాట్ల గ్రామంలో రాములమ్మ అనే మహిళ కాళ్లపై పడి మరీ సర్పంచ్‌గా పోటీ చేయాలని కోరుతున్నారు. అదే విధంగా వరంగల్ జిల్లాలో ఆశాలపల్లి గ్రామ సర్పంచ్ స్థానానికి కూడా ఒక మహిళ దాదాపు ఏకగ్రీవం అయ్యారు. దీంతో తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సర్పంచ్ పదవుల కోసం కొందరు సర్వం ఇవ్వడానికి ముందుకొస్తుంటే.. మరికొందరు తమకొద్దని దూరం తోస్తున్నా పదవి వారికి వెంటే వస్తుంది.
ఎస్సీ మహిళకు కేటాయించడమే కారణం..
ఆశాలపల్లి సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించడం జరిగింది. కాా గ్రామంలో ఎస్సీ కుటుంబాలే లేవు. అయితే జనగామ జిల్లాకు చెందిన కొంగర మల్లమ్మ, వెంకయ్య దంపతులు పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం ఆశాలపల్లికి వచ్చారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. గ్రామంలో ఎస్సీ ఓటర్లుగా నమోదయింది కూడా వారే. వారికి ముగ్గురు కూతుళ్లు ఉన్నప్పటికీ వారికి పెళ్లిళ్లు అయిపోయాయి. ఇటీవల మల్లమ్మ భర్త వెంకయ్య.. ప్రమాదవశాత్తు కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో ఎస్సీ ఓటరుగా మల్లమ్మ ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు రిజర్వేషన్ ప్రకారం.. ఆశాలపల్లి సర్పంచ్ స్థానం మల్లమ్మకు ఖరారు అయింది. ఆమె ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
కాగా సర్పంచ్ రిజర్వేషన్‌ను మార్చాలని ఇప్పటికే మాజీ సర్పంచ్ కిశోర్ యాదవ్‌తో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి సహా ఇతర నాయకులు అధికారులు వినతి పత్రం అందించారు. అయినప్పటికీ ఒకసారి ప్రకటించిన రిజర్వేషన్‌ను మార్చడం వీలుపడదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో మల్లమ్మ ఎన్నిక ఏకగ్రీవం అయినట్లే అని గ్రామస్తులు చెప్తున్నారు.
మంచి నాయకురాలు కావాలనే..
మహబూబాబాద్ దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఆ గ్రామ సర్పంచ్ స్థానం జనరల్ మహిళ కేటగిరీకి కేటాయించారు. దీంతో సర్పంచ్‌గా ఎవరిని నిలబెట్టాలన్న ఆలోచనలో గ్రామస్తులంతా పడ్డారు. గ్రామానికి మంచి నేత కావాలని భావించిన వారు.. రాములమ్మ అనే మహిళను సర్పంచ్ ఎన్నికలో పోటీ చేయాలని ప్రాధేయపడుతున్నారు. ఆమె తనకు ఆసక్తి లేదని చెప్తున్నా.. గ్రామస్తులు మాత్రం ఆమె పోటీ చేయాలని కోరుతున్నారు. దీంతో ఈ అంశం ఆసక్తికరంగా మారింది.
అయితే కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడి భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. దీంతో పోట చేయడానికి ఆమెకు ఆస్కారం లేదు. దీంతో మాజీ ఎంపీటీసీ సభ్యుడి తల్లి అయిన రాములమ్మను పోటీలో నిలబెట్టాలని భావించారు. ఈ విషయంలో కొడుకు ఎంత చెప్పినా రాములమ్మ అంగీకరించలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక.. గ్రామ కార్యకర్తలు, స్థానికులు కలిసి రాములమ్మ ఇంటికి వెళ్లి కాళ్లు గడ్డాలు పట్టుకుని బతిమిలాడుకున్నారు. చివరకు సర్పంచ్ పోటీలో నిలబడటానికి ఆమె అంగీకరించారు.