Shocking incident : నాలుగేళ్ళ చిన్నారిపై ఆయా దాడి
తండ్రిపైన కోపాన్ని ఆయన కూతురిపైన చూపించి చివరకు కటకటాల పాలైన ఘటన వెలుగుచూసింది.
నగరంలోని ఒక ప్రైవేటు స్కూలులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తండ్రిపైన కోపంతో ఒక ఆయా నాలుగేళ్ళ చిన్నారిపై కర్కశంగా వ్యవహరించింది. తండ్రిపైన కోపాన్ని ఆయన కూతురిపైన చూపించి చివరకు కటకటాల పాలైన ఘటన వెలుగుచూసింది. జీడిమెట్ల ఇన్స్ పెక్టర్ గడ్డం మల్లేష్ చెప్పిన వివరాల ప్రకారం షాపూర్ నగర్, ఎన్ఎల్బీ నగర్లో ఒక ప్రైవేటు స్కూలుంది.
ఆ స్కూలులో లక్ష్మి ఆరు ఏళ్ళ నుండి ఆయాగా పనిచేస్తోంది. ఆరునెలల క్రితం ఒడిస్సా నుండి వచ్చిన కలియో, సంతోషి దంపతులు అదే స్కూలులో కాపలాదారులుగా పనికి కుదిరారు. వీరికి నాలుగేళ్ళ కూతురుంది. ఆచిన్నారిని తాముపనిచేస్తున్న స్కూలులోనే నర్సరీలో చేర్పించారు.
ఈమధ్యనే ఆయా లక్ష్మికి, చిన్నారి తండ్రి కలియోకు ఏదో గొడవైంది. ఆ గొడవను మనసులో పెట్టుకున్న ఆయా మొన్న శనివారం చిన్నారిని స్కూలుభవనం వెనుకకు తీసుకెళ్ళి పాశవికంగా దాడిచేసింది. చాలాసార్లు కిందపడేసి బాగా కొట్టింది. దెబ్బలకు చిన్నారి ఏడుస్తున్నా విడిచిపెట్టకుండా కొడుతునే ఉంది. స్కూలు ప్రాంగణంలో ఎవరు లేరుకాబట్టి చిన్నారిని తాను ఏమిచేసినా ఎవరికీ తెలీదని ఆయా అనుకున్నది. అయితే ఈ ఘటన ఎలాగ వెలుగుచూసింది ?
ఎలాగంటే స్కూలు భవనం పక్కనే ఉన్న ఒక ఇంట్లో కుర్రాడు మేడపైనుండి అంతా గమనించాడు. చిన్నారిని ఆయా కొడుతుండటాన్ని తన మొబైల్లో వీడియా తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఎప్పుడైతే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందో అప్పుడే ఆ వీడియో పోలీసుల దృష్టిలో పడింది. వెంటనే అలర్టయిన పోలీసులు వీడియోలోని వివరాల ప్రకారం స్కూలుకు చేరుకుని చిన్నారి తల్లి, దండ్రులతో మాట్లడారు.
చిన్నారిని దగ్గరకు తీసుకుని ఒంటిపైన దెబ్బలను గమనించారు. చిన్నారిని వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఆతర్వాత ఆయా లక్ష్మిని అరెస్టుచేసి కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, జీడిమెట్ల ఇన్ స్పెక్టర్ పాప ఆరోగ్య పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఘటన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూలు యాజమాన్యంపైన కూడా పోలీసులు కేసు నమోదుచేశారు.