గజ్వేల్ నుంచి కొడంగల్ వరకు ఆసుపత్రులు రెడీ, డాక్టర్లు, సిబ్బంది మిస్సింగ్

సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే డాక్టర్లు లేరు? కొడంగల్ ఆసుపత్రి పని చేయక రోగుల ఇబ్బంది

Update: 2025-12-01 04:14 GMT
తెలంగాణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సజావుగా అందని సర్కారు వైద్యం

తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయలతో నిర్మించిన 25 కొత్త ఆసుపత్రులు ప్రస్తుతం భవనాలుగా మాత్రమే ఉన్నాయి. 1413 పోస్టులు మంజూరు చేసినా, వాటిలో కేవలం 111 మంది మాత్రమే విధుల్లో ఉన్నారని సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడింది. మిగతా 1302 పోస్టులు ఖాళీగా ఉండడంతో పేదలకు అందాల్సిన సరైన వైద్యం కాగితాలపైనే ఆగిపోయింది.దీంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది.


- సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచే వైద్యులు కనిపించకపోతే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 60 పోస్టులు మంజూరు చేసిన ఆసుపత్రిలో ఒక్కరిని కూడా నియమించకపోవడం ఆరోగ్య శాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

- కొత్త ఆసుపత్రుల తలుపులు తెరిచినా, లోపల డాక్టర్ కోసం ఎదురుచూసే రోగుల ముఖాల్లో నిరాశ మాత్రమే కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగా నిర్మించిన 25 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1413 మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను మంజూరు చేయగా, కేవలం 111 మంది మాత్రమే పనిచేస్తున్నారని సాక్షాత్తూ తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ జే అజయ్ కుమార్ ఆర్టీఐ లేఖ ద్వారా తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాసిన లేఖపై తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఆర్టీ నంబరు 940 పేరిట గత నెల 18వతేదీన ఇచ్చిన సమాధానంలో తెలిపారు.

పేదలకు అందని వైద్యం
రాష్ట్రంలోని బెల్లంపల్లి, చిట్యాల, లక్సెట్టిపేట, ఆర్మూర్, నార్నూర్, నర్సాపూర్ జి, గజ్వేలు, బాన్స్ వాడ, జమ్మికుంట, రామాయంపేట, కల్లూరు, చర్ల, జఫర్ గడ్, మర్రిగూడ, నారాయణ ఖేడ్, జహీరాబాద్, కోహిర్, మీర్జాపూర్, కొడంగల్, ఆలంపూర్, అచ్చంపేట, బడేపల్లి, కోస్గీ, మద్ధూరు, వీపనగండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరతతో రోగులకు సర్కారు వైద్యం అందటం లేదు.పేరుకు 25 ఆసుపత్రులున్నా వైద్యులు, వైద్య సిబ్బంది లేకపోతే సర్కారు వైద్యం పేదలకు ఎలా అందుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ప్రశ్నించారు.

సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లోనూ డాక్టర్ల కొరతే
సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో భవనం నిర్మించి 60 మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమించాల్సి ఉండగా ఒక్కర్ని కూడా నియమించలేదు. దీంతో సీఎం నియోజకవర్గంలోనే సర్కారు వైద్యం రోగులకు అందటం లేదు. కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పెంచినా వైద్యులను మాత్రం నియమించలేదని స్థానిక కొడంగల్ ప్రాంత రోగులు ఆవేదనగా చెప్పారు. వైద్యులతో పాటు పారామెడికల్ సిబ్బంది లేక రోగులకు సర్కారు వైద్యం అందకుండా పోతోంది. కొడంగల్ పట్టణంలో 50 పడకల ఆసుపత్రి నిర్మించినా, 60 మంది వైద్యులు, సిబ్బందిని మాత్రం నియమించలేదు.

22 ఆసుపత్రుల్లో భవనాలున్నా వైద్యులేరి?
ప్ర‌జ‌ల‌కు స్థానికంగా వైద్య‌సేవ‌లు అందించేందుకు తెలంగాణలో మూడు సంవ‌త్స‌రాల క్రితం 25 ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల నిర్మాణం చేప‌ట్టారు. ఆసుప‌త్రి భ‌వంతుల నిర్మాణం పూర్తి అయినా అందులో వైద్య‌సేవ‌లు అందించేందుకు త‌గిన వైద్యులు, న‌ర్సులు లేక ఈ ఆసుప‌త్రులు ప‌ని చేయ‌డం లేదు. 25 ఆసుప‌త్రుల్లో కేవ‌లం మూడింటిలో మాత్ర‌మే అర‌కొర‌గా వైద్యులు, ఇత‌ర సిబ్బంది ప‌నిచేస్తున్నారు.బెల్లంపల్లి, చిట్యాల, బడిపల్లి ఆసుపత్రుల్లోనూ అరకొర సిబ్బందినే నియమించారు. మిగిలిన 22 ఆసుప‌త్రుల‌లో ఇంత‌వ‌ర‌కు వైద్యులు, న‌ర్సులు ఇత‌ర సిబ్బంది నియామ‌కం కాని జ‌రగ‌లేదు.గ‌జ్వేల్ ఆసుప‌త్రిలో 101 మంది వైద్యులు మ‌రియు న‌ర్సులు అవ‌స‌ర‌ముండ‌గా ఇంత‌వ‌ర‌కు ఒక్కర్ని కూడా నియమించ లేదు. అచ్చంపేట‌ ఆసుపత్రిలో 101 మంది వైద్యులు, న‌ర్సులు కావాల్సి ఉండ‌గా ఒక్కరిన కూడా నియామ‌కం జ‌రుగ‌లేదు.

అత్యవసర మందులేవి?
వికారాబాద్ జిల్లా హకీంపేట మండలంలో కొత్తగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గత ఏడాది ప్రారంభించినా, రోగులకు కావాల్సిన అత్యవసర మందులు లేవు. దీంతో రోగులు అవస్థలు పడుతున్నారు. తాండూరులోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మొత్తం 66 పోస్టులు మంజూరు కాగా 24 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో రోగులకు సజావుగా వైద్యం అందటం లేదు. పారామెడికల్ సిబ్బంది లేక రోగులు పరీక్షల కోసం వేచి ఉండాల్సి వస్తుంది.దోమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరతతోపాటు మందులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మర్పల్లి, పూడూరు, ధారూర్, జిన్ గుర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది, మందులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు.

విధులకు హాజరుకాని డెప్యుటేషన్ సిబ్బంది
తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ కమిషనర్ డాక్టర్ జే అజయ్ కుమార్ అందించిన సమాచారం ప్ర‌కారం కొన్ని ఆసుప‌త్రుల్లో వేరే ఆసుప‌త్రుల నుంచి డిప్యుటేష‌న్ ప‌ద్ధ‌తిలో కొంత‌మంది వైద్యులు, న‌ర్సులు ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు.కానీ చాలా సంద‌ర్భాల‌లో డిప్యుటేష‌న్ పైన వ‌చ్చిన డాక్ట‌ర్లు, న‌ర్సులు స‌రిగా విధులకు రాక ఆసుప‌త్రులు ప‌నిచేయడం లేదు. అదీకాక ఖాళీగా ఉన్న ద‌వాఖానా భవనాల్లో అసాంఘిక శ‌క్తుల కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్నాయని స్థానిక ప్రజలు చెప్పారు.

వైద్యులు, సిబ్బందిని నియమించండి
తెలంగాణలో కొత్తగా నిర్మించిన 25 ఆసుప‌త్రుల‌కు కావాల్సిన 1302 వైద్యులు, న‌ర్సులు,ఇత‌ర సిబ్బందిని త్వరగా నియ‌మించి ఈ ఆసుప‌త్రుల‌లో వైద్య‌సేవ‌లు రోగులకు అందుబాటులో తీసుకురావాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి తాజాగా ముఖ్య‌మంత్రి ఎ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన ఆసుపత్రులు వైద్యులు, సిబ్బంది లేక ఖాళీగా ఉండటం సర్కారు వైద్యంపై పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ఖాళీలను భర్తీ చేసి ఆసుపత్రులను నిజంగా పనిచేసేలా చేయడం ఇప్పుడు తప్పనిసరి అవసరం. ఇప్పుడైనా సీఎం సారూ స్పందిస్తారా? లేదా ? అనేది వేచి చూడాల్సిందే.




Tags:    

Similar News