బీసీ రిజర్వేషన్ల చట్టబద్దత కోసం ఎందుకు పట్టుబుడుతున్నారో తెలుసా ?
42శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించకపోతే బీసీలు నష్టపోక తప్పదు
స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం బాగా వివాదాస్పదమైపోయింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను(BC Reservations) వర్తింపచేయటానికి ప్రభుత్వపరంగా చేయాల్సిన అన్నీ ప్రయత్నాలను చేసినట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్(Revanth)రెడ్డి ఇప్పటికి చాలాసార్లు చెప్పారు.
అసెంబ్లీలో మూడుసార్లు బిల్లులను తీర్మానాలు చేయించటం, తీర్మానాలను ఆమోదించాలంటు రాష్ట్రపతి, గవర్నర్లకు పంపటం లాంటి ప్రక్రియలను రేవంత్ వివరించారు. రాష్ట్రప్రభుత్వం పంపిన బిల్లులు, ఆర్డినెన్సులు రాష్ట్రపతి, గవర్నర్ దగ్గర పెండింగులో ఉండిపోయాయి.
బిల్లు, ఆర్డినెన్సుకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం దొరకదన్న క్లారిటి వచ్చేసింది. పైగా పంచాయితీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు పెట్టిన గడువు ముంచుకుని వచ్చేస్తుండటంతో వేరేదారిలేక ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలను నిర్వహించేస్తోంది.
మొదటి దశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగియగా, రెండోదశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఆదివారం మొదలైంది. ఈ నేపధ్యంలో పంచాయితీ రాజ్ శాఖ రిజర్వేషన్లను ఫైనల్ చేసింది. అందులో బీసీలకు 21.39 శాతం మాత్రమే రిజర్వేషన్లు దక్కాయి. అందుకు ప్రభుత్వం అనేక కారణాలను చెబుతోంది. ఇదేసమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీసీ సంఘాల నేతలు బీసీలకు ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్లు 17శాతం మాత్రమే అంటు నానా గోలచేస్తున్నారు.
21.39 రిజర్వేషన్లా, 17శాతం రిజర్వేషన్లా అన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల నేతలు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాల్సిందే అని పదేపదే డిమాండ్లు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చట్టబద్దత కల్సించలేనిపక్షంలో పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా గతంలోనే రేవంత్ ప్రకటించారు. పార్టీపరంగా తమకు రిజర్వేషన్లు వద్దని 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తు చట్టబద్దత కల్పించాల్సిందే అని బీసీ సంఘాల నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
రేవంత్ చెబుతున్న పార్టీపరమైన రిజర్వేషన్ల కేటాయింపుకు, బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న చట్టబద్ద రిజర్వేషన్లకు తేడా ఏమిటి ? అన్న విషయాన్ని ఒకసారి చూద్దాం. పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పించటం వల్ల బీసీలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. చట్టబద్దమైన రిజర్వేషన్లు దక్కితేనే బీసీలకు ఉపయోగం. ఎలాగంటే పార్టీపరంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించినా ఇతర పార్టీలు కూడా కేటాయించాలని ఏమీలేదు.
ఉదాహరణ చూస్తే కాంగ్రెస్ పార్టీ ముదిగొండ పంచాయితి సర్పంచ్ పదవికి బీసీ నేతను పోటీచేయించిందని అనుకుందాము. బీఆర్ఎస్, బీజేపీలు లేదా ఇతర పార్టీలు లేదా పోటీచేయాలని అనుకుంటున్న నేతలు బీసీలే అయ్యుండాలని ఏమీలేదు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేస్తున్న బీసీ నేతకన్నా ఇతర పార్టీలు లేదా నేతలు అగ్రవర్ణాలు కూడా అయ్యుండచ్చు.
ఆర్ధికంగా, సామాజికంగా బలమైన అగ్రవర్ణాల నేతలతో బీసీనేత పోటీపడలేక చేతులెత్తేసే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. అదే బీసీ సంఘాల నేతల డిమాండ్ ప్రకారం 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత దక్కితే బీసీలకు ఉపయోగముంది. ఎలాగంటే ఏపార్టీ తరపున పోటీచేసిన నేతలైనా లేదా స్వతంత్రులుగా పోటీచేస్తున్న నేతలైనా కచ్చితంగా బీసీ సామాజికవర్గమే అయ్యుండాలి. అంటే ఎంతమంది పోటీచేసినా బీసీలే అయ్యుంటారు, గెలిచే అభ్యర్ది కూడా బీసీనే అవుతాడు.
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత వల్ల ఇదే అతిపెద్ద ఉపయోగం. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత దక్కేంతవరకు 42శాతం కాదు కదా 62శాతం స్ధానాలు కేటాయించినా బీసీలకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు. అందుకనే బీసీ సంఘాల నేతలు, మేథావులు, వృత్తి నిపుణులు బీసీలకు 42శాతం రిజర్వేషన్ల చట్టబద్దత కోసం డిమాండ్లు చేస్తున్నది.