‘‘కోటీ ఉద్యోగాలు, ఏఐ మిషన్ కు ఆమోదం’’
తొలి క్యాబినేట్ లో నిర్ణయం తీసుకున్న నితీశ్ కుమార్
By : The Federal
Update: 2025-11-25 12:04 GMT
బీహార్ లో కొత్తగా కొలువుదీరిన నితీశ్ కుమార్ ప్రభుత్వం తొలి క్యాబినేట్ మీటింగ్ లో ఎన్నికల హమీని అమలు చేయడానికి నడుంబిగించింది. రాబోయే ఐదు సంవత్సరాలలో రాష్ట్ర యువతకు కోటీ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది.
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షత వహించారు. సమావేశం తరువాత బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యయ్ అమృత్ విలేకరులతో మాట్లాడారు. విస్తృత ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ది చర్చలలో కీలకమైన అంశాలు ఉన్నాయి.
సెమీకండక్టర్ తయారీ పార్క్
‘‘బీహార్ ను తూర్పు భారత్ లోనే టెక్ హబ్ గా మార్చడానికి డిఫెన్స్ కారిడార్, సెమీకండక్టర్ తయారీ పార్క్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, మెగా టెక్ సిటీ, ఫిట్ నెస్ సిటీని ఏర్పాటు చేస్తారు’’ అని ఆయన అన్నారు.
రాబోయే ఆర్థిక సంవత్సరాలో బ్యాక్ ఎండ్ హబ్ గా బీహార్ అభివృద్ది పరిచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్యాలను సాధించడానికి కొన్ని కమిటీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
‘‘రాష్ట్రంలో ప్రతిభావంతులైన, యువ పారిశ్రామికవేత్తలకు జీవనోపాధి అవకాశాలను నిర్ధారించడానికి స్టార్టప్ డొమైన్ లో ఉపాధి ఆధారిత కార్యక్రమాలకు ప్రణాళికలను సిద్ధం చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు’’ అని ఆయన చెప్పారు.
కృత్రిమ మేధ(ఏఐ)
బీహార్ ను కృత్రిమ మేధలో అగ్రగామి రాష్ట్రంగా మార్చడానికి మంత్రి మండలి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ఆమోదించిందని ఆయన అన్నారు. సోనేపూర్, సీతామర్హిలతో పాటు తొమ్మిది డివిజనల్ పట్టణాలు సహ మొత్తం పదకొండు నగరాల్లో గ్రీన్ ఫీల్డ్ టౌన్ షిఫ్ ప్రాజెక్ట్ లు అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
మూతపడిన తొమ్మిది చక్కెర మిల్లులు తిరిగి తెరిపిస్తామని, మరో 25 కొత్తవి ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన కార్యదర్శి తెలిపారు. మొన్న జరిగిన ఎన్నికలలో బీజేపీ, జేడీ(యూ) కూటమి ఘన విజయం సాధించింది.
ఇందులో బీజేపీ ప్రధాన శాఖలను ముఖ్యంగా కీలకమైన హోంశాఖను దక్కించుకుంది. ఉప ముఖ్యమంత్రి సామ్రట్ చౌదరీ ఇప్పుడు హోంమంత్రిత్వ శాఖకు దక్కించుకున్నారు. నితీశ్ కుమార్ దాదాపు 20 సంవత్సరాల పదవీకాలంలో ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నారు.
బీజేపీకి 89 సీట్లు జేడీ(యూ) కి 85 సీట్లు గెలుచుని మొదటి, రెండు స్థానాలలో ఉన్నాయి. రెండు దశాబ్ధాల తరువాత బీజేపీ పూర్తిగా బీహార్ ను, జేడీ(యూ)ను తన పరిధిలోకి తీసుకొచ్చింది.
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్, క్యాబినేట్ సెక్రటేరియట్, విజిలెన్స్, ఎన్నికలు ఇతర కేటాయించని విభాగాలను నితీశ్ కుమార్ తన వద్దనే ఉంచుకున్నారు. అదే సమయంలో బీజేపీ మిగిలిన శాఖలను దక్కించుకుంది. ప్రస్తుత మంత్రివర్గంలో దాని ఆధిపత్యం చాటుకుంది.