‘ఆప్’ గెలిచిన వాళ్లను అయినా కాపాడుకోగలుగుతుందా?
కేజ్రీవాల్ సహ ఇతర కీలక నేతల ఓటమితో ఒత్తిడిలో నాయకత్వం;
By : Gyan Verma
Update: 2025-02-09 09:28 GMT
దాదాపుగా దశాబ్ధం కంటే ఎక్కువ కాలం ఢిల్లీలో అధికారం చలాయించిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. పార్టీ అధికారాన్ని కోల్పోవడమే కాకుండా గడచిన కాలంలో తనకు అండగా నిలిచిన అనేక వర్గాల మద్ధతును కోల్పోయినట్లు తేటతెల్లం అయింది.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీ సెక్రటేరియట్ ను బంద్ చేయడం ద్వారా బీజేపీ, ఆప్ నాయకత్వానికి స్పష్టమైన సంకేతాన్ని పంపింది. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడిన వారేవరిని విడిచిపెట్టమని ప్రకటించిన నేపథ్యంలో దాని దారి ఇకముందు సులభంగా ఉండకపోవచ్చు.
ఆప్ కు ఓటమి ఓ గాయం అయితే.. దానికి ఉప్పు కలిపిన విషయం ఏంటంటే పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి సిసోడియా, కీలక నేతలు సౌరభ్ భరద్వాజ్, సోమనాథ్ భారతి వంటి కొంతమంది నాయకులు కూడా ఓడిపోయారు.
దర్యాప్తుకు సిట్..
ఆప్ ఇబ్బందులు మరింత పెరుగుతూ.. పార్టీ నాయకత్వం చేసిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఫలితాలు అధికారికంగా డిక్లేర్ చేయకముందే సెక్రటేరియట్ నుంచి ఎటువంటి పత్రాలు, ఫైల్స్, కంప్యూటర్ హర్డ్ వేర్ లు తీసుకుకెళ్లకూడదని ఎల్జీ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ ప్రభుత్వ రికార్డులను రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తరువాత అధికారులు ప్రకటించారు.
‘‘ఆప్ కు పర్యాయపదం కేజ్రీవాల్. ఇప్పుడు ఆ పార్టీకి కొత్త సంక్షోభం ఏంటంటే.. కేజ్రీవాల్ తో సహ కీలక నేతలు అందరూ ఓటమి పాలయ్యారు. సీఎం గా పనిచేసిన ఆతిశీ మాత్రమే తన స్థానాన్ని అతికష్టం మీద నిలబెట్టుకున్నారు. బీజేపీ కేజ్రీవాల్ ను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
దర్యాప్తు సంస్థలకు ఆప్ నాయకులను లక్ష్యంగా చేసుకుంటాయి. ఇవి తమ నాయకులను రక్షించుకోవడంలో మరింత కష్టతరం చేస్తాయి’’ అని ఉజ్జయినిలో ల మధ్యప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ రచయిత, డైరెక్టర్ యతీంద్ర సింగ్ సిసోడియా ‘దిఫెడరల్’ తో అన్నారు.
ఆప్ నాయకత్వానికి ముఖ్యంగా కేజ్రీవాల్, సిసోడియాకు ఉన్న సవాల్ కూడా వ్యక్తిగతమైంది. ఈ కీలక నేతలు ఇద్దరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ముందే వీరు బెయిల్ పై బయటకు వచ్చారు. కానీ ఈ అవినీతి ఆరోపణలు బీజేపీ చేసిన కుట్రగా నేతలు ప్రచారం చేసుకున్నారు. కానీ వీటిని ప్రజలు నమ్మలేదు. ఈ నేతలు ఇద్దరు ఓడిపోయారు. పార్టీ సైతం ఓటమి పాలైంది.
ఎక్సైజ్ విధానం..
కేజ్రీవాల్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసే క్రమంలో అనేక బెదిరింపులు చేశారు. ఇది ప్రజల్లో పార్టీపై విశ్వసనీయతను దెబ్బతీసింది. ఇప్పుడు పార్టీ ఓటమి, ఢిల్లీలో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో అది తీసుకున్న అన్ని కీలక నిర్ణయాలను ఇప్పుడు మరింత క్షుణ్ణంగా పరిశీలించి ఏమైన తప్పులు ఉంటే బయటకు తీసే అవకాశం ఉంది.
కేజ్రీవాల్ ప్రతి నిర్ణయాన్ని లెప్టినెంట్ గవర్నర్ తో విభేదించి ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించారు. ఇది ప్రజలకు కూడా విసుగుపుట్టించింది. మరో వైపు బీజేపీ కూడా కేజ్రీవాల్ స్పీడ్ కంట్రోల్ కు ఇదే మార్గాన్ని ఉపయోగించుకుంది.
‘‘ఢిల్లీ ప్రభుత్వ పనితీరులో నిరంతరం సమస్యలను సృష్టించడం ద్వారా ఆప్ ను ఇరుకున పెట్టడానికి బీజేపీ చేసిన ప్రయత్నం ఫలించింది. లెప్టెనెంట్ గవర్నర్, ఢిల్లీ బ్యూరోక్రసితో తరుచుగా జరిగే ఘర్షణలు ప్రభుత్వ వ్యతిరేకతను ఏర్పరిచాయి.
గత కొన్ని సంవత్సరాలుగా ఆప్ ప్రభుత్వం సరిగా పనిచేయలేకపోయింది. దాని నాయకత్వం అవినీతి ఆరోపణలతో జైలు లో ఉండిపోయింది. లెప్టినెంట్ గవర్నర్ కార్యాలయం నుంచి పాలన ఒత్తిడి ఎదుర్కొంది. ఆప్ ప్రభుత్వానికి బీజేపీ చేసిన నష్టాన్ని అది సరిగా అంచనా వేయలేకపోయింది.’’ అని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ రచయిత, ప్రొఫెసర్ అభయ్ దుబే ‘ది ఫెడరల్ ’ తో అన్నారు.
పార్టీని కలిపి ఉంచడం సవాల్
దేశ రాజధానిలోఆప్ అధికారాన్ని కోల్పోయిన తరువాత పార్టీ తన గెలుపు గుర్రాలను ఇక ఒకే గాటున కట్టి పెట్టుకోగలదా? ఇది కొంచెం కష్టమైన పనే. కేజ్రీవాల్ ఏకపక్ష నియంతృత్వ ధోరణితో దాదాపు 15 మంది కీలక నేతలు ఎన్నికల ముందు ఆప్ ను వీడి బీజేపీలో చేరారు. ప్రస్తుతం గెలిచిన నాయకులు కూడా కాపాడుకోవడం ఆ పార్టీకి కష్టం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
‘‘ఇటీవల పార్టీని వీడిన వారందరూ బీజేపీ లో చేరారు. అయితే కైలాష్ గెహ్లాట్ వంటి మాజీ పార్టీ నాయకులు మరింత మంది ఆప్ నాయకులను బీజేపీ వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తుండటంతో ముప్పు ఇంకా పొంచి ఉంది. అదే విధంగా పంజాబ్ లో కూడా ఆప్ నాయకులు తమ విశ్వాసాన్ని మార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది పార్టీ కేవలం అక్కడే అధికారంలో ఉంది’’ అని సిసోడియా అన్నారు.