One Nation, One Election | పార్లమెంట్‌లో వచ్చే వారం బిల్లు?

“47 రాజకీయ పార్టీల నుంచి ప్రతిస్పందనలు వచ్చాయి. 32 రాజకీయ పార్టీలు ఏకకాల ఎన్నికల వ్యవస్థకు మొగ్గు చూపాయి. 15 రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి.’’ - కమిటీ నివేదిక;

Update: 2024-12-12 11:55 GMT

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు వీలుగా 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' బిల్లుకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే వారం జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఏకకాల ఎన్నికలను సమర్థిస్తూ సెప్టెంబరులో కేబినెట్‌కు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేయడంతో పాటు ఆ తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ సూచించింది.

32 పార్టీల నుంచి సానుకూలం..15 వ్యతిరేకం..

మేం 62 రాజకీయ పార్టీలను సంప్రదించామని, అందులో 47 పార్టీలు స్పందించాయని కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ నివేదిక పేర్కొంది. భారతీయ జనతా పార్టీతో సహా 32 రాజకీయ పార్టీలు ఏకకాల ఎన్నికలకు మొగ్గు చూపాయి. కాంగ్రెస్ సహా 15 రాజకీయ పార్టీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి.

“47 రాజకీయ పార్టీల నుంచి ప్రతిస్పందనలు వచ్చాయి. 15 రాజకీయ పార్టీలను మినహాయించి, మిగిలిన 32 రాజకీయ పార్టీలు ఏకకాల ఎన్నికల వ్యవస్థకు మొగ్గు చూపాయి. ఆర్థిక వనరులను ఆదా చేయడం, సామాజిక సామరస్యాన్ని పరిరక్షించడం, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించానికి జమిలీ ఎన్నికలు దోహదపడతాయని సూచించాయి” అని నివేదిక పేర్కొంది.

అయితే "ఏకకాల ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమేనని, ప్రజాస్వామ్యానికి, సమాఖ్యకు వ్యతిరేకమని, ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టి, జాతీయ పార్టీల ఆధిపత్యాన్ని ప్రోత్సహించినట్లవుతుందని, ఫలితంగా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుందని" ఏకకాల ఎన్నికలను వ్యతిరేకించే పార్టీలు పేర్కొన్నాయని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికలో పేర్కొంది. 

Tags:    

Similar News