నటుడు శివాజీకి మహిళ కమిషన్ నోటీసులు
మహిళల గురించి అవమానకరంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవన్న మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద.
ప్రముఖ నటుడు మా అసోసియేషన్ సభ్యుడు శివాజీకి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దండోరా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను అవమానించేలా మాట్లాడితే తాము చూస్తూ ఊరుకోమని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే శివాజీకి నోటీసులు జారీ చేసింది. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళల దుస్తులు, స్వేచ్ఛకు సంబంధించిన అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. శివాజీ వ్యాఖ్యలను మహిళా కమిషన్ లీగల్ టీమ్ పరిశీలించిన అనంతరం మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద తెలిపారు.
మహిళా కమిషన్ హెచ్చరిక
ఈ అంశంపై నేరెళ్ల శారద స్పందించారు. మహిళలను అవమానించేలా మాట్లాడితూ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. “సినీ నటులు, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మహిళలను అవమానపరిచేలా లేదా కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే అవి సహించబోవు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు. శివాజీ చేసిన వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆమె వెల్లడించారు.
శివాజీ అసలేమన్నారంటే
దండోరా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాంకర్ స్రవంతి సంప్రదాయ చీరధారణలో హాజరవ్వగా, ఆమె వేషధారణను ప్రశంసిస్తూ నటుడు శివాజీ వేదికపై వ్యాఖ్యలు చేశారు. చీరలో ఆమె అందం ఎంతో ఆకర్షణీయంగా ఉందని పేర్కొన్న ఆయన, హీరోయిన్లు కూడా ఇలాంటి సంప్రదాయ దుస్తులు ధరిస్తే మరింత బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, మహిళల అందం పూర్తిగా కప్పుకునే దుస్తుల్లోనే మరింత ప్రతిఫలిస్తుందని అన్నారు. గ్లామర్ ఒక పరిమితి వరకు మాత్రమే ఉండాలని, దుస్తుల ఎంపిక ద్వారా వ్యక్తిత్వం, గౌరవం ప్రతిబింబిస్తాయని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ పేరుతో కొంతమంది దుస్తుల విషయంలో హద్దులు దాటుతున్నారన్న భావనను వ్యక్తం చేస్తూ, అలాంటి దృక్పథం సమాజంలో విమర్శలకు దారి తీస్తుందని పేర్కొన్నారు.
స్త్రీ అంటే ప్రకృతి స్వరూపమని, ఆమె ఎంత సౌమ్యంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుందని శివాజీ అన్నారు. తల్లిని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, సంప్రదాయ విలువలు మహిళలకు ప్రత్యేక గుర్తింపునిస్తాయని వ్యాఖ్యానించారు. గతం నుంచి ఇప్పటి వరకు ప్రభావం చూపిన నటీమణుల పేర్లు ప్రస్తావిస్తూ, వారు తమ ప్రవర్తనతో, వ్యక్తిత్వంతో ఆదర్శంగా నిలిచారని తెలిపారు.
గ్లామర్‌కు కూడా ఒక హద్దు ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన శివాజీ, స్వేచ్ఛ అనేది విలువైనదని, దానిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రపంచ వేదికలపై కూడా సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలకే గౌరవం, గుర్తింపు లభించిందని వ్యాఖ్యానించారు.
శివాజీ తరఫున మనోజ్ క్షమాపణ
ఈ వ్యవహారంపై శివాజీ తరఫున మనోజ్ క్షమాపణలు కోరారు. “మహిళలు ఫలానా విధంగానే ఉండాలంటూ ఒక గడిలో పెట్టడం ఆమోదయోగ్యం కాదు. గౌరవం అనేది వ్యక్తిగత ప్రవర్తన ద్వారా వస్తుంది, దుస్తుల ద్వారా కాదు. సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ అనేవి రాజ్యాంగం కల్పించిన హక్కులు. ఈ అంశంలో శివాజీ చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా నొచ్చి ఉంటే, ఆయన తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను” అని తెలిపారు. అయితే, సినీ పరిశ్రమలో అందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారని భావించవద్దని కూడా ఆయన పేర్కొన్నారు.
శివాజీ సలహా అక్కర్లేదు: అనసూయ
ఇదే అంశంపై నటి అనసూయ కూడా ఘాటుగా స్పందించారు. దుస్తులు ఎలా ధరించాలి అన్న విషయంపై మహిళలకు శివాజీ సలహాలు ఏమీ అక్కర్లేదని తెలిపారు. “ఇది మా శరీరం. మాకు నచ్చిన విధంగా మేం ఉండే హక్కు మాకుంది” అని వ్యాఖ్యానించారు. “ఎవరికి ఏది సౌకర్యంగా ఉంటే అదే దుస్తులు ధరించడం వారి వ్యక్తిగత హక్కు. ఇతరుల అభిప్రాయాల ఆధారంగా మహిళలు జీవించాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరం” అని ఆమె అభిప్రాయపడ్డారు.