జీహెచ్ఎంసీ డివిజన్ల విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్ట్
జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లను 300కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.
జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన విషయంలో జోక్యం చేసుకోవడం కుదరదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లను 300కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీసింది. కాంగ్రెస్ నేతలు కొందరు సైతం డివిజన్ల పునర్విభజనపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. డివిజన్ల పునర్విభజనను ఛాలెంజ్ చేస్తూ పలువురు హైకోర్టు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. వాటిని స్వీకరించిన న్యాయస్థానం సోమవారం విచారించింది. అనంతరం ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అనంతరం ఈ అంశంపై దాఖలైన దాదాపు 80 పిటిషన్లను కొట్టివేసింది.
కోర్టు విచారణ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సమర్పించిన నివేదిక ఆధారంగా వార్డుల పునర్విభజన చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఆ నివేదికను బహిర్గతం చేయలేదని వాదించారు. అలాగే అభ్యంతరాల స్వీకరణకు తగినంత గడువు ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనికి ప్రతిగా ప్రభుత్వం తరఫు న్యాయవాది, చట్టపరిధిలోనే డీలిమిటేషన్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు కోర్టుకు వివరించారు. సంబంధిత సమాచారం ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచామని, ఇప్పటివరకు అందిన 3,100 అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉండగా, శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో జీహెచ్‌ఎంసీ పరిధి దాదాపు 2,000 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ విస్తృత ప్రాంతాన్ని 300 వార్డులుగా పునర్విభజించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. విలీనానికి ముందు 750 చదరపు కిలోమీటర్ల పరిధిలో 150 వార్డులు మాత్రమే ఉండటంతో, కొన్ని వార్డుల్లో అధిక జనాభా ఉండగా మరికొన్నింటిలో తక్కువ జనాభా ఉండేదని వెల్లడించారు. అలాగే ఒకే వార్డు రెండు నియోజకవర్గాల పరిధిలో ఉండే పరిస్థితులు ఉండేవని పేర్కొన్నారు. ఈ లోపాలకు తావులేకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తాజా పునర్విభజన చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది.
కాంగ్రెస్ నేతల నుంచి ప్రశ్నలు
అధికార పార్టీ నేతలు కూడా ఈ హద్దులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ హద్దులను ఎలా నిర్దారిస్తో తమకు చెప్పాలని కోరుతున్నారు. ఇందులో భాగంగానే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కలిసి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజలక్ష్మితో భేటీ అయ్యారు. డివిజన్‌ల హద్దులపై వివరణ కోరారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, ప్రాశ్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో కలిసి పలువురు కార్పొరేటర్లు మేయర్ విజయలక్ష్మిని కలిశారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై చర్చించారు. డివిజన్ల సరిహద్దులను మార్కింగ్ చేసి వినతి పత్రాన్ని మేయర్‌కు అందించినట్లు వారు తెలిపారు.
పునర్విభజనలో సమస్యలు: అరికెపూడి
డివిజన్ల విభజనలో పలు సమస్యలు ఉన్నట్లు తాము గుర్తించామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. కొన్ని డివిజన్‌లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటే మరికొన్నింటిలో తక్కువగా ఉందని ఆయన చెప్పారు. ఇటువంటి అన్ని విషయాలను మేయర్, కమిషనర్‌ల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. కౌన్సిల్‌లో అభ్యంతరాలపై వివరంగా చర్చిస్తామని, హద్దులు తెలియకుండా అధికారులు కొత్త డివిజన్‌లను ఖరారు చేశారని ఆయన అన్నారు. డివిజన్ల పెంపుపై బీఆర్ఎస్ ఎంఎల్ఏ తలసాని శ్రీనివాసయాదవ్, ఎంఎల్సీ దాసోజు శ్రవణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు తదితరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఎంఐఎం కోసమే పెంచారు : కిషన్
గ్రేటర్ డివిజన్లపెంపు కేవలం మజ్లిస్ పార్టీ లబ్దికోసమే అని కేంద్ర బొగ్గుగనుల శాఖమంత్రి జీ కిషన్ రెడ్డి మండిపడ్డారు. డివిజన్ల పెంపులో శాస్త్రీయత కనబడలేదని ఆరోపించారు. కేవలం రాజకీయలబ్దికోసమే రేవంత్ ప్రభుత్వం తనిష్టం వచ్చినట్లు డివిజన్లను పునర్విభజించటంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. డివిజన్ల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
న్యాయపోరాటం తప్పదు : తలసాని
గ్రేటర్ డివిజన్ల పెంపులో పారదర్శకత లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎంఎల్ఏ తలసాని శ్రీనివాసయాదవ్ ఆరోపించారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘రాజకీయపార్టీలను, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా, ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా ఆఫీసులో కూర్చుని బుర్రకు తోచినట్లు పునర్విభజన చేశారు’’ అని ఎద్దేవాచేశారు. ‘‘హడావుడిగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ లో విలీనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది’’ అని నిలదీశారు. ఇదే అంశంపై మంగళవారం జరిగిన గ్రేటర్ కౌన్సిల్ సమావేశంలో కూడా తలసాని మేయర్ గద్వాలతో పాటు కమిషనర్ కర్ణన్ ను గట్టిగా ప్రశ్నించారు. ‘‘డివిజన్లు పెంచటం రాజకీయపార్టీలకు, ప్రజాప్రతినిధులకు మాత్రమే సంబంధించిన అంశంకాదని మొత్తం ప్రజలకు సంబంధించిన అంశం’’ అని తలసాని గుర్తుచేశారు. ‘‘ఇపుడున్న 150 డివిజన్లకే సరిపడా మౌళిక సదుపాయాలు, మ్యాన్ పవర్ లేనపుడు 300 డివిజన్లకు పెంచటంలో రేవంత్ ఉద్దేశ్యం ఏమయ్యుంటుంది’’ అని మాజీమంత్రి ఎద్దేవాచేశారు. ‘‘డివిజన్లపెంపు విషయం తనకు కూడా తెలీదని మేయర్ గద్వాలవిజయలక్ష్మి కూడా చెప్పారు’’ అని తలసాని అన్నారు. డివిజన్ల జనాభాలో వ్యత్యాసం కూడా ఉందన్నారు. ప్రభుత్వం గనుక తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పార్టీపరంగా న్యాయపోరాటం కూడా చేస్తాము’’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాజకీయ కుట్ర : రామచంద్రరావు
గ్రేటర్ పరిధిలోకి కొత్తగా 150 డివిజన్లను చేర్చటం రేవంత్ ప్రభుత్వ రాజకీయ కుట్రగా బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంవల్ల 27 మున్సిపాలిటీల్లోని ప్రజలకు లాభాలు లేకపోగా నష్టాలు తప్పవన్నారు. మున్సిపాలిటీలు, పంచాయితీలను గ్రేటర్ పరిధిలోకి తీసుకురావటంతో ప్రజలపై అన్నీరకాల పన్నుల భారం పెరిగిపోతుందని చెప్పారు. ఎంఐఎం సహకారంతో అత్యధిక డివిజన్లను గెలుచుకోవాలన్న ఆలోచన తప్ప రేవంత్ కు ప్రజల సమస్యలను పరిష్కరించే ఉద్దేశ్యంలేదని మండిపడ్డారు.