కాంగ్రెస్‌కు రేపటి నుంచి చుక్కలు చూపిస్తం: కేసీఆర్
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఓ లెక్క.. ఒక్కొక్కరి తోలుతీస్తానంటూ కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్.
కాంగ్రెస్ ప్రభుత్వానికి గులాబీ బాస్ కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క ఉంటుందన్నారు. ప్రతి విషయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో ప్రజాక్షేత్రంలో నిలదీస్తామన్నారు. రెండు సంవత్సరాలు ఆగామాని, ఇక ఆగేది లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపించారు.
బహిరంగ సభలు నిర్వహిస్తామని, వాటిలో తాను కూడా పాల్గొని ప్రభుత్వాన్ని ప్రజల ముందే నిలదీస్తానని హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్‌ఎల్‌పీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. అమద్ధాలు చెప్ప అధికారంలోకి వచ్చిందని అన్నారు. రకరకాల సమస్యలపై బీఆర్ఎస్ పోరాడుతోందని, తమ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు.
నేనే రంగంలోకి దిగుతా
పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా మౌనంగా ఉన్నానని, పరిస్థితులు తప్పనిసరి కావడంతో స్వయంగా ప్రజా పోరాటానికి దిగుతున్నానని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని స్పష్టం చేశారు. చీల్చి చెండాడుతానని అన్నారు. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గ్రామగ్రామాన ప్రజా ఉద్యమాలు, బహిరంగ సభలు నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమాలకు తానే హాజరవుతానని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజల్లో ప్రశ్నిస్తామని హెచ్చరించారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కవులు, గాయకులను కూడా ఉద్యమంలో భాగస్వాములను చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని తెలిపారు.
జల దోపిడీపై ప్రభుత్వ వైఫల్యం
గోదావరి, కృష్ణా నదుల జలాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని కేసీఆర్ మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై కేంద్రం డీపీఆర్‌ను వెనక్కి పంపినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో నేరాల రేటు పెరిగిందని, శాంతిభద్రతలు క్షీణించాయని కేసీఆర్ ఆరోపించారు. యూరియా, ఎరువుల సరఫరా, రైతుబంధు, పింఛన్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగ హామీలు అమలుకావడం లేదని అన్నారు.
గోదావరిలో చంద్రబాబు దోపిడీ జరుగుతున్నా కేంద్రం, రాష్ట్రం స్పందించడం లేదని, కృష్ణా నదిలో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై తీవ్ర అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం మౌనంగా ఉందని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రానికి మొత్తం ముప్పు ఏర్పడుతున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
కావాలనే నిర్లక్ష్యం
బీఆర్‌ఎస్ పాలనలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు తెచ్చామని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఊరూరా కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు, అవసరమైతే భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు శనిలా మారిందని కేసీఆర్ విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పాలనలో దాదాపు ఆరు అనుమతులు తెచ్చామని గుర్తు చేశారు.
హత్యలు జరుగుతున్నా పట్టించుకోరు
తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని, నేరాల రేటు పెరిగిపోయిందని కేసీఆర్ ఆరోపించారు. పట్టపగలు హత్యలు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని, ప్రభుత్వం మొత్తం రియల్ ఎస్టేట్‌పైనే దృష్టి పెట్టిందని మండిపడ్డారు. ఇకపై ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని స్పష్టం చేశారు.
రైతుల సమస్యలపై కూడా కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. యూరియా, ఎరువులు సకాలంలో అందడం లేదని, ఇందుకోసం తీసుకొస్తున్న యాప్ దిక్కుమాలినదిగా ఉందని వ్యాఖ్యానించారు. రైతుబంధు, పింఛన్లు రెండుసార్లు ఎగ్గొట్టారని, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ హామీలు అమలుకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.