ప్రతిపక్షాలపైకి రేవంత్ ‘హేట్ స్పీచ్’ అస్త్రం

రాజకీయాలు మిగిలిన రాష్ట్రాల్లో ఎలాగున్నా(Telangana) తెలంగాణలో మాత్రం చాలా అధ్వన్నంగా తయారయ్యాయి

Update: 2025-12-21 10:40 GMT
Revanth

ప్రతిపక్షాల నోటికి తాళం వేయటానికి లేకపోతే నోటికి స్పీడ్ బ్రేకర్లు వేయటానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం హేట్ స్పీచ్ చట్టం తీసుకొస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును రాబోయే బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టబోతున్నట్లు రేవంత్ ప్రకటించారు. రాజకీయాలు మిగిలిన రాష్ట్రాల్లో ఎలాగున్నా(Telangana) తెలంగాణలో మాత్రం చాలా అధ్వన్నంగా తయారయ్యాయి. ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్(Revanth)పై వ్యక్తిగతంగా బురదచల్లేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు కొందరు ప్రతిపక్ష నేతలు. ప్రతిరోజు టైంటేబుల్ వేసుకుని మరీ ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. తాజాగా రైతులకు యూరియా సరఫరాను సులభతరం చేయటం కోసం ప్రభుత్వం ఒక యాప్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. యాప్ విషయంలో కూడా (BRS)బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (KTR)కేటీఆర్, బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హేళన చేస్తు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

రేవంత్ మాట్లాడుతు ‘‘పరమత సహనాన్ని పాటించకుండా ఇతర మతాలు, ప్రజల మధ్య విద్వేష ప్రసంగాలను చేసేవారిని చట్టపరంగా కఠినంగా శిక్షించేందుకు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడుతున్నాము’’ అని చెప్పారు. రేవంత్ చెప్పినట్లుగా ప్రజలమధ్య విద్వేషాలను రెచ్చగొట్టేవారిని కంట్రోల్ చేయాలంటే ఒకచట్టం ఉండాల్సిందే అన్నట్లుగా తయారయ్యాయి రాజకీయాలు. విధానపరమైన ఆరోపణలు, విమర్శలు పోయి వ్యక్తిగతంగా ఒకరిని మరొకరు దూషించుకుని ఆనందించేస్ధాయికి తెలంగాణ రాజకీయాలు దిగజారిపోయాయి.

రైతులకోసం యూరియా యాప్ తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించటాన్ని కూడా కేటీఆర్ తట్టుకోలేకపోతే ఎలాగ ? యాప్ మెరుగైన పనితీరు కోసం సూచనలు ఇవ్వాల్సిన కేటీఆర్ ఆ పనిచేయకుండా రేవంత్ ప్రభుత్వాన్ని ఎగతాళిగా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. కొద్దినెలల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటికి సంబంధించిన 400 ఎకరాలను ప్రభుత్వం తీసుకోవాలని అనుకున్నది. అప్పుడు కూడా బీఆర్ఎస్ ఎంత యాగీచేసిందో అందరికీ తెలిసిందే. యూనివర్సిటీలో జింకలు, దుప్పులు, నెమళ్ళను ప్రభుత్వం చంపేస్తోందంటు కొన్ని వీడియోలు, ఫొటోలను బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది. ఆ వీడియోలు, ఫొటోలు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనాన్నే సృష్టించింది.

ప్రకృతిప్రేమికులు, వన్యప్రాణుల సంరక్షణ సంస్ధలు వెంటనే సుప్రింకోర్టులో కేసులు వేశాయి. విచారణలో సుప్రింకోర్టును తెలంగాణ ప్రధానకార్యదర్శిని ఎంతఘాటుగా చివాట్లు పెట్టిందో అందరుచూసిందే. తీరాచూస్తే బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన వీడియోలు, ఫొటోలు ఏఐ ద్వారా సృష్టించినవిగా తేలాయి. దాంతో సుప్రింకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేసింది. అయితే అప్పటికే రేవంత్ ప్రభుత్వ ఇమేజి జాతీయస్ధాయిలో బాగా డ్యామేజి అయిపోయింది. ఏఐ ద్వారా సృష్టించిన వీడియోలు, ఫొటోలపై కేటీఆర్ ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదు. అంటే ఇక్కడ అర్ధమవుతున్నది ఏమిటంటే ఏదోపద్దతిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదచల్లటమే టార్గెట్ గా పెట్టుకున్నారని. అదే సమయంలో రేవంత్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో గ్రామసభ జరుగుతుండగా కొందరు రైతులు కలెక్టర్ ప్రతీక్ జైన్ పై ఒక్కసారిగా దాడిచేశారు. ఫార్మాకంపెనీలకు భూసేకరణ కోసం ఏర్పాటుచేసిన సభ అది.

కలెక్టర్ పై రైతులు దాడి అంటు బీఆర్ఎస్ చేసిన గోల జాతీయస్ధాయిలో సంచలనమైంది. ఎందుకంటే కలెక్టర్ పైన రైతులు దాడిచేయటం మామూలు విషయంకాదు. అయితే రోజులు గడిచిన తర్వాత దొరికిన వీడియోలను విశ్లేషిస్తే బయటపడింది ఏమిటంటే రైతులను బీఆర్ఎస్ నేతలు బాగా రెచ్చగొట్టారని. రైతుల ముసుగులో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలే కలెక్టర్ పైన దాడికి తెగబడ్డారని. అప్పుడు కూడా రేవంత్ ప్రభుత్వానికి బాగా చెడ్డపేరొచ్చింది. ఇలాంటి అనేక మార్గాల్లో బీఆర్ఎస్ ప్రతిరోజు రేవంత్ ప్రభుత్వం ఇమేజీని డ్యామేజి చేస్తునే ఉంది.

వెనుకనుండి ప్రభుత్వంపైకి జనాలను రెచ్చగొట్టడం, తర్వాత మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై బురదచల్లడమే కేటీఆర్ అండ్ కో టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. ఇలాంటి చర్యలకు బ్రేకులు వేయాలంటే విద్వేష ప్రసంగాలను చట్టం ద్వారా అడ్డుకోవాల్సిందే తప్ప వేరేదారిలేదు. రేవంత్ ప్రభుత్వం కాస్త ఆలస్యంగానే అయినా ఆపనికి పూనుకుంది. కర్నాటక ప్రభుత్వం తరహాలోనే హేట్ స్పీచ్ చట్టం తేబోతున్నట్లు రేవంత్ ప్రకటించారు.

విద్వేష ప్రసంగాలు చేస్తున్నారన్న ముసుగులో ప్రతిపక్షాల నేతలపై ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టులు చేసే ప్రమాదం కూడా ఉంది. అందుకనే విద్వేష ప్రసంగాలు అంటే ఏమిటి అనే విషయంలో కచ్చితమైన విధి, విధానాలను రూపొందించాలి. ఆబిల్లును మెజారిటి ఉందని అసెంబ్లీ, శాసనమండలిలో ఏకపక్షంగా పాస్ చేసుకుని చట్టం తేవటంకాదు. ముందు న్యాయనిపుణులు, పాలనలో బాగా అనుభవం ఉన్న వారితో కమిటీవేయాలి. కమిటీ ద్వారా జనాల నుండి సలహాలు, సూచనలు తీసుకోవాలి. అదేకమిటీ నాయకత్వంలో రాజకీయపార్టీలు, మేథావులతో భేటీలు ఏర్పాటుచేయించాలి. అన్నీ వర్గాలనుండి వచ్చిన సలహాలు, సూచనలతో బిల్లును రూపొందించి చట్టసభల్లో చర్చించిన తర్వాత చట్టం తీసుకురావాలి. బిల్లురూపకల్పనలో అందరి భాగస్వామ్యం ఉంటే చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరి రేవంత్ ఏమిచేస్తాడో చూడాలి.

Tags:    

Similar News