హైదరాబాద్ ఎగ్జిబిషన్ 87 యేళ్ల కథ తెలుసా?
1938 లో హైదరాబాద్ నుమాయిష్ ఎలా మొదలయిందంటే..
న్యూఇయర్ రోజే హైదరాబాద్‌లో ఓ పండగ మొదలవుతుంది. అదే నుమాయిష్. ఇది తెలంగాణాలోనే అతిపెద్ద మేళా. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 'ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ 85'వ ప్రదర్శన జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. నిర్వాహకులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలువురు వ్యాపారవేత్తలు తమ వస్తువులను విక్రయించేందుకు స్టాళ్లను బుక్ చేసుకున్నారు. సుమారు 12 వందల నుంచి 15 వందల స్టాళ్లలో పలు రకాల వస్తువులు, దుస్తులు, తినుబండారాలను ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేయనున్నారు. దేశం నలుమూలల నుండి వ్యాపారస్థులు చేనేత వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, ఆహార ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు.
"జమ్ముకశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రముఖ కంపెనీలు, స్థానిక సంస్థల ఉత్పత్తులు, హ్యాండీక్రాఫ్ట్స్, చేనేత వస్త్రాలు, ఎలక్ట్రికల్ పరికరాలు ఇలా అన్నీ ఇక్కడ కొలువుదీరిన స్టాళ్లలో లభిస్తాయి. రూ. 10 నుంచి రూ. లక్షలు విలువ చేసే వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. ప్రతి ఏడాది స్టాళ్ల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకున్న ఆరువందల మందికి స్థలాభావం వల్ల అవకాశం ఇవ్వలేకపోయాం," అని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు సుకేష్ రెడ్డి ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు.
"దేశీయ ఉత్పత్తులే కాదు. ఇరాన్ కార్పెట్లు, టర్కీ దుప్పట్లు, బంగ్లాదేశ్ వస్త్రాలు, హ్యాండీక్రాఫ్ట్స్ అమ్మకానికి ఉంటాయి. మహిళలు మాత్రమే నిర్వహించే స్టాళ్లూ కనిపిస్తాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఇతర భారతీయ రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. చేనేత వస్త్రాలు, ఆహార ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, డ్రై ఫ్రూట్స్ మొదలైన రకరకాల వస్తువులను ఈ ప్రదర్శనలో విక్రయిస్తారు. సందర్శకుల కోసం వినోద యాత్రల కోసం ఒక ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేశాం," అని సుకేష్ రెడ్డి చెప్పారు.
జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 వరకు ఉంటుంది. ఎంట్రీ ఫీజు పెద్దవారికి రూ.50/-. ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రవేశం. ఎగ్జిబిషన్ కు వచ్చే ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
ప్రస్తుతం నాంపల్లిలో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్‌ను 1938లో పబ్లిక్ గార్డెన్‌లో ఏర్పాటు చేశారు. క్రమక్రమంగా వ్యాపారస్థుల దుకాణాలు, సందర్శనకు వచ్చే ప్రజల సంఖ్య పెరిగింది. స్థలా భావంతో ఇబ్బందిగా మారింది. దీంతో 1946 వరకు పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన నుమాయిష్ ను ఆ తరువాత నాంపల్లిలోని 23 ఎకరాల ఖాళీ స్థలంలో ఏర్పాటు చేశారు.
1947 లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1948లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంతో ఆ రెండెళ్లూ ఎగ్జిబిషన్ నిర్వహించలేదు. మళ్లీ 1948 లో నాంపల్లి మైదానంలో తిరిగి అప్పటి భారత దేశ గవర్నర్ జనరల్ సి.రాజగోపాల చారి ప్రారంభించారు. ఆ సమయంలోనే నుమాయిష్ గా ఉన్న పేరును ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ గా మార్పు చేశారు. అయితే అందరూ దీన్ని నుమాయిష్‌గానే పిలుస్తుండటంతో 2009లో తిరిగి పాత పేరునే పెట్టారు. 1965 ఈ ఎగ్జిబిషన్ సొసైటీ సిల్వర్ జుబ్లీ, 1998 లో గోల్డెన్ జుబ్లీ, 2015 లో ప్లాటినం జుబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంది.
"1936-37లో 7వ నిజాం పాలన సిల్వర్ జూబిలీ ఉత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా హైదరాబాద్‌లోనూ, నిజాం స్టేట్‌లోని వరంగల్ వంటి పలు నగరాలలో రాష్ట్ర సంస్కృతికి సంబంధించి పలు ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. ఆ రోజుల్లో యూరోపు, అమెరికా వంటి దేశాలలో పారిశ్రామిక విప్లవం జరిగి అనేక పారిశ్రామిక ఉత్పత్తులు వచ్చి ప్రఖ్యాత ప్రదర్శనలకు నోచుకుంటున్నాయి. ఆ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న బ్రిటీష్‌వారు, అక్బర్ హైదరీ వంటి మంత్రులు, ఉస్మానియా విశ్వవిద్యాలయ మేధావులు సూచించిన మేరకు 1938లో నిజాం అలీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్‌లో పారిశ్రామిక ప్రదర్శనకు అనుమతించాడు. అది అనతి కాలంలోనే భారతదేశంలోనే పెద్ద ఎగ్జిబిషన్‌గా పేరొందింది," అని అని డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు.
ఈ నుమాయిష్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే "అప్పట్లో హైదరాబాద్ సంస్థాన ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యూయేట్స్ ఓ సర్వే నిర్వహించాలనుకున్నారు. కానీ, అందుకు సరిపడా నిధులు లేకపోవడంతో నిధుల సేకరణకు పబ్లిక్ గార్డెన్స్‌లో మొదటి సారిగా స్థానిక ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారు. హైదరాబాద్ ప్రధాన మంత్రి సర్ అక్బర్ హైదరీ (నటి అదితి రావు హైదరీ తాత) నుండి ఆమోదం పొందారు. ఆయన కేవలం రూ. 2.50 స్వల్ప ప్రారంభ మూలధనాన్ని మంజూరు చేశారు. స్థానికంగా తయారైన ఉత్పత్తులను ప్రోత్సహించడానికి కేవలం 50 స్టాల్స్ ఏర్పాటు చేశారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రారంభించారు. అప్పట్లో ఈ ప్రదర్శన కేవలం 10 రోజులు మాత్రమే జరిగింది," అని హెరిటేజ్ యాక్టివిస్ట్ మొహమ్మద్ గియాసుద్దీన్ అక్బర్ ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు. అలా ప్రారంభమైన నాంపల్లి ఎగ్జిబిషన్ లో ఇప్పుడు వేల సంఖ్యలో స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి. వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందని ఆయన అన్నారు.
హైదరాబాద్ స్టేట్‌లో పారిశ్రామీకీకరణకు నుమాయిష్‌కు సంబంధం ఏంటి?
1591 నుంచి 1875 వరకు హైదరాబాద్ గ్లోబల్ ట్రేడ్ సెంటర్‌గా ఉండేది. కానీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. బిద్రీ, వస్త్రాలు, ముత్యాలు, రత్నాలు, కళాఖండాల ఎగుమతులు జరిగేవి. 1875 నుంచి 1948 వరకు పారిశ్రామీకరణ ఉధృతంగా జరిగింది. హైదరాబాద్ రాజ్యంలో జరిగిన పారిశ్రామికీకరణను మూడు దశలుగా చెప్పుకోవచ్చు.
మొదటి దశ (1870- 1919) 1899లో హైదరాబాద్ గోదావరి వ్యాలీ రైల్వే లైన్‌ను మన్మాడ్‌ను కలుపుతూ ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతాలతో పత్తి, అందుకు సంబంధించిన స్పిన్నింగ్, వీవింగ్ మిల్స్ లిమిటెడ్ (1877), మహబూబ్శాయి గుల్బర్గా మిల్స్ (1884), ఔరంగాబాద్ మిల్స్ (1888) స్థాపించారు. ఈ దశలో డోర్నకల్ జంక్షన్ నుంచి సింగరేణి బొగ్గు గనుల వరకు వేసిన రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణా సులువైంది. 1901 వరకు అన్ని రకాల పరిశ్రమలు కలసి 68 ఉండేవి. 1911-22 మధ్యకాలంలో పరిశ్రమలకు 121 నుంచి 200లకు పెరిగాయి. కార్మికుల సంఖ్య 24,317 నుంచి 32,587కు పెరిగింది.
రెండో దశ (1919-39) ఈ దశలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి సంస్థాగత సహాయం కల్పించింది. 1917లో ఇండస్ట్రియల్ లేబరేటరీని ఏర్పరిచి పరిశోధనలు చేపట్టారు. 1918లో ప్రత్యేకంగా కామర్స్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ను రూపొందించారు. 1929వ సంవత్సరం హైదరాబాద్ రాజ్య పారిశ్రామికీకరణలో ఒక మైలురాయి. ఎందుకంటే ప్రభుత్వమే కోటి రూపాయల నిధితో ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ (ఐటీఎఫ్)ను ఏర్పాటు చేసింది. చిన్న తరహా చేతివృత్తుల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఐటీఎఫ్ పారిశ్రామిక ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. సాలార్జంగ్–1 కాలంలోపారిశ్రామిక వస్తువుల ప్రదర్శన ప్రారంభమైంది.
ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ద్వారా 1938 నుంచి ప్రతి ఏటా హైదరాబాద్‌లో పారిశ్రామిక ప్రదర్శన నిర్వహించడం ప్రారంభమైంది. ఈ సంస్థ చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తుల ప్రోత్సాహానికే కాటేజీ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసింది. అనుబంధంగా చిన్న తరహా వస్తువుల క్రయవిక్రయ కేంద్రాన్ని స్థాపించి ఉత్పత్తిదారులకు, పట్టణ వినియోగదారులకు మధ్యవర్తిత్వం వహిస్తూ పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేశారు.రైల్వే రవాణా, రోడ్డు విమానయాన వ్యవస్థలన్నీ పూర్తిగా ప్రభుత్వ అధీనంలో నడిచే రైల్వే బోర్డు ఆధిపత్యంలోకి వచ్చాయి. ఈ దశలో నిజాంసాగర్‌లో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఉత్పత్తి ప్రారంభమై 1938–39 వరకు 20 మిలయన్ల కిలోవాట్స్‌కు చేరింది. 1931 నాటికి భారీ పరిశ్రమల సంఖ్య 387కు పెరిగాయి. మూడు దుస్తుల మిల్లులు, రెండు సిగరెట్ ఫ్యాక్టరీలు చార్మినార్, వజీర్ సుల్తాన్ టొబాకో, రెండు గ్లాస్ పరిశ్రమలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిజాం సాగర్ కింద ఏర్పాటు చేశారు.
మూడో దశ (1939-48)చివరి దశలో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పారిశ్రామిక విధానంలో పెను మార్పులు చేపట్టాడు. అందువల్ల ఈయన కాలంలో ఎన్నో పరిశ్రమలు స్థాపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ (1937): ఈ పరిశ్రమను బోధన్‌లో స్థాపించారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం. ఆల్విన్ మెటల్ వర్క్స్: నిజాం ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్, మెసర్స్ అల్లావుద్దీన్ అనే కంపెనీ సంయుక్త భాగస్వామ్యంలో 1942, జనవరిలో ఆల్విన్ లిమిటెడ్‌ను ఆల్విన్ మెటల్ వర్క్స్‌గా స్థాపించారు.
ప్రాగాటూల్స్:
సికింద్రాబాద్‌లోని కవాడిగూడలో యంత్రాల పనిముట్లు తయారు చేసే ఉద్దేశంతో 1942, మేలో ప్రాగా టూల్స్ కార్పొరేషన్‌ను స్థాపించారు. ఈ సంస్థను ప్రాగాటూల్స్ లిమిటెడ్‌గా మార్పు చేసి 1963లో డిఫెన్స్ మినిస్టరీకి అప్పగించారు.
సర్‌సిల్క్:
సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రాంతంలో సిర్పూర్ పేపర్ మిల్లును ఏర్పాటు చేయడం వల్ల దీన్ని సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం)గా పిలిచేవారు. భారతదేశంలో స్థాపించిన మొదటి పరిశ్రమల్లో పేపర్ మిల్లుల్లో ఒకటి. 1942 నుంచి ఈ పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభమైంది.
హైదరాబాద్ ఆస్బెస్టస్:
హైదరాబాద్ రాచరిక రాజ్యంలో 1946, జూన్ 17న ప్రారంభమై సిమెంట్ రేకులు లేదా షీట్స్ ఉత్పత్తిని ప్రారంభించింది. దీన్నే తర్వాత కాలంలో హైదరాబాద్ ఆస్బెస్టస్గా పిలుస్తున్నారు.
వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ:
వజీర్ సుల్తాన్ టొబాకో పరిశ్రమను 1916లో హైదరాబాద్ విఠల్వాడి ప్రాంతంలో వజీర్ సుల్తాన్ ప్రారంభించారు. ఈ పరిశ్రమను 1930లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు ప్రస్తుతం ఉన్న వీఎస్టీ ప్రాంతానికి ముషీరాబాద్ – ఆజామాబాద్గా మార్చారు. ఈ కంపెనీ చామ్స్, చార్మినార్, గోల్డ్ మూమెంట్స్ అనే సిగరెట్లను ఉత్పత్తి చేసేది. 200 ఎకరాల విస్తీర్ణం కలిగిన ముషీరాబాద్ ఆజామాబాద్ ప్రాంతాన్ని 1930లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు నిజాం ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు కేటాయించింది.
కార్ఖానా జిందా తిలస్మాత్ :
హకీం మహ్మద్ మొమినుద్దీన్ ఫారూకి హైదరాబాద్ నగరంలో కార్ఖానా జిందా తిలస్మాత్ను స్థాపించాడు.
ఆజామ్జాహీమిల్స్:
ఇది దుస్తుల ఉత్పత్తి చేసే పరిశ్రమ. వరంగల్‌లో స్థాపించిన పరిశ్రమల్లో ముఖ్యమైంది.
హైదరాబాద్ స్టేట్ బ్యాంక్:
1941లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రభుత్వ బ్యాంక్‌ను నెలకొల్పాడు. దీన్ని ఆ రోజుల్లోనే హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ అనేవారు. ప్రస్తుతం అదే బ్యాంక్ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్‌గా కొనసాగి ఎస్బీఐలో విలీనమైంది. ఇది స్టేట్ సెంట్రల్ బ్యాంక్‌గా ఉస్మానియా సిక్కా కరెన్సీని తన అజమాయిషిలో నిర్వహించేది. స్వదేశీ సంస్థానాల్లో ఒక్క హైదరాబాద్ రాజ్యానికి మాత్రమే సొంత కరెన్సీ చెలామణి చేసే హక్కు ఉండేది. ఆరో నిజాం కాలంలో 1869లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ శాఖ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇది 1927లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. నిజాం ప్రభుత్వ సహకారంతో 1918లో టాటా ఇండస్ట్రీయల్ బ్యాంక్‌ను స్థాపించారు. తర్వాత ఇది టాటా బ్యాంక్ సెంట్ర్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది.
డి.బి.ఆర్. బిల్లు: దివాన్ బహదూర్ రాంగోపాల్ బిల్లు. దీన్నే డి.బి.ఆర్.మిల్స్ అంటారు. దీన్ని 1920, ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్‌లో స్థాపించారు. ఇది ప్రైవేట్ కంపెనీ. బయట నుంచి తీసుకువచ్చిన ముడిసరుకులతో దుస్తులు తయారు చేసేవారు. ప్రస్తుతం ఇది మూతపడింది.
7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పారిశ్రామిక ఉత్పత్తిని పెంచడం వల్లే అప్పట్లో హైదరాబాద్ సంస్థానం ఎన్నో రంగాల్లో ప్రపంచానికే మార్గదర్శకం గా ఉంది. దేశంలో మరెక్కడా లేనంత అభివృద్ధి హైదరాబాద్ సంస్థానంలో జరిగింది. కొందరు ఆయనను ద్వేషించినా, మరి కొందరు ప్రేమించినా, ఆయన హైదరాబాద్ అభివృద్ధికి చేసిన కృషిని అందరూ అభినందించక తప్పదు. ఆధునిక హైదరాబాద్ వాస్తుశిల్పిగా, ప్రణాళికా బద్ధమైన నగరాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన పోషించిన పాత్రను ఎవ్వరూ కాదన లేని వాస్తవం.