రేవంత్ ముందుకు ‘సికింద్రాబాద్’ కొత్త డిమాండ్
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు సికింద్రాబాద్ జిల్లాను కొత్తగా ఏర్పాటుచేయాలని తలసాని డిమాండ్ చేశారు
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముందుకు మరో కొత్త డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్ కూడా సికింద్రాబాద్ పేరుమీద రావటమే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే సికింద్రాబాద్(లష్కర్)పేరుమీద కొత్త కొర్పొరేషన్ తో పాటు జిల్లాను ఏర్పాటు చేయాలని. ఈ డిమాండును (Revanth)రేవంత్ ప్రభుత్వం ముందు ఉంచింది (BRS)బీఆర్ఎస్ సనత్ నగర్ ఎంఎల్ఏ, మాజీమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. ముషీరాబాద్ ఎంఎల్ఏ ముఠాగోపాల్ తదితరులతో కలిసి తలసాని(Talasani) హైదరాబాద్ లోని ధర్నాచౌక్ లో పెద్దఎత్తున ఆందోళనచేశారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) విషయంలో రేవంత్ కు తలనొప్పులు మొదలయ్యాయి.
ఎలాగంటే, ఇపుడు 150 డివిజన్లున్న గ్రేటర్ ను 300 డివిజన్లకు పెంచాలని రేవంత్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. డిసైడ్ చేయటమే ఆలస్యం గ్రేటర్ శివారుప్రాంతాల్లోని 27 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్లో కలిపేసి 300 డివిజన్లు చేసినట్లు నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. నోటిఫికేషన్ పై బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల నుండి కూడా పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఇదేవిషయమై నాలుగురోజుల క్రిందట నిర్వహించిన గ్రేటర్ కార్పొరేషన్ పాలకమండలి సమావేశంలో చాలామంది కార్పొరేటర్లు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు.
ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు రేవంత్ ప్రభుత్వాన్ని సూటిగా రెండు ప్రశ్నలు అడుగుతున్నారు. అవేమిటంటే డివిజన్ల సంఖ్యను పెంచేముందు ఎవరిని అడిగారు ? ప్రజాభిప్రాయం తీసుకున్నారా ? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం నుండి సమాధానంలేదు. డివిజన్ల సంఖ్యను పెంచేముందు ప్రభుత్వం కార్పొరేటర్లకు చెప్పలేదు. అలాగే గ్రేటర్ పరిధిలోని ఎంఎల్ఏలతో కూడా సంప్రదించలేదు. చివరకు గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి కూడా డివిజన్ల సంఖ్య పెంపుపై సమాచారమే లేదు. గ్రేటర్ కౌన్సిల్ మీటింగులో తలసాని అడిగిన ఒక ప్రశ్నకు మేయర్ సమాధానమిస్తు డివిజన్లు పెంచుతున్న విషయం తనకు కూడా తెలీదని సమాధానమివ్వటమే విచిత్రం.
150 డివిజన్లను 300కి పెంచుతున్న విషయాన్ని రేవంత్ ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచింది. పబ్లిక్కుగా అందరితో మాట్లాడి చేయాల్సిన అంశంపైన రేవంత్ ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటించిందో ఎవరికీ అర్ధంకావటంలేదు. డివిజన్లను పెంచుతు ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్ పై కొందరు కోర్టులో పిటీషన్ వేసినపుడు హైకోర్టు ప్రభుత్వానికి బాగా తలంటింది. డివిజన్లు పెంచే అంశంపై గ్రేటర్ కౌన్సిల్లో చర్చించారా ? ఆమోదం తీసుకున్నారా ? ప్రజల నుండి సలహాలు, సూచనలు తీసుకున్నారా ? గ్రేటర్లో విలీనం చేసిన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల కౌన్సిల్ సమావేశాల్లో చర్చించారా ? అన్న కోర్టుప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది. ఎందుకంటే అనుసరించాల్సిన నియమ, నిబంధనలన్నింటినీ రేవంత్ ప్రభుత్వం ఉల్లంఘించింది కాబట్టే సమాధానం చెప్పలేకపోయింది. డివిజన్లను పెంచటానికి తాను వ్యతిరేకం కాదని చెప్పిన హైకోర్టు జారీచేసిన నోటిఫికేషన్ ను పక్కన పెట్టేసి ప్రొసీజర్ ను ఫాలో అవమని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్టు ఆదేశాలతో తలబొప్పికట్టిన రేవంత్ కు సికింద్రాబాద్ రూపంలో కొత్త తలనొప్పి మొదలైందనే చెప్పాలి. అదేమిటంటే పైన చెప్పుకున్నట్లు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు సికింద్రాబాద్ జిల్లాను కొత్తగా ఏర్పాటుచేయాలని తలసాని డిమాండ్ చేశారు. ‘లష్కర్ జిల్లా సాధన సమితి’ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దఎత్తున ఆందోళన జరిగింది.
సికింద్రాబాద్ మున్సిపాలిటి
దేశానికి స్వాతంత్ర్యం రాకమునుపే 1945లో సికింద్రాబాద్ మున్సిపాలిటి ఏర్పడింది. సికింద్రాబాద్ ప్రాంతంలో బ్రిటీష్ ఆర్మీ వాళ్ళు ఎక్కువగా ఉండేవారు. 1950 హైదరాబాద్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం సికింద్రాబాద్ మున్సిపాలిటీతో పాటు హైదరాబాద్ మున్సిపాలిటీని కూడా కార్పొరేషన్లుగా ప్రమోట్ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీలు కాస్త రెండు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లయ్యాయి. రెండు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లయిన సికింద్రాబాద్, హైదరాబాద్ ను విలీనం చేసేసి 1960లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చారు. తర్వాత 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ను ఏర్పాటుచేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలుగా బాగా పాపులర్ అయ్యాయి. సికింద్రాబాద్ లో మామూలు జనాలతో పాటు డిఫెన్స్ విభాగాలు, వ్యాపార సమాదాయాలు, రైల్వే శాఖకు సంబంధించిన కార్యాలయాలు, ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. గ్రేటర్ కు వచ్చే వార్షిక ఆదాయంలో సికింద్రాబాద్ వాటా ఎక్కువగా ఉంటుంది.
లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : తలసాని
లష్కర్ కార్పొరేషన్ తో పాటు లష్కర్ జిల్లాను కూడా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేయాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ సనత్ నగర్ ఎంఎల్ఏ తలసాని శ్రీనివాసయాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని లష్కర్ సాధనసమితి పేరుతో డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ‘‘సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుచేస్తే ముషీరాబాద్, అంబర్ పేట, సనత్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ నియోజకవర్గాలు బాగా డెవలప్ అవుతాయి’’ అన్నారు. ‘‘ పాలనా సౌలభ్యంతో ప్రజలకు కూడా మేలు జరుగుతుంది’’ అని చెప్పారు. ‘‘అందుకనే లష్కర్ జిల్లాతో పాటు కార్పొరేషన్ ను కూడా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నాము’’ అని అన్నారు. ‘‘ఇపుడు లష్కర్ ప్రాంతంలో గ్రేటర్లోని 42 డివిజన్లున్నాయి’’ అని తెలిపారు. ‘‘సికింద్రాబాద్ ప్రాంతంలో వచ్చే ఆదాయాన్ని లష్కర్ డెవలప్మెంట్ కే ఖర్చుపెట్టాలి’’ అని కూడా తలసాని డిమాండ్ చేశారు.
సికింద్రబాద్ కార్పొరేషన్ కష్టమే : ప్రొఫెసర్ మోహన్ రావు
‘‘సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లేదా లష్కర్ జిల్లాను ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుందని అనుకోవటంలేదు’’ అని రైల్వే కాలేజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ శాఖ రిటైర్డ్ ప్రొఫెసర్ మోహన్ రావు అభిప్రాయపడ్డారు. ‘‘సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాలన్న డిమాండ్ చాలాపాతదే’’ అని గుర్తుచేశారు. రాజకీయ నేతల డిమాండును ప్రభుత్వం అంగీకరించే అవకాశం చాలా తక్కువే’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘ఎందుకంటే ఇప్పటికే చాలా సమస్యలున్నాయి కాబట్టి మళ్ళీ సికింద్రాబాద్ పేరుతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు అనుమానమే’’ అని కూడా అన్నారు. ‘‘సికింద్రాబాద్ లో డిఫెన్స్ శాఖలున్న కంటోన్మెంట్ ఏరియా పాలన, రైల్వే శాఖ కార్యాలయాలే పెద్దసమస్య కాబట్టి ప్రత్యేక కార్పొరేషన్ సాధ్యంకాదు’’ అన్నారు. ‘‘సికింద్రాబాద్ లోని అత్యధిక భూములు రైల్వే, డిఫెన్స్ శాఖల చేతిలోనే ఉన్నాయి’’ అన్న విషయాన్ని ప్రొఫెసర్ చెప్పారు.
అడగటంలో తప్పులేదు : ముత్యాల
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, లష్కర్ జిల్లా కావాలని అడగటంలో తప్పులేదు’’ అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ముత్యాల పద్మనాభరెడ్డి అభిప్రాయపడ్డారు. ‘‘సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, శివారు గ్రామాలను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో కలిపేసి జీహెచ్ఎంసీగా ఏర్పాటుచేశారు’’ అని గుర్తుచేశారు. మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లాలు విస్తీర్ణంలో చిన్నవిగా ఉంటే పాలన సులభతరం అవుతుంది’’ అని అన్నారు. ‘‘ విస్తీర్ణం పెద్దదిగా ఉంటే పరిపాలనతో పాటు అభివృద్ధి కూడా కష్టమే’’ అని చెప్పారు. ‘‘బెంగుళూరులో కూడా ఇదేపద్దతిలో కార్పొరేషన్లను కలిపి, విడదీసి మళ్ళీ కలిపి ఇపుడు విడదీస్తున్నారు’’ అని గుర్తుచేశారు. ‘‘ముంబాయ్, ఢిల్లీలో కూడా ఇలాగే జరిగింది‘‘ అని చెప్పారు. డివిజన్ల సంఖ్యను 150 నుండి 300 డివిజన్లకు పెంచుతున్నపుడు పాలనా సౌలభ్యం కోసం అడిషినల్ కమీషనర్లను పూర్తి అధికారాలతో నియమించాలి’’ అని చెప్పారు. అయితే ఎవరితోను చర్చించకుండా డివిజన్ల సంఖ్యను 300కి పెంచటం ప్రభుత్వానిది తొందరపాటు చర్చే’’ అని కూడా అన్నారు. ప్రజల సలహాలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్ణయాలు చేయటం చాలా తప్పు అని అన్నారు.
చివరగా
తలసాని గ్రేటర్ పరిధిలోని కొద్దిమంది సీనియర్ నేతల్లో ఒకరు. ఒకపుడు టీడీపీలో ఉండి చక్రంతిప్పిన ఈ మాజీమంత్రి ప్రస్తుతం బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్నారు. ఇలాంటి తలసాని సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్, లష్కర్ జిల్లా అంటు ఆందోళనలు మొదలుపెట్టారంటే వెనుక ఏదో పెద్ద రాజకీయ అజెండా ఉండకుండా ఉండదు అని అర్ధమవుతోంది. తెలంగాణలో ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని బీసీ సామాజికవర్గాల్లో బలమైన యాదవ సామాజికవర్గంలో పార్టీలకు అతీతంగా తలసానికి గట్టి పట్టుంది.