అంబేద్కర్ ‘శిల్పి’ సుతార్ మృతి
శిల్ప కళా రంగంలో కోహినూర్ వజ్రంగా పోల్చదగిన వ్యక్తి రామ్ వంజీ సుతార్.
తెలంగాణ చరిత్రలో శాశ్వత మైలురాయిని నెలకొల్పిన శిల్పి రామ్ వంజీ సుతార్. ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం శిల్ప కళకు తీరని లోటుగా మారింది. ఆయన మరణంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరని లోటన్నారు. ‘‘ప్రముఖుల విగ్రహాలకు తన కళతో ప్రాణం పోసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహోన్నత శిల్పి రామ్ సుతార్. శిల్ప కళా రంగంలో కోహినూర్ వజ్రంగా పోల్చదగిన వ్యక్తి ఆయన. ఆయన సేవలను, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం రూపంలో తెలంగాణ రాష్ట్రం వినియోగించుకోవడం గర్వ కారణం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ అంటే ముందుగా గుర్తొచ్చేలా 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేసిన వ్యక్తి రామ్ సుతార్. ఆయన చెక్కిన ఆ విగ్రహం ఇప్పుడు తెలంగాణకు చిహ్నంగా మారుతోంది. ఆయన చేయి పడిందంటే ఆ విగ్రహం విశేషం ప్రపంచ నలుమూలలకు వ్యాపిస్తోందనడంలో అతిశయోక్తి అక్కర్లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం అయిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ.. భారతదేశ తొలి డిప్యూటీ ప్రధాని, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటే విగ్రహాన్ని 182 అడుగల ఎత్తుతో సిద్ధం చేశారు. ఆ విగ్రహాన్ని కూడా రామ్ సుతార్‌యే నిర్మించారు.
అంతేకాదు గుర్రపు స్వారీ చేస్తున్న ఛత్రపతి శివాజీ, పార్లమెంటులో కనిపించే ధ్యానం చేస్తున్న గాంధీ, బెంగళూరు అంతర్జాతీయ విమాశ్రయంలోని 33మీటర్ల పొడవైన కెంపె గౌడ విగ్రహం వంటి మరెన్నో ఐకానిక్ విగ్రహాలను కూడా ఆయనే నిర్మించారు.
బాంబే ప్రెసిడెన్సీలోని ప్రస్తుత ధులే జిల్లాలో ఉన్న గొండూరు గ్రామంలో 19 ఫిబ్రవరి 1925న రామ్ వంజీ సుతార్ జన్మించారు. చిన్న వయసు నుంచే శిల్ప కళ అంటే ఆయనకు ఎలనలేని మక్కువ, ప్రేమ. దానినే తన కెరీర్‌గా మార్చుకున్నారు. జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్‌లో చదివారు. గోల్డ్ మెడల్ కూడా సాధించారు. శిల్పిగా ఆయన ఎన్నో అచీవ్‌మెంట్స్ సాధించారు. 1999లో పద్మశ్రీ అందుకున్నారు. 2016లో పద్మ భూషణ్, 2018లో ఠాగోర్ పురస్కారాన్ని అందుకున్నారు. అంతేకాకుండా 2025లో మహారాష్ట్ర రాష్ట్ర అత్యుత్తమ పురాస్కారాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. 20 మార్చ్ 2025న రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించారు.