‘వనస్థలిపురం భూములు తెలంగాణ ప్రభుత్వానివే’
దాదాపు 20 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో కీలక ఊరట లభించింది. హైదరాబాద్ వనస్థలిపురం సమీపంలోని సాహెబ్‌నగర్ వద్ద ఉన్న 102 ఎకరాల భూమి పూర్తిగా అటవీ శాఖకే చెందిందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుమారు రూ.15 వేల కోట్ల విలువైన ఈ భూములకు సంబంధించి దాదాపు 20 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది.
ఈ భూమిపై యాజమాన్య హక్కులు కోరుతూ నిజాం, సాలార్‌జంగ్, మీరాలం వారసులమంటూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతంలో ఈ వివాదంలో పిటిషన్లు దాఖలు చేసిన 260 మంది పిటిషనర్లకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. వివాదాస్పద భూమి మొత్తం అటవీ భూమేనని తేల్చుతూ, ఆ భూమిపై పూర్తి హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నాయని స్పష్టం చేసింది.
అదే సమయంలో, ఈ భూమిని తీర్పు వెలువడిన ఎనిమిది వారాల్లోపు రిజర్వ్ ఫారెస్ట్‌గా నోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, ఆ నోటిఫికేషన్ ప్రతిని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి పంపాలని కూడా ధర్మాసనం స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించడంతో పాటు, విలువైన అటవీ భూముల పరిరక్షణకు ఇది ఒక కీలక మైలురాయిగా భావిస్తున్నారు.