ముడుమాల్ ప్రాచీన ‘నక్షత్రదర్శిని’కి మంచిరోజులు
నిలువు రాళ్లతో పాటు పెద్ద రాతి గుండ్లు 1200 ఉన్నాయి. వాటి ప్రత్యేకత ఏమిటంటే?
ఇక్కడ చూడండి. వరుసగా నిలువు రాళ్లు. అవి మామూలు రాళ్లు కాదు, మూడున్నర వేల ఏళ్ల క్రితం పాతిన ఆది మానవుల స్మారక శిలలు. అత్యంత చారిత్రక ప్రాధాన్యం ఉన్న శిలలు. అలనాటి ఖగోళ పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యం ముడుమాల్ నిలువురాళ్లు. ఇంత కాలం ఆలనా పాలనా లేక నిలబడి కొన్ని, వంగిపోయి కొన్ని, మరి కొన్ని కూలిపోయాయి. పూర్తిగా ముళ్ల కంపల్లో కూరుకుపోయి ఉన్నాయి. దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ దీనిని వెలుగులోకి తెచ్చింది. నవంబర్ 14, 2021 నుంచి ముడుమాల్ నిలువురాళ్ల పునరుద్ధరణ పనుల్ని ప్రారంభించింది. ‘సప్తర్షి మండలాన్ని కచ్చితంగా చిత్రించిన మొట్ట మొదటి ఖగోళ పరిశోధక ఆధారంగా ముడుమాల్ నక్షత్ర చిత్రీకరణకు' యునెస్కో వారసత్వ కట్టడాల టెంటేటివ్ లిస్ట్ (తాత్కాలిక జాబితా)లో చోటు దక్కింది.
అంతర్జాతీయ స్మారక చిహ్నాలు, ప్రదేశాల మండలి (ICOMOS), ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను పరిరక్షించడానికి, సంరక్షించడానికి పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థ. "ICOMOS ఇండియా యూనిట్‌లో నేను సభ్యుడిగా చాలా కాలం నుంచి పనిచేస్తున్నాను. ఆ అనుభవంతో ముడుమాల్ సంరక్షణ, పునరుద్ధరణ పనులను యునెస్కో ప్రమాణాలకు అనుగుణంగానే మొదలుపెట్టాం," అని దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఛైర్మన్ వేదకుమార్ చెప్పారు.
కర్ణాటక–తెలంగాణ సరిహద్దులో కృష్ణానది తీరం ముడుమాల్ గ్రామ శివారులో ఆదిమానవులు ఏర్పాటు చేసిన "ఈ భారీ గండ శిలలకు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం తెలంగాణ హెరిటేజ్ డిపార్ట్‌మెంట్‌ని కోరాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)ని సంప్రదించాం. ముడుమాల్ నిలువురాళ్ల ప్రాంతాన్ని సంరక్షించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఏ ఒక్కరాయికీ నష్టం జరగకుండా కాపలా కాస్తున్నాం. మూడేళ్లలో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల (శాశ్వత) జాబితాలో ముడుమాల్ నిలువరాళ్లకు చోటు దక్కేలా పనిచేస్తాం," అని వేదకుమార్ తెలిపారు.
నిలువురాళ్ల ప్రత్యేకత ఏమిటంటే?
"దాదాపు మూడున్నర వేల క్రితం ఆదిమానవులు ఆ రాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కోటి 10 అడుగుల నుంచి 15 అడుగుల ఎత్తున పెద్ద నిలువు రాళ్లను ఆది మానవుల సమూహంలోని ముఖ్యుల సమాధులకు స్మారక శిలలుగా వాటిని ఏర్పాటు చేశారు. గతంలో వందల సంఖ్యలో ఉన్న రాళ్లు, వ్యవసాయ పనుల వల్ల ధ్వంసమై ప్రస్తుతం కేవలం 80 మాత్రమే మిగిలాయి, " అని దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ రీసెర్చ్ హెడ్, సెంట్రల్ యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కె.పి.రావు తెలిపారు.
నిలువు రాళ్లతో పాటు ఇక్కడ పెద్ద రాతి గుండ్లు 1200 ఉన్నాయి. ఇవి కూడా స్మారక శిలలే అయినా, ఆ రాతి నీడల ఆధారంగా నాటి వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు వినియోగించారు. "ఆకాశంలో సప్తర్షి మండలం(ఉర్సా మేజర్)గా పరిగణించి నక్షత్రాల సమూహం ఉన్న ఆకృతి ఈ నిలువు శిలల వద్ద చెక్కి ఉంది. అది మూడున్నర వేల ఏళ్ల క్రితం చెక్కారు. నక్షత్ర గమనం, రాళ్ల నీడల గమనం ఆధారంగా వాతావరణంలో మార్పులు, కాలాల ఆగమనం, విపత్తుల అంచనా, ఇలా గుర్తించేవారని" ప్రొఫెసర్ కె.పి. రావు చెప్పారు.
ఆదిమ కాలపు స్టార్ డిపిక్షన్స్ (నక్షత్ర మండలాల చిత్రీకరణ)లో ఉర్సా - మేజర్‌ని కలిపే ఊహారేఖ ఉత్తర దిక్కుని కచ్చితత్వంతో సూచించట్లేదు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఒక్క ముడుమాల్ లోనే నక్షత్ర చిత్రీకరణలోనే ఉర్సా-మేజర్‌ని కలిపే ఊహారేఖ ఉత్తర ధ్రువాన్ని (ఉత్తర దిక్కుని) సూచిస్తున్నాయి. ఆ చిత్రీకరణలోని ఉర్సా-మేజర్ కప్‌మార్క్స్ ఉత్తర ధ్రువ నక్షత్రం ఒకే వరుసలో ఉండేలా పాతిపెట్టారు. ఇలా చేయడం వల్ల వాళ్లు ఆ ప్రదేశంలో దిక్కులను తెలుసుకోవడానికి, కొలతలు తీసుకోవడానికి ఆ రాయిని ఆధారం చేసుకున్నారని అర్థమవుతున్నదని ప్రొఫెసర్ రావు చెప్పారు.
నేటి సాంకేతిక వ్యవస్థలు అందుబాటులోకి రాకపూర్వం వరకు ఉర్సా-మేజర్ ఆధారంగానే సముద్రాల్లో, ఎడారుల్లో ప్రయాణించేవాళ్లు. ఉర్సా మేజర్ అంటే ఆకాశంలో ప్రకాశ వంతంగా ఏలుగుబంటి ఆకారంలో కనిపించే నక్షేత్రమండలమే ఉర్సామేజర్. "మానవ చరిత్రలో నక్షేత్రాల్ని గుర్తించిన మొట్ట మొదటి చారిత్రక ఆధారం ముడుమాల్. ప్రపంచంలో నక్షత్ర మండలాన్ని మొట్టమొదటిసారి కచ్చితంగా నమోదు చేసి, ఘనమైన వారసత్వాన్ని మనకు వదిలి వెళ్లారు," అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్ ప్రొఫెసర్ కె అర్జున్ రావు చెప్పారు.
ముడుమాల్ యునెస్కో గుర్తింపు పొందాలంటే?
1) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందాలంటే చాలా నియమాలు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ఈ స్థలానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ముడుమాల్‌లోని నిలువురాళ్లకు వున్న ప్రత్యేకతలు, చరిత్ర, శాస్త్రీయ ఆధారాలతో ప్రతిపాదనలు పంపించాలి.
2) ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యూమెంట్స్ అండ్ సైట్స్ (ఐకొమస్) ప్రతినిధుల బృందం దశల వారీగా క్షేత్ర స్థాయిలో సందర్శించి, స్టడీ చేసి, నివేదిక రూపొందించి యునెస్కో కమిటీకి అప్పగిస్తారు.
3) గుర్తింపునకు పోటీపడుతున్న దేశాలతో యునెస్కో సమావేశం నిర్వహిస్తుంది. అందులో ఆయా దేశాల ప్రతినిధులు చర్చిస్తారు. యునెస్కో సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం నిలువురాళ్లపై పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న పరిశోధకులు, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
4) వివిధ దేశాల నుంచి నామినేట్ అయిన వాటిపై చివరిగా ఓటింగ్ నిర్వహిస్తారు. అప్పుడు ఈ సైట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను తెలియజెప్పి ఓటింగ్‌కు ఒప్పించాలి. అప్పుడే యునెస్కో గుర్తింపు వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ సహకారంతో నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు సాధించేందుకు కృషి చేస్తున్నామని ప్రొఫెసర్ కె అర్జున్ రావు తెలిపారు.
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌లు కేవలం టూరిస్ట్ అట్రాక్షన్లు కాదు. అవి మన ఉమ్మడి చరిత్ర, సంస్కృతికి సజీవ జ్ఞాపికలు. వాటిని రక్షించడం వల్ల భవిష్యత్తు తరాలకు కాలం మారే కొద్దీ భారతదేశంలో వచ్చిన మార్పులు అర్థమవుతాయి. వీటిని సురక్షితంగా ఉంచాలంటే రెగ్యులర్ కన్జర్వేషన్ వర్క్, పబ్లిక్ అవేర్‌నెస్ వుండాలి. ఇప్పటి వరకు మన దేశంలో 44 నిర్మాణాలకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌లుగా గుర్తించింది. మరో 69 ప్రతిపాదనలు జాబితాలో ఉన్నాయి. దేశంలో 3700 చారిత్రక కట్టడాలను భారత పురాతత్వ శాఖ కాపాడుతోంది.