బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏలపై ఎవరేమన్నారు

టీడీపీ, కాంగ్రెస్ ల నుండి వివిధ దఫాలలో పలువురు ఎంఎల్ఏలు, ఎంపీలను బీఆర్ఎస్ లోకి లాగేసుకున్నారు.

Update: 2025-12-19 12:58 GMT
BRS Defection MLAs

రెండురోజులుగా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏల మీద అన్నీపార్టీల నేతలు విపరీతంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా (BRS)బీఆర్ఎస్, బీజేపీ నేతలు రాజ్యాంగం, చట్టంగురించి మాట్లాడటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఫిరాయింపులకు తలుపులు తెరిచిందే (KCR)కేసీఆర్. 2014లో బొటాబొటి మెజారిటీతో మాత్రమే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఏ సందర్భంలో అయినా తన ప్రభుత్వం పడిపోవచ్చన్న భయంతో ఇతరపార్టీల నుండి ఎంఎల్ఏలను తన పార్టీలోకి చేర్చుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. వెంటనే తన ప్లాన్ ను అమల్లోకి తీసుకొచ్చారు. (TDP)టీడీపీ,(Telangana Congress) కాంగ్రెస్ ల నుండి వివిధ దఫాలలో పలువురు ఎంఎల్ఏలు, ఎంపీలను బీఆర్ఎస్ లోకి లాగేసుకున్నారు.

టీడీపీ, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన వారిలో కొందరిని మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నారు. ఎలాగో 2018వరకు నెట్టుకొచ్చిన కేసీఆర్ అదే ఏడాదిలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. ఆ ఎన్నికల్లో 80 సీట్లతో రెండోసారి అధికారంలోకి వచ్చారు. రెండోసారి మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చినా ఫిరాయింపులను అయితే ఆపలేదు. మొదటిసారి ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు ఫిరాయింపులకు పాల్పడ్డారంటే అర్ధముంది. మరి రెండోసారి ఎన్నికల్లో 80సీట్లు వచ్చినాకూడా ఫిరాయింపులకు ఎందుకు పాల్పడ్డారు ? ఎందుకంటే తెలంగాణలో తనకు ప్రతిపక్షమన్నదే లేకుండా చేయాలని. టీడీపీని చీల్చిచెండాడేసి టీడీఎల్పీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకుని భూస్ధాపితం చేసేశారు. అలాగే కాంగ్రెస్ ను కూడా ఎంత వీలైతే అంత బలహీనం చేశారు.

ఇక్కడ అర్ధమవుతున్నది ఏమిటంటే ఫిరాయింపులకు లాకులెత్తిందే కేసీఆర్ అని. ఫిరాయింపులపై మాట్లాడటానికి కేసీఆర్ కు మొహం చెల్లటంలేదు కాబట్టి కొడుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నానా గోలచేస్తున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మందిపైన ఎలాగైనా అనర్హత వేటువేయించాలన్న కసితో కేటీఆర్ కోర్టుల్లో కేసులు వేయించారు. తాము అధికారంలో ఉన్నపుడు పాల్పడిన ఫిరాయింపులను కేటీఆర్ అడ్డుగోలుగా సమర్ధించుకుంటు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపైన మాత్రం ఆరోపణల బురదను చల్లేస్తున్నారు. ‘‘మగాడివైతే పదిమంది ఫిరాయింపులతో రాజీనామాలు చేయించాలి’’ అని సవాలు విసిరారు. ‘‘దమ్ముంటే పదిమందితో రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకు వెళ్ళాలి’’ అని ఛాలెంజ్ చేస్తున్నారు. కేటీఆర్ ఎంతగా రెచ్చగొడుతున్నా రేవంత్ అయితే పట్టించుకోవటంలేదు.

ఇక బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతు ఫిరాయింపుల రూలింగ్ పై అసెంబ్లీ స్పీకర్ పునరాలోచించాలని డిమాండ్ చేశారు. పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏలకు సంబంధించి ఐదుమంది విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన తీర్పు చెప్పారు. స్పీకర్ ఏమన్నారంటే ఐదుమంది బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఆధారాలు లేవన్నారు. పార్టీ ఫిరాయించారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ అందుకు ఆధారాలు చూపించలేదని స్పీకర్ అన్నారు. ఇందులో తప్పేమీలేదని అందరికీ తెలుసు. కోర్టులో అయినా స్పీకర్ విచారణలో అయినా ఆరోపణలు చేయటంకాదు ఆధారాలను చూపాలి. ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఆధారాలను చూపటంలో బీఆర్ఎస్ ఫెయిలైంది. ఫిరాయింపుల విషయంలో నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ ఒకే విధంగా నిబంధనలను నీరుగారుస్తున్నట్లు ధ్వజమెత్తటమే విచిత్రంగా ఉంది.

కర్నాటక, మణిపూర్, అస్సాం, మేఘాలయా, హర్యాన వంటి రాష్ట్రాల్లో బీజేపీ యధేచ్చగా ఎంఎల్ఏల ఫిరాయింపులను ప్రోత్సహించిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి బీజేపీ కేంద్రమంత్రి కిషన్ కూడా ఫిరాయింపుల గురించి మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది.

ఇక జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత స్పందన కూడా విచిత్రమే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విలువలు లేవని, పార్టీలు ఫిరాయించిన ఎంఎల్ఏల విషయంలో అసెంబ్లీ స్పీకర్ తీర్పు దారుణంగా ఉందని మండిపోయారు. ఎవరైనా పార్టీలు మారితే ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామాలు చేయాలని కవిత డిమాండ్ చేయటమే విడ్డూరంగా ఉంది.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు తండ్రి కేసీఆర్ ఫిరాయింపులకు పాల్పడటాన్ని కవిత ఏనాడూ అడ్డుకోలేదు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా కవిత అప్పుడు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఫిరాయింపు రాజకీయాలపై ఇపుడు చెప్పిన నీతులు మరి ఆరోజు తండ్రికి ఎందుకు చెప్పలేదు ? టీడీపీ, కాంగ్రెస్ లో నుండి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలను తమ పదవులకు రాజీనామాలు చేయాలని ఎందుకు డిమాండ్ చేయలేదో కవిత సమాధానం చెప్పాలి. నిజానికి ఫిరాయింపులు ఏరూపంలో ఉన్నా, ఎవరు ప్రోత్సహించినా తప్పే అనటంలో సందేహంలేదు. కాకపోతే అధికారంలోఉన్నపుడు రాజ్యాంగం, చట్టాన్ని పట్టించుకోని కేటీఆర్ ఇపుడు వాటిగురించే ప్రతిరోజు మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది.

Tags:    

Similar News