ఇల్లు తాకట్టు పెట్టిన హరీష్ రావు, ఎందుకో తెలుసా?

మాజీ మంత్రి హరీష్ రావు తన ఇంటిని తాకట్టు పెట్టారు.

Update: 2025-12-19 10:12 GMT

సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తన ఇంటిని తాకట్టు పెట్టారు. రూ.20లక్షల లోన్ కోసం హరీష్ రావు.. తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టారు. మంత్రిగా చేసిన ఆయనకు ఇల్లు తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? అని ఆలోచిస్తున్నారు. హరీష్ రావు ఆ పని చేసింది.. తన స్వార్థం కోసం కాదు.. ఒక పేద విద్యార్థినికి మద్దతుగా నిలవడానికి. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు వచ్చింది. కానీ ట్యూషన్ ఫీజులకు ప్రతి ఏడాది రూ. 7.50 లక్షలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం తెలిపింది.

దాంతో మమతా బ్యాంకు‌లో లోన్ తీసుకుందామని వెళ్లారు. ఏదైనా ఆస్థిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంక్ వాళ్లు చెప్పడంతో మమతకు ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఈ నెల 18వ తేదీన ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో చేరకుంటే పీజీ సీటును తిరస్కరించే పరిస్థితి నెలకొంది. ఇదే విషయాన్ని విద్యార్థిని మమత, ఆమె తండ్రి కొంక రామచంద్రం మాజీ మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే.. హరీష్ రావు వెంటనే తన ఇంటిని బ్యాంకు‌లో తాకట్టు పెట్టడానికి రెడీ అయ్యారు.

తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి మమతకు రూ. 20 లక్షల ఎడ్యూకేషన్ లోన్ మంజూరు చేయించారు. అంతేకాకుండా హాస్టల్ ఫీజు కోసం మరో లక్ష రూపాయలు ఇచ్చారు. హరీష్ రావు అందించిన సహాయానికి విద్యార్థిని మమత, ఆమె తండ్రి రామచంద్రం ధన్యవాదాలు తెలిపారు. పీజీ సీటు పోతుందని బాధపడ్డానని, కానీ హరీష్ రావు దేవుడిలా తనకు సహాయం అందించారంటూ మమత సంతోషం వ్యక్తం చేశారు.

‘‘మా అమ్మానాన్నలు కష్టపడి టైలరింగ్ చేస్తూ నన్ను ఎంబిబిఎస్ దాకా చదివించారు. అహర్నిశలు శ్రమించి పీజీ ఎంట్రన్స్ లో సీటు దక్కిందని సంతోష పడ్డాను. ఉచితంగానే సీటు వచ్చినా కానీ ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు రూ.7.50 లక్షల చొప్పున మూడేళ్లు రూ.22.50 లక్షలు కట్టాలని చెప్పడంతో ఇక సీటు అసాధ్యమని అనుకున్నా’’ అని మమతా చెప్పుకొచ్చారు.

‘‘నాకు పీజీ చదివే యోగ్యం లేదని బాధపడ్డాను. కానీ గతంలో నాతో పాటు మా చెల్లెళ్ళకు ఎంబీబీఎస్ చదవడానికి హరీష్ రావు సార్ హెల్ప్ చేశారు. కానీ ఇది పెద్ద విషయం కావడంతో సార్ చేస్తారో..లేదో అని టెన్షన్ పడ్డాము . మేము అడగడమే ఆలస్యం.. తన ఇంటిని బ్యాంకులో మార్టిగేజ్ చేసి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తానని వెంటనే బ్యాంకు వారికి కూడా ఫోన్ చేసి చెప్పారు’’ అని మమతా తెలిపారు.

Tags:    

Similar News