‘తెలంగాణలో బీజేపీ బలపడుతోంది’
బీజేపీ పుంజుకుంటుందని చెప్పడానికి పంచాయతీ ఎన్నికలే నిదర్శనమన్న రామచందర్‌రావు.
తెలంగాణలో బీజేపీ బలపడుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. అందుకు తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలే నిదర్శనమని చెప్పారు. గతంతో పోల్చుకుంటే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. గతంలో బీజేపీ ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో కూడా ఈసారి మంచి ఓట్లను తమ పార్టీ సంపాదించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయని అన్నారు. రోజురోజుకు బీజేపీ ప్రజల విశ్వాసం పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన స్వలాభం కోసం ఖర్చు చేయకూడదంటే రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని వివరించారు. రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంటే కేంద్ర నిధులు, పథకాలు నేరుగా ప్రజలకు చేరతాయని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చాలా ప్రాంతాల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని, వేరు వేరు కాదని పునరుద్ఘాటించారు. గాంధీ అంటే బీజేపీకి ఎంతో గౌరవం ఉందని, కానీ రామరాజ గ్రామస్వరాజ్యం కోసమే ఉపాధి హామీ పథకం పేరు మార్చడం జరిగిందని వివరించారు.
గతంలో ఉపాధి హామీ పథకం 100 రోజులకు ఉండేదని, దానిని బీజేపీ ప్రభుత్వం 120 రోజులకు పెంచిందని చెప్పారు. దీని వల్ల ఎందరో పేదలకు లాభం చేకూరుతుందని వివరించారు. కానీ కాంగ్రెస్ కావాలనే పేరు మార్పును భూతద్దంలో చూపిస్తూ అనవసర రాద్దాంతం చేస్తోందని విమర్శించారు.