ఆ టవర్లు తప్పుకోవాల్సిందే!
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టవర్లను తొలగించడానికి ప్రభుత్వ కసరత్తు
"ముడుమాల్ గ్రామంలో "80 ఎకరాల విస్తీర్ణంలో నిలువురాళ్లు విస్తరించి ఉన్నాయి. 10 నుంచి 15 అడుగుల ఎత్తైన భారీ రాళ్లు వరుసగా నిలబెట్టి ఉన్నాయి. కొన్ని రాళ్లు ఒకదానిపై మరొకటి ఉంచారు. మరికొన్ని వరుసగా నిలబెట్టారు. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే, వసంత, శరద్ ఋతువుల సమయంలో సూర్యోదయం, సూర్యాస్తమయ దిశలతో ప్రాముఖ్యమైన అనుసంధానాన్ని గమనించవచ్చు. వీటి నిర్మాణ శైలి స్టోన్‌హెంజ్ తరహాలో ఉండటంతో, ఖగోళ సంబంధిత విషయాల్లో వీటిని ఉపయోగించేవారని," దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ రీసెర్చ్ హెడ్, సెంట్రల్ యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కె.పి.రావు ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు.
"ఈ నిలువురాళ్లకు యునెస్కో తాత్కాలిక జాబితాలో స్థానం దక్కిన విషయం తెలిసిందే. అయితే శాశ్వత గుర్తింపు లభిస్తేనే, ఈ ప్రదేశం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారుతుంది. ఇక్కడ పర్యటించే వారికి ప్రాచీన భారతీయ నాగరికతను దర్శించే అపూర్వ అవకాశం వుంటుంది. ఈ నిలువురాళ్లు ప్రపంచ పటంలో తెలంగాణ గర్వకారణంగా నిలుస్తాయని," అని దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఛైర్మన్ వేదకుమార్ చెప్పారు.
అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఉన్న ఈ నిలువు రాళ్ల ప్రాంగణంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టవర్లు వున్నాయి. ముడుమాల్‌కు పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఆవల రాయచూర్ విద్యుత్ కేంద్రం ఉంది. అక్కడి నుంచి విద్యుత్‌ను పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ప్రత్యేక లైన్ల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని గుత్తికి తరలిస్తోంది. ఈ లైన్ల తాలూకు టవర్లు సరిగ్గా ముడుమాల్ నిలువు రాళ్ల ప్రాంగణం మీదుగా సాగుతున్నాయి. మూడు టవర్లు ఆ ప్రాంగణం వద్దనే ఉన్నాయని" అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్ ప్రొఫెసర్ కె అర్జున్ రావు చెప్పారు.
ఓ చారిత్రక ప్రాంతానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చే ముందు చాలా అంశాలను యునెస్కో పరిశీలిస్తుంది. ఆ ప్రాంతం ప్రత్యేకతకు అడ్డుగా కనిపించేలా భారీ టవర్లు ఉండకూడదనేది దాని నిబంధనల్లో ఒకటి. మరో ఏడాదిన్నరలో దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, యునెస్కోకు డోషియర్‌ను సమర్పించనుంది. ఆ డోషియర్‌లో పేర్కొన్న ప్రత్యేకతలు ఆ ప్రాంతంలో ఉన్నాయా లేదా అని పరిశీలించేందుకు యునెస్కో ప్రతినిధులు వస్తారు. వారు వచ్చే నాటికి టవర్లు అడ్డుగా ఉంటే గుర్తింపునకు అవకాశాలు మూసుకుపోతాయి. ఈలోపే టవర్లను తరలించాల్సి ఉంటుంది. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని దక్కన్ హెరిటేజ్ అకాడమీ ఛైర్మన్ వేదకుమార్ మంత్రి వాకాటి శ్రీహరి దృష్టికి తీసుకువెళ్ళారు.
"ముడుమాల్ సైట్ మీదుగా వున్న విద్యుత్ తీగలు తొలగించేలా పవర్ గిడ్ వాళ్ళతో మాట్లాడాతాను. మా ప్రాంతానికే గొప్ప పేరు తీసుకువచ్చే స్థలం అది. దానిని కాపాడుకుంటాం. ప్రపంచ దేశాలకు చాటి చెబుతాం. పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతాం. ప్రభుత్వం ద్వారా అందించాల్సిన సహాయం అందిస్తాం. నా తరఫున పూర్తి సహకారం అందిస్తాను అని మక్తల్ ఎమ్మెల్యే, రాష్ట్ర పశుసంవర్ధక, యువజన సర్వీసులు, క్రీడా మంత్రి వాకాటి శ్రీహరి ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టవర్ల తొలగింపుకు సంబంధించి దక్కన్ హెరిటేజ్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ రోజు డిశంబర్ 19వ తేదీనాడు పవర్‌గ్రిడ్, రెవెన్యూ, స్టేట్ ఆర్కియాలజీ అధికారులతో ఫీల్డ్ విజిట్ చేసి రిపోర్ట్ తయారు చేశారు.