ఉపాధి హామీ పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసన
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన.
ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. దీనికి వ్యతిరేకంగానే శనివారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. సికింద్రాబాద్ ప్యారడైజీ ఎంజీ రోడ్‌లో ఈ ఆందోళన చేపట్టారు. ఇందులో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి సహా తదితరులు పాల్గొన్నారు. గాంధీ కుటుంబం పేరు చెప్తే బీజేపీకి భయమేస్తుందని, అందుకే పథకాల పేర్లలో కూడా గాంధీ అని లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. బీజేపీ వాళ్లంతా గాడ్సేను పూజించే వాళ్లు కాబట్టే గాంధీ పేరును తొలగిస్తున్నారని అన్నారు.
‘‘గాంధీ కుటుంబాన్ని ధైర్యంగా ఎదుర్కునే దమ్ము మోదీ, అమిత్ షాలకు లేదు. ప్రజలకు 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. నిరుపేదలకు అండగా నిలవాలన్న లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆలోచన చేసింది. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏం చేసింది. ఉపాధి హామీ పథకం నిధులకు కోత పెడుతూ వచ్చింది. ఇప్పటికే పెడుతోంది. రాష్ట్రాలపై భారం మోపేలా నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు చివరికి పథకం పేరు నుంచి గాంధీ పేరును తొలగించింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికం’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘రాజ్యంగాన్ని మార్చడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. సోనియా గాంధీ కుటుంబంపై కక్షపూరితంగా కేసులు బయనాయిస్తోంది. లౌకికవాద దేశంలో మోదీ, అమిత్ షా పప్పులు ఉడకవు. కులాలు, మతాల పేరుతో రాజకీయం చేస్తున్నవారికి గుణపాఠం తప్పదు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం తథ్యం. ప్రధాని స్థానంలో రాహుల్ గాంధీ కూర్చోవడం ఖాయం’’ అని ధీమా వ్యక్తం చేశారు.