ఎంఎల్ఏలపై రేవంత్ రెడ్డి సీరియస్

సుమారు 18 మంది ఎంఎల్ఏలపైన బాగా సీరియస్ అయినట్లు పార్టీవర్గాల సమాచారం.

Update: 2025-12-20 07:13 GMT
Revanth Reddy serious

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బాగా సీరియస్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల ఓవరాల్ ఫలితాలపై హ్యాపీగానే ఉన్నా ఒక విషయంలో మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై(Revanth)రేవంత్, (Telangana Congress)కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇంచార్జి (Meenakshi Natarajan)మీనాక్షి నటరాజన్ శనివారం సమీక్ష మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలోనే సుమారు 18 మంది ఎంఎల్ఏలపైన బాగా సీరియస్ అయినట్లు పార్టీవర్గాల సమాచారం. ఎందుకు సీరియస్ అయ్యారంటే ఈఎంఎల్ఏల సొంత పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీచేసిన నేతలు ఓడిపోయారు. సొంత మనుషులను, బంధువులను, మద్దతుదారులను పోటీలోకి దింపిన ఎంఎల్ఏలు వాళ్ళని ఎందుకు గెలిపించుకోలేకపోయారని నిలదీసినట్లు తెలిసింది.

ఉదాహరణలు తీసుకుంటే జడ్చర్ల ఎంఎల్ఏ జానంపల్లి అనిరుధ్ రెడ్డి సొంత పంచాయతీ రంగారెడ్డి గూడలో కాంగ్రెస్ మద్దతుదారుడు ఓడిపోయాడు. మహబూబాబాద్ ఎంఎల్ఏ మురళీనాయక్ సొంత గ్రామ పంచాయతీ సోమ్లాతండాలో మద్దతుదారుడు ఓడిపోయాడు. షాద్ నగర్ ఎంఎల్ఏ వీర్లపల్లి శంకర్ పంచాయతీలో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్ధి ఓడిపోయాడు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎంఎల్ఏ జీ మధుసూదన్ రెడ్డి సొంత పంచాయతీ ధమగ్నాపూర్ లో కాంగ్రెస్ మద్దతుదారుడు ఓడిపోయాడు. మానుకొండూరు ఎంఎల్ఏ కవ్వంపల్లి సత్యనారాయణ సొంత గ్రామం పచ్చనూరులో కాంగ్రెస్ మద్దతుదారుడు ఓడిపోయాడు.

అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పంచాయతీల్లో కూడా కాంగ్రెస్ బలపరచిన అభ్యర్ధులు ఓడిపోయారు. ఇలాంటి పంచాయతీలు ఇంకా కొన్నిఉన్నాయి. ఇక్కడ రేవంత్ కు కోపం వచ్చిన కారణాలు మూడున్నాయి. అవేమిటంటే తమ పంచాయతీల్లో రెబల్స్ పోటీలో ఉన్నా మంత్రులు, ఎంఎల్ఏలు వారితో మాట్లాడి పోటీలో నుండి తప్పించలేకపోవటం. రెండు దగ్గరి బంధులు, సొంత మనుషులు, మద్దతుదారులని జనాలు వ్యతిరేకించినా లెక్కచేయకుండా వారినే పోటీలోకి దింపటం. కాంగ్రెస్ బలపరచి ఓడిపోయిన పంచాయతీల్లో మెజారిటీ పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరచిన మద్దతుదారులు గెలవటం.

వరంగల్, పాలమూరు, నల్గొండ జిల్లాల్లోని కొన్ని పంచాయతీల ఫలితాలపై రేవంత్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసినట్లు తెలిసింది. తొందరలోనే జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో ఇలాంటి పద్దతులను తాను ప్రోత్సహించేదిలేదని స్పష్టంగా హెచ్చరించారు. దగ్గరి బంధువులని, సొంతమనుషులని ప్రజల్లో పలుకుబడి లేనివాళ్ళని, వ్యతిరేకత ఉన్నవాళ్ళని ఎన్నికల్లో పోటీచేయిస్తే ఓటమి ఖాయమన్న విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలని చెప్పారు.

రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లాను మినహాయిస్తే సిద్ధిపేట జిల్లాలో తప్ప మిగిలిన 31 జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే ఎక్కువ పంచాయతీల్లో గెలిచారు. 12,733 పంచాయతీల్లో 7,010 పంచాయతీలను కాంగ్రెస్ బలపరచిన అభ్యర్ధులే నెగ్గారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 3,502 పంచాయతీల్లో, బీజేపీ 688 బలపరచిన అభ్యర్ధులు పంచాయతీల్లో గెలిచారు. మరికొన్ని చోట్ల కమ్యూనిస్టులు బలపరచిన అభ్యర్ధులు, సుమారు 800మంది స్వతంత్రులు గెలిచారు. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ లాంటి కొన్ని జిల్లాల్లో దాదాపు కాంగ్రెస్ మద్దతుదారులు క్లీన్ స్వీప్ చేసినట్లే అనుకోవాలి. ఈరోజు జరిగిన సమీక్ష తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికలకు సన్నాహక సమావేశం అనే చెప్పుకోవాలి.

Tags:    

Similar News