ఎన్డీయేలో కేసీఆర్ చేరిక పక్కానా ? సంకేతాలు పంపిన మోదీ ?

కేసీఆర్ ఆరోగ్యంగురించి మోదీ వాకాబుచేయటం, జాగ్రత్తలు చెప్పటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి

Update: 2025-12-20 13:16 GMT
Modi and KCR

‘‘కేసీఆర్ ఎలాగున్నారు ? ఆరోగ్యం ఎలాగుంది ? ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి..కేసీఆర్ ఆరోగ్యం గురించి నేను అడిగినట్లు చెప్పండి’’...ఇవన్నీ కేసీఆర్ గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అడిగిన ప్రశ్నలు, చెప్పిన మాటలు. కేసీఆర్ ఆరోగ్యంగురించి మోదీ వాకాబుచేయటం, జాగ్రత్తలు చెప్పటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మామూలుగా అయితే కేసీఆర్ ఆరోగ్యం గురించి మోదీ వాకాబుచేయటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీలేదు. అయితే ఇద్దరిమధ్య రాజకీయంగా సంబంధాలు ఉప్పు-నిప్పు అన్నవిషయం అందరికీ తెలిసిందే. 2023 ఎన్నికల ముందు ముఖ్యమంత్రి హోదాలో మోదీపై కేసీఆర్ ఎన్నేసి మాటలన్నారో అందరికీ గుర్తుండే ఉంటుంది.

మోదీ ఇమేజిని కేసీఆర్ చాలాసార్లు చాలా పలుచనచేసి మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్ హౌస్ నుండి బయటకు అడుగుపెట్టని కేసీఆర్, మోదీగురించి కాదుకదా కనీసం బీజేపీ గురించి కూడా నోరిప్పటంలేదు. తన పాలనా వైఫల్యాలు, అవినీతిపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరుపుతున్న విచారణలు, కేసులు తదితరాల కారణంగా ఏకకాలంలో ఇటు రేవంత్ అటు మోదీతో వైరం పెట్టుకుంటే కష్టమని భావించినట్లున్నారు. కారణం ఏదైనా ఇపుడు మోదీ, బీజేపీ గురించి నెగిటివ్ గా ఏమీ మాట్లాడటంలేదు. ఎన్నికల సమయంలో తెలంగాణలో పర్యటించినపుడు మోదీ మాట్లాడుతు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలాగ అయిపోయిందని ఆరోపించారు. అంతకుమించి కేసీఆర్ ను వ్యక్తిగతంగా కాని, కుటుంబంగురించి కాని మోదీ ఏమీ మాట్టాడలేదు. ఎన్డీయేలో చేరుతానని కేసీఆర్ అడిగితే తానే వద్దన్నట్లు మోదీ చెప్పారు.

రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి అందరికీ తెలిసిందే. దాన్ని నిజంచేస్తున్నట్లుగానే హఠాత్తుగా ఇంతకాలానికి మోదీకి కేసీఆర్ ఆరోగ్యం గుర్తుకురావటం కాకతాళీయం కాకపోవచ్చు. పార్లమెంటులోని తన కార్యాలయంకు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ధీకొండ దామోద్ రావు వెళ్ళారు. సిరిసిల్ల వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 365బీని వేములవాడ మీదుగా కోరుట్ల వరకు విస్తరించాలని వినతిపత్రం ఇచ్చేందుకు ముగ్గురు ఎంపీలు మోదీని కలిశారు. మోదీతో బీఆర్ఎస్ ఎంపీలు భేటీ అవ్వటానికి ఏదో కారణం ఉండాలనే చర్చ ఇపుడు పెరిగిపోతోంది.

ఎందుకంటే మోదీని బీఆర్ఎస్ ఎంపీలు కలవగానే ఎందుకు కలిశారు అనే అనుమానం మొదలవుతుంది. దానికి సమాధానంగానే జాతీయ రహదారివిస్తరణ వినతిపత్రం ఇవ్వటం కోసమనే రెడీమేడ్ సమాధానాన్ని పెట్టుకున్నట్లుంది. చరిత్రలోని డెవలప్మెంట్లను చూస్తే ప్రస్తుత డెవలప్మెంట్లకు లింకు ఉన్నట్లే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 2023 ఎన్నికలకు ముందే కేసీఆర్ ఎన్డీయేలో చేరుతానని స్వయంగా అడిగితే మోదీనే వద్దన్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత ఇకో కోణంలో బయటపెట్టారు. ఎలాగంటే తాను తీహార్ జైలులో ఉన్నపుడు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనంచేసే ప్రయత్నాలు జరిగాయి అన్నారు. విలీన ప్రయత్నాలు ఎవరు చేశారు ? ఎవరితో చర్చించారు ? మరి ఎందుకు ఆగిపోయింది ? అన్న వివరాలను కవిత చెప్పలేదు.

2023 ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇపుడేమో కేసులు, విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అరెస్టుభయం వెంటాడుతున్నట్లుంది. తనతో పాటు కొడుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా కార్ రేసు కేసులో ఇరుక్కున్నారు. ఎప్పుడు అరెస్టవుతారో తెలీదు. ఇప్పటికే కూతురు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని జైలుకెళ్ళి బెయిల్ మీద బయటున్నారు. అలాగే మేనల్లుడు తన్నీరు హరీష్ రావు కూడా కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ తో పాటు విచారణలను ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ మీద కేసులు పడి అరెస్టయితే హరీష్ మీద కూడా కేసులు, అరెస్టులు తప్పవు. ఎందుకంటే ఇరిగేషన్ శాఖమంత్రిగా ఉన్నది హరీషే.

ప్రస్తుతానికి వస్తే రేవంత్ ధాటిని తట్టుకోవటం కేసీఆర్, కేటీఆర్, హరీష్ వల్ల కావటంలేదు. ఏ రోజైనా ముందు కేటీఆర్ అరెస్టయ్యే అవకాశముంది. తర్వాత విజిలెన్స్ కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అనుకుంటే కాళేశ్వరం కేసులోనో లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులోనే కేసీఆర్ అరెస్టుచేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కేసులు, విచారణలు, అరెస్టు నుండి బయటపడాలన్నా, రక్షణ కావాలన్నా కేసీఆర్ కు మోదీ మాత్రమే రక్షకుడిగా కనబడి ఉండచ్చు. అందుకనే ఏదో కారణాన్ని అడ్డుపెట్టుకుని ముగ్గురు ఎంపీలను మోదీ దగ్గరకు పంపారా అనే అనుమానాలు, చర్చలు పెరిగిపోతున్నాయి. లేకపోతే మోదీకి కేసీఆర్ మీద హఠాత్తుగా ఇంత లవ్వు ఎందుకు పుట్టుకొస్తుంది ?

రెండుపార్టీలు కలిసిపోతాయి : కూరపాటి

‘‘అధికారంలో లేని రాష్ట్రాల్లో అవసరార్ధం ప్రాంతీయపార్టీల మీద ఆధారపడటం బీజేపీకి అలవాటే’’ అని కాకతీయ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు కూరపాటి వెంకటనారాయణ చెప్పారు. ‘‘ప్రాంతీయ పార్టీలతో కలిసి సవారి చేసిన తర్వాత అవే పార్టీలను బీజేపీ స్వాహా చేస్తుంది’’ అని అన్నారు. ‘‘రాబోయే రోజుల్లో బీఆర్ఎస్-బీజేపీ కలిసిపోతాయి’’ అన్నారు. ‘‘బీఆర్ఎస్ తో చేతులు కలిపి కాంగ్రెస్ ను దెబ్బతీసిన తర్వాత చివరకు బీఆర్ఎస్ ను ఖతం చేయటమే బీజేపీ వ్యూహం’’ అని అన్నారు. ‘‘కాళేశ్వరం అవినీతిపై ఇప్పటివరకు సీబీఐలో కదలిక లేకపోవటమే రెండుపార్టీలు ఒకటే అనేందుకు నిదర్శనం’’ అని చెప్పారు. ‘‘తెలంగాణలో ఒంటరిగా అధికారంలోకి వచ్చేవరకు బీఆర్ఎస్ ను ఏమీ అనకపోవచ్చు’’ అనికూడా అన్నారు. ఇదేసమయంలో ‘‘కేసీఆర్ ఆరోగ్యం గురించి మోదీ వాకాబుచేయటంలో తప్పులేదు’’ అని కూడా అన్నారు. ‘‘కేసీఆర్ కు ఆరోగ్యం ఏమాత్రం సహకరించటంలేదని పార్టీవర్గాల సమాచారం’’ అని చెప్పారు. ‘‘అధికారంలో ఉన్నపుడు బయటపడని అనారోగ్యాలు ఇపుడు బయటపడుతున్నాయోమో’’ అనే అనుమానం వ్యక్తంచేశారు. ‘‘స్కాములు, కేసులు, విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు కాబట్టి కేసీఆర్ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంది’’ అన్నారు. కూతురు కవిత కూడా బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని ప్రతిరోజు బయటపెడుతున్నది కాబట్టి కేసీఆర్ కు టెన్షన్ పెరుగుతేన్నదేమో అనే అనుమానం వ్యక్తంచేశారు.

రాజకీయం ఏమీ ఉండదు: ఉల్లిబాల రంగయ్య

‘‘నరేంద్రమోదీ ప్రధానమంత్రే కాకుండా స్వయంసేవక్ కూడా అని గుర్తుంచుకోవాలి’’ అని విద్యావేత్త, రాజకీయ విశ్లేషకుడు ఉల్లిబాల రంగయ్య అన్నారు. ‘‘కేసీఆర్ కన్నా మోదీని చంద్రబాబునాయుడు తిట్టడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా విమర్శించారు’’ అని గుర్తుచేశారు. ‘‘నిష్టకలిగిన స్వయంసేవకులు వ్యక్తిగత విమర్శలను పట్టించుకోరు’’ అని తెలిపారు. ‘‘కేసీఆర్ ఆరోగ్యం గురించి మోదీ బీఆర్ఎస్ ఎంపీలను వాకాబుచేయటంలో రాజకీయం ఏమీ ఉండదు’’ అని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News