పంచాయతీల్లో ‘చేయి’ది పైచేయి ఎలా అయింది?

మతలబు ఏదైనా ఉందా.. క్షేత్రస్థాయిలో ఏం జరిగింది

Update: 2025-12-21 00:30 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్రంలో రెండు సంవత్సరాల తరువాత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించగలిగింది.

అలాగే తెలంగాణలోని 12 వేలకు పైగా పంచాయతీలలో 56 శాతం పంచాయతీలను అధికార కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ రెండో స్థానానికే పరిమితమైంది.

ఆ పార్టీ 31 శాతం స్థానాలను తన ఖాతాలోకి వేసుకోగలిగింది. బీజేపీ ఐదు శాతం స్థానాలు సాధించింది. మిగిలినవి చిన్న చితక పార్టీలు స్వతంత్రులు మిగిలిన స్థానాలు గెలుచుకున్నారు.

కానీ నిజంగానే అధికార పార్టీ ప్రజల మద్దతును పొంది సాధించిందా?మరేదైన మతలబు ఉందా? ‘ది ఫెడరల్’ ఉత్తర, మధ్య తెలంగాణలోని పలు గ్రామాల ఎన్నికలను చాలా దగ్గరగా పరిశీలించింది.

చాలామంది సర్పంచ్ అభ్యర్థులతో మాట్లాడింది. ఎన్నికల ముందు గ్రామాల్లో ఏం జరిగిందో సవివరంగా మీకోసం..

మొదటి వ్యూహం.. భార్యల ద్వారా ఒత్తిడి
ఉత్తర తెలంగాణలోని ఓ మంత్రి ఇలాకాలోని పలు పంచాయతీలలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి రకరకాల మార్గాలను అనుసరించింది. తమ ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ గెలవకుండా ఉండటానికి వార్డు మెంబర్లుగా ఉన్నవారిని ఎన్నికల పోటీ నుంచి ఉపసంహరించుకునేలా ఎత్తులు వేసింది.
మంత్రి ఇలాకాలో ఓ మండలంలోని గ్రామంలో 12 వార్డులు ఉండగా.. వార్డు మెంబర్లుగా పోటీ చేయడానికి గ్రామపంచాయతీలో ఇంటిపన్ను, నల్లపన్ను కట్టిన వారి జాబితాను పంచాయతీ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నేతలకు అందించారు.
దీనితో సదరు నేతలు ఆ అభ్యర్థులకు ఫోన్ చేసి బహిరంగ బెదిరింపులకు దిగారు. దీనితో భయపడి చాలా మంది బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకున్నారు.
వార్డు మెంబర్ గా పోటీ చేయాలనుకున్న జీ.శ్రీను(పేరుమార్చాం) ఫెడరల్ తో మాట్లాడుతూ.. ‘‘నేను మా గ్రామంలోని మొదటి వార్డుకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను.
దానికి సంబంధించి బీఆర్ఎస్ స్థానిక లీడర్లతో మాట్లాడాను. వారు కూడా నన్నే పోటీ చేయమన్నారు. పోటీకి సంబంధించి అన్ని కాగితాలను సిద్ధం చేసుకుంటున్న సమయంలో గ్రామంలోని ఓ పెద్ద మనిషి ఆయన భార్య ద్వారా నా భార్య మీద ఒత్తిడి తెచ్చాడు.
ఇంటిలో పోరు భరించలేక నేను పోటీ నుంచి తప్పుకున్నా’’ అని చెప్పారు. ఇదే వార్డులో మా కులానికి సంబంధించిన మరో వ్యక్తిని పోటీకి దింపినా కేవలం పది ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు చెప్పారు.
రెండో వ్యూహం.. ఇందిరమ్మ ఇళ్లు
వార్డు మెంబర్లుగా పోటీ చేయాడానికి బరిలోకి దిగిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన వినకుండ పోటీలో నిలిస్తే, వారిని బలపరుస్తూ సంతకం పెట్టిన వారిని వెనక్కి లాగే ప్రయత్నాలు కూడా కొన్ని గ్రామాల్లో జోరుగా సాగాయి.
ఉత్తర తెలంగాణలో రాజకీయంగా పేరు మోసిన ఓ గ్రామంలో బీఆర్ఎస్ వార్డు మెంబర్లను బలపరుస్తూ సంతకం పెట్టిన వారికి మాజీ సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు వరుసగా ఫోన్ చేస్తూ తమ మద్దతును ఉపసంహరించుకోమని ఒత్తిడులు పెట్టారు.
కొంతమందికి రెండో జాబితాలో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మభ్యపెట్టగా, మరికొంత మందికి నెలకు రూ. 2500 ఇచ్చే పథకంలో మీ భార్యల పేర్లు చేరుస్తామని తాయిలాల ఆశచూపారు.
దీనితో చాలామంది అభ్యర్థులు చివరి నిమిషంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ నుంచి తప్పుకున్నారు. ఓ సర్పంచ్ అభ్యర్థి ఫెడరల్ తో మాట్లాడుతూ.. ‘‘మా గ్రామంలో నాలుగో వార్డులో ఓ అభ్యర్థిని పోటీకి నిలిపాం. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆ అభ్యర్థే పోటీ చేస్తానని ముందుకు వచ్చారు.
మేము కూడా సరే అన్నాం. ఇంటిపన్ను, నల్లపన్నులు కట్టాం. నామినేషన్ వేయడానికి ముందు టాయిలేట్ కి వెళ్లి వస్తామని పక్కకు వెళ్లాడు. అప్పుడే ఫోన్ వచ్చింది.
ఏం మాట్లాడాడో ఏమో తెలియదు కానీ తరువాత ఫోన్ పాకెట్ లో పెట్టుకుని వెనక్కి చూడకుండా ఇంటికి ఉరికాడు’’ అని సదరు అభ్యర్థి వాపోయాడు. ఆ సామాజిక వర్గం నుంచి మాకు పోటీ చేయడానికి కనీసం ఒక్క అభ్యర్థి కూడా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
మూడో వ్యూహం.. ‘రెడ్ల’ రాజకీయాలు
పల్లెలో ఆధిపత్య రాజకీయాలను కొన్ని కులాలు కేంద్ర స్థానంగా ఉంటాయి. మధ్య తెలంగాణలోని ఓ గ్రామంలో ఇలాంటి రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపింది. కాంగ్రెస్ అంటేనే రెడ్డి రాజకీయం అనే మాటను ఈ గ్రామం నిజం చేసి చూసింది.
సాంకేతికంగా ఆ గ్రామం ఎస్సీ స్థానానికి రిజర్వ్ అయింది. తమ తరఫున ఓ అభ్యర్థిని నిలిపిన వారు.. గ్రామంలోని రెడ్లను ఐదు గ్రూపులుగా విభజించి వారితో రహస్య సమావేశాలు నిర్వహించారు.
తాము నిలబెట్టిన అభ్యర్థి ఓడితే గ్రామంలో తమకు ఉన్న నలభై సంవత్సరాల పట్టు చేజారుతుందని మిగిలిన వారిలో భయాన్ని నింపారు. ప్రతి రెడ్డి కి వారి వాడలోని కొన్ని ఇళ్లను అప్పగించి వారిని కాంగ్రెస్ అనుకూలంగా ఉండేలా ఎత్తులు వేశారు. కొన్ని కుటుంబాల్లో పంచాయతీలను ఆసరాగా తీసుకుని బీఆర్ఎస్ లేదా బీజేపీ తరఫున పోటీకి దిగకుండా చూసుకోగలిగారు.
నాలుగో వ్యూహం.. పంచాయితీలు
గ్రామంలోని భూ పంచాయతీలు, సరిహద్దు తగాదాలను కూడా కాంగ్రెస్ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ విషయానికి సంబంధించి దక్షిణ తెలంగాణలోని ఓ సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ.. ‘‘ గ్రామంలోని ఐదు వార్డులో వార్డు మెంబర్ గా రెడ్డి వర్గానికి చెందిన మా ఫ్రెండ్ ను అనుకున్నాం.
అతను కూడా పోటీ చేయడానికి సిద్దమయ్యాడు. రేపు నామినేషన్ వేద్దామని అనుకుని పన్నులు మొత్తం కట్టాక.. ఓ కాంగ్రెస్ నాయకుడు అతడికి ఫోన్ చేసి మా తరఫున పోటీ చేయాలని అడిగారు.
అప్పటికి మూడు సంవత్సరాలుగా ఉన్న వారి భూమి సరిహద్దు తగాదాను తాను నెల రోజుల్లో పరిష్కారిస్తామని హమీ ఇచ్చాడు. దాంతో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయాల్సిన మా ఫ్రెండ్ తిరిగి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచాడు.
మాకు అక్కడ సరైన అభ్యర్థి దొరకక పోవడంతో చివరి నిమిషంలో వేరే గ్రామంలో ఉన్న మరో వ్యక్తిని రప్పించి పోటీ చేశాం. అది కూడా చివరి అరగంటలో అన్ని కాగితాలు మేము సిద్ధం చేస్తే అతను వచ్చి నామినేషన్ వేశాడు. అప్పుడు కూడా వారి చెల్లె ద్వారా ఒత్తిడి తేవడానికి ప్రయత్నించిన మా తరఫున పోటీచేసే అభ్యర్థి వారి బెదిరింపులకు లొంగలేదు’’ అని చెప్పారు.
ఐదో వ్యూహం.. వెన్ను పోటు
సిద్దిపేట్ జిల్లాలోని ఓ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యర్థి వర్గంలోని వార్డు మెంబర్ ను తమవైపు తిప్పుకున్నారు. సదరు వ్యక్తితో పాటు అతని భార్య కూడా మరో వార్డులో బీఆర్ఎస్ తరఫున పోటీకి దిగారు.
అయితే ప్రత్యర్థి శిబిరంలోని అన్ని విషయాలు తమకు తెలియడానికి ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. దీనితో బీఆర్ఎస్ ఎత్తులను ముందే తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు వారు పోటీకి దింపాలని అనుకున్న అందరిని నయానో భయానో బెదిరించి వారు జట్టుగా కాకుండా అడ్డుకోగలిగారు.
అలాగే వారు తయారు చేసుకున్న గ్రామ మ్యానిఫెస్టోను కూడా సంపాదించి, వాటిని తమ కాంగ్రెస్ మ్యానిఫెస్టో గా గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారంలోకి తెచ్చుకున్నారు. ఫలితంగా బీఆర్ఎస్ ఇక్కడ కేవలం వంద ఓట్ల తేడాతోనే ఓటమిపాలైంది.
ఆరో వ్యూహం.. వలసదారుల, యువత
గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలవాలంటే కచ్చితంగా ప్రతి ఓటు కీలకమే. కొంతమంది కాంగ్రెస్ నాయకులు గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన వారిని ఒంటరిగా కాకుండా ఓ గ్రూపుగా తిరిగి గ్రామాలకు రప్పించి, వారికి, వారి కులసంఘాలకు భారీగా ఓటు వారీగా నజరానాలు పంచారు.
‘‘ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మా గ్రామంలోని ఓటింగ్ చివరి స్థాయికి చేరింది. అప్పుడు వేరే పట్టణాలు, నగరాలకు వలస వెళ్లిన వారిని తీసుకొచ్చిన కాంగ్రెస్ నాయకులు వారికి ఓటుకు రూ. 1500 చొప్పున ఇచ్చి వారి తరఫున ఓటు వేయించుకున్నారు.
అసలు వాళ్లు ఎక్కడ ఉన్నారో మాకు చివరి నిమిషం వరకూ తెలియనివ్వలేదు. ఇంతకుముందు మా గ్రామంలో ఏదైన ఓటు వేశారో కూడా మాకు తెలియదు. 20-25 సంవత్సరాల క్రితమే వాళ్లు గ్రామాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లారు.
కానీ కరెక్ట్ గా పోలింగ్ ముగియడానికి ముందు వచ్చి ఓటు వేసి వెళ్లారు. వారి పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. ఇది వరకూ కూడా వారు కేవలం ఎన్నికలకు ముందే వచ్చి ఓట్లు వేసి వెళ్లినట్లు తెలిసింది. కానీ ఏ పండగకు, పబ్బాలకు మా ఊరికి రాలేదు. ఇదే ఫలితాన్ని తారుమారు చేసింది’’ అని ఓ సర్పంచ్ అభ్యర్థి ఫెడరల్ తో చెప్పారు.
బీఆర్ఎస్ అభ్యర్థులను కూడా ఆర్థికంగా బలహీనపరచడానికి కూడా కాంగ్రెస్ నాయకులు కొత్త ఎత్తులు వేశారు. గ్రామంలోని కొన్ని వర్గాల యువతను కూడగట్టి వారిని బీఆర్ఎస్ నాయకుల వెంట తిరిగేలా చేయగలిగారు.
వారు తమకు గంపగుత్తగా ఓట్లు వేస్తారని నమ్మకం కలిగాక, వారికి, వారి కుల సంఘాలకు భారీ మొత్తంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను నజరానాలు డిమాండ్ చేసేలా ఎత్తులు వేశారు.
దీనితో వారు ఓటర్లకు పంచే కార్యక్రమంతో పాటు, వీరికి కూడా అదనంగా ఇవ్వాల్సి వచ్చింది. ఇది వారీని ఆర్థికంగా భారీగా ఇబ్బందిపెట్టేలా అసలు పోటీకి దిగక ముందే ఆర్థికంగా వెనకడుగు వేసేలా చేశారు.
ఇలా చాలా గ్రామపంచాయతీలలో అధికార కాంగ్రెస్ విజయాలు సొంతం చేసుకుంది. ఇవి మచ్చుకు కొన్ని గ్రామాలు మాత్రమే. ప్రజలు కూడా చాలా చోట్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఓటు వేశారు.
ఎవరూ అధికారంలో ఉంటే వారి పార్టే పంచాయతీ ఎన్నికలలో గెలవడం గత మూడు దశాబ్ధాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న ఆచారం. ఇప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఒకసారి 2019 లో జరిగిన పంచాయతీ ఎన్నికలకు గుర్తు చేసుకుంటే, అప్పటికి ఇప్పటికీ తేడా మనకు బోధపడుతుంది.
Tags:    

Similar News