కేసీఆర్ ‘ఫిట్ నెస్ టెస్ట్’ పాసయ్యారా ?

2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్(KCR) ఫామ్ హౌస్ బయటకు వచ్చిన ఘటనలు మూడుమాత్రమే.

Update: 2025-12-21 12:15 GMT
KCR at a Party meeting

పార్టీఆఫీసు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిట్ నెస్ టెస్ట్ నిరూపించుకున్నారా ? అవుననే సమాధానం వినబడుతోంది. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్(KCR) ఫామ్ హౌస్ బయటకు వచ్చిన ఘటనలు మూడుమాత్రమే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హాజరయ్యేందుకు ఒకసారి, మేనెలలో హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి బహిరంగసభలో పాల్గొనేందుకు రెండోసారి హాజరయ్యారు. ఇపుడు మూడోసారి పార్టీఆఫీసులో విస్తృతస్ధాయి సమావేశంలో పాల్గొనేందుకు. ఫిట్ నెస్ టెస్ట్ అని అన్నది ఎందుకంటే పార్టీ నేతలను కలవటంలేదు, పార్టీ ఆఫీసుకూ రావటంలేదు. ఎంతో అవసరమైనపుడు సీనియర్ నేతలనే ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడేసి పంపేస్తున్నారు.

సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ప్రచారంచేయలేదు. ఎంఎల్సీ ఎన్నికల్లో పార్టీనే పోటీచేయలేదు. భారీవర్షాలకు పంటలు ముణిగిపోయినా, తుపాను తీవ్రతకు జనాలు ఎంత ఇబ్బందిపడినా సార్ మాత్రం ఫామ్ హౌస్ దాటిందిలేదు. అందుకనే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు పదేపదే కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నది. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని, ఫామ్ హౌస్ దాటి బయటకు రాలేరని, రాజకీయంగా కేసీఆర్ పనైపోయిందని పదేపదే అంటున్నారు. ఎవరెంత రెచ్చగొడుతున్నా కేసీఆర్ మాత్రం మౌనమే సమాధానంగా ఉంటున్నారు.

అలాంటిది ఇంతసడెన్ గా పార్టీ విస్తృతస్ధాయి సమావేశం పెట్టుకోవటం, అందులో కేసీఆర్ పాల్గొనటం దేనికి సంకేతం ? పార్టీ విస్తృతస్ధాయి సమావేశం అంటే తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికలకు నేతలను సమాయత్తం చేయటం కోసం అనుకోవచ్చు. ఈ పనిని ఇంతకాలం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే చేస్తున్నారు. మరి కేసీఆర్ ఇపుడు ఎందుకుపాల్గొన్నారు ? ఎందుకంటే ఫిట్ నెస్ టెస్ట్ నిరూపించుకునేందుకే అనే అనుమానం పెరిగిపోతోంది.

తొందరలోనే జరగబోయే స్ధానికసంస్దల ఎన్నికలు పార్టీ టికెట్ల మీదే జరుగుతాయి. కాబట్టి ఆ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారంచేసే ఉద్దేశ్యంలో ఉన్నట్లున్నారు. అందుకు సన్నాహకంగానే ఈరోజు దాదాపు రెండున్నరగంటలు వేదికమీద నిలబడే మాట్లాడారు. ఇన్నిగంటలు నిలబడే మాట్లాడటం అంటే తాను సంపూర్ణఆరోగ్యంతోనే ఉన్నట్లు చాటి చెప్పటమే కేసీఆర్ ఉద్దేశ్యం అయ్యుండచ్చు. విస్తృతస్ధాయి సమావేశంలో నిలబడి మాట్లాడటమే కాకుండా తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఇక్కడ కూడా సుమారు గంటసేపు మాట్లాడారు. కాబట్టి తన ఆరోగ్యంపై రేవంత్ అండ్ కో చేస్తున్నదంతా దుష్ప్రచారమే అని జనాలకు తెలియచేయటమే కేసీఆర్ వ్యూహం అయ్యుండచ్చు.

రాబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారంచేస్తారో లేదో తెలీదుకాని ఈరోజైతే ఆరోగ్యపరంగా ఫిట్ నెస్ టెస్ట్ లో పాస్ అయినట్లే అనుకోవాలి. రాబోయే 15 రోజుల్లో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ బహిరంగసభలు నిర్వహించాలని పార్టీ డిసైడ్ చేసింది. పార్టీలో అయినా బహిరంగసభల్లో అయినా కేసీఆరే స్టార్ ఎట్రాక్షన్ అనటంలో సందేహంలేదు. బహిరంగసభల తేదీలను పార్టీ ప్రకటించాల్సుంది. అంతాబాగానే ఉందికాని రెండున్నరగంటల కేసీఆర్ ప్రసంగంలో పసకనబడలేదు. మామూలుగా అయితే ప్రత్యర్ధులపైన పంచులతో, సామెతలతో విరుకుపడటం కేసీఆర్ స్టైల్. ఆ స్టైల్ ఈ ప్రసంగంలో కనబడలేదు. ఎల్కతుర్తి బహిరంగసభలో కూడా ఈ పంచే మిస్సయ్యింది.

ఫిరాయింపుల ఊసేలేదు

రెండున్నరగంటల ప్రసంగంలో కొన్ని అంశాలను ప్రస్తావించారుకాని బర్నింగ్ ఇష్యూ అయిన 10మంది ఫిరాయింపు ఎంఎల్ఏల అంశాన్నిమాత్రం టచ్ చేయలేదు. ఫిరాయింపుల అంశాన్ని టచ్ చేస్తే రివర్స్ కొడుతుందని భయపడ్డారేమో తెలీదు. ఎందుకంటే ఫిరాయింపులకు తలుపులు బార్లాతెరిచిందే తానే అన్నవిషయం గుర్తున్నట్లుంది. తానుగనుక ఫిరాయింపుల అంశాన్ని టచ్ చేస్తే రేవంత్, మంత్రులకు అనవసరంగా ఆయుధం ఇచ్చినట్లవుతుందని అనుకున్నట్లున్నారు. అందుకనే ఫిరాయింపుల అంశాన్ని మాత్రం టచ్ చేయకుండా పసలేని కొన్ని విషయాలపై మాట్లాడారు.

Tags:    

Similar News