హైడ్రా కమిషనర్ గన్‌మ్యాన్ ఆత్మహత్యాయత్నం
బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న కృష్ణచైతన్య.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మ్యాన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యకు ప్రయత్నించారు. హయత్‌నగర్‌లోని తన నివాసంతో సర్వీస్ గన్‌తో కాల్చుకున్నారు. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బెట్టింగ్ యాప్‌లో భారీ మొత్తంలో కృష్ణచైతన్య డబ్బు కోల్పోయాడు. దాంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. వాటి కారణంగానే అతను ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఆయన ఏ బెట్టింగ్ యాప్‌లలో ఎంత కోల్పోయారు? ఆ డబ్బు అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి.
మెరుగైన చికిత్స అందించండి: రంగనాథ్
తన గన్‌మ్యాన్ ఆత్మహత్యాయత్నానికి సంబంధించి వార్త తెలిసిన అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్.. కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. కృష్ణచైతన్య ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ‘‘చైతన్యకు చికిత్స అందిస్తున్నారు. చైతన్య బెట్టింగ్‌కు బానిసై అప్పుల పాలయ్యారు. దీంతో వచ్చిన జీతం అంతా కూడా అప్పులు కట్టడానికే సరిపోతోంది. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ఆ ఒత్తిడి తట్టుకోలేకనే కృష్ణ చైతన్య ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు. ఈ సంచలనం చేయొద్దు’’ అని రంగనాథ్ కోరారు.