అసెంబ్లీకి కేసీఆర్ హాజరుకాని కారణం ఇదేనా ?
అసెంబ్లీకి హాజరయ్యే విషయాన్ని మాత్రం పొరబాటున కూడా ప్రస్తావించటంలేదు.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దగ్గర నుండి మంత్రులు చాలామంది పదేపదే అడుగుతున్నారు, ఏమని ? అసెంబ్లీ సమావేశాలకు (KCR)కేసీఆర్ హాజరుకావాలని. గడచిన రెండేళ్ళుగా అసెంబ్లీ సమావేశాలకు రావాలని కేసీఆర్ ను రేవంత్(Revanth) అండ్ కో ఎన్నిసార్లు అడిగినా ఒక్కసారిగా కూడా హాజరుకాలేదు. ఇపుడు మరోసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకావాలని, జలవివాదాలపై ప్రత్యేకంగా చర్చిద్దామని రేవంత్ ప్రతిపాదించారు. అయితే ఎప్పటిలాగే కేసీఆర్ నుండి సమాధానం రావటంలేదు. రేవంత్ తదితరులేమో అసెంబ్లీ సమావేశాలకు రమ్మని అడుగుతుంటే కేసీఆర్ మాత్రం పబ్లిక్ మీటింగుల్లో పాల్గొంటానని చెబుతున్నారు కాని అసెంబ్లీకి హాజరయ్యే విషయాన్ని మాత్రం పొరబాటున కూడా ప్రస్తావించటంలేదు.
అసెంబ్లీకి హాజరయ్యేందుకు కేసీఆర్ ఎందుకు ఇష్టపడటంలేదు ? భయపడుతున్నారా ? లేకపోతే ఇంకేవైనా కారణాలు ఉన్నాయా ? అన్నదే అర్ధంకావటంలేదు. ప్రజాసమస్యలపై చర్చించటానికి, పరిష్కారాలు కనుగొనేందుకు అసెంబ్లీకి మించిన ఉత్తమమైన వేదిక మరొకటిలేదన్న విషయం కేసీఆర్ కు తెలియందికాదు. తెలిసినా కూడా బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీకి ఎందుకు హాజరుకావటంలేదు ? అన్న విషయంపై సర్వత్రా చర్చజరుగుతోంది.
ఇక్కడ విషయం ఏమిటంటే అసెంబ్లీకి హాజరైతే ఏమవుతుందో కేసీఆర్ కు బాగా తెలుసు. తాను సీఎంగా ఉన్నపుడు రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సభనుండి తగిన కారణం లేకుండానే సస్పెండ్ చేయించారు. రేవంత్ ను అయితే చాలా సమావేశాల్లో అసలు నోరెత్తనీయలేదు. రేవంత్ మాట్లాడటం మొదలుపెట్టగానే బీఆర్ఎస్ వైపునుండి గందరగోళం చేయటం చివరకు రేవంత్ కు మైక్ కట్ చేయటం లేదా సభనుండి బయటకు తరిమేసేవారు. మాట్లాడాలని, మైక్ ఇవ్వాలని రేవంత్ ఎంత మొత్తుకున్నా బీఆర్ఎస్ హయాంలో స్పీకర్ పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నపుడు అసెంబ్లీ సమావేశాలను కేసీఆర్ తనిష్టం వచ్చినట్లు జరిపించుకున్నారనే ఆరోపణలు, ప్రచారానికి కొదవేలేదు.
సీఎంగా ఉన్నపుడు అసెంబ్లీలో తాను ఎలా వ్యవహరించారనే విషయం కేసీఆర్ కు బాగానే గుర్తుండి ఉంటుంది. అందుకనే ఇపుడు అసెంబ్లీసమావేశాలకు హాజరవ్వటానికి కేసీఆర్ వెనకాడుతున్నారు. అప్పట్లో తాను రేవంత్ తదితరుల విషయంలో ఎలా వ్యవహరించారో ఇపుడు తనవిషయంలో రేవంత్ కూడా అలాగే వ్యవహరిస్తారన్న భయంతోనే సభకు హాజరవుతున్నట్లు లేదు. రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తే తనకు అవమానాలు తప్పవన్న ఉద్దేశ్యంతోనే కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావటంలేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
2013 ఎన్నికల్లో ఓడిన తర్వాత కేసీఆర్ రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. మొదటిసారి ఎంఎల్ఏగా ప్రమాణస్వీకారం చేయటానికి వచ్చారు. అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయకుండా అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ప్రమాణస్వీకారంచేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ప్రమాదానికి గురవ్వటంతో కాలి తుంటిఎముక విరిగింది. అందుకనే మిగిలిన ఎంఎల్ఏలతో కాకుండా కోలుకున్నాక ప్రత్యేకంగా ఎంఎల్ఏగా ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత బడ్జెట్ సమావేశాల్లో రెండోసారి సభకు హాజరయ్యారంతే. అసెంబ్లీకి హాజరుకాకపోతే సాంకేతికంగా ఎంఎల్ఏ సభ్యత్వంపై ఎక్కడ వేటుపడుతుందో అన్న సాంకేతిక కారణంతో మాత్రమే సభకు హాజరయ్యారని రేవంత్ పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. సరే, చరిత్ర ఎలాగున్నా జనవరిలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో అయినా కేసీఆర్ హాజరవుతారా ? ఏమో చూడాలి, అనుమానమే.