ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన రెండో సిట్
అధికారుల స్టేట్‌మెంట్లను మరోసారి రికార్డ్ చేస్తున్న సిట్.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రెండో సిట్ దూకుడు చూపిస్తోంది. దర్యాప్తు విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేస్తోంది. అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు దిశగా సిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్ రావు పనిచేసిన సమయంలో రివ్యూ కమిటీలో సభ్యులుగా ఉన్న అప్పటి జీఏడీ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ (సీఎస్), ఇంటెలిజెన్స్ చీఫ్‌లను సిట్ మరోసారి విచారించింది.
మాజీ చీఫ్ సెక్రటరీలు సోమేశ్ కుమార్, శాంతి కుమారిలతో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్, సాధారణ పరిపాలన శాఖ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావును కూడా సిట్ సాక్షులుగా విచారించింది. ఈ సందర్భంగా ప్రభాకర్ రావును ఎదుట ఉంచి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌ను ప్రశ్నించింది. అనంతరం ఆయన స్టేట్‌మెంట్‌ను రెండోసారి రికార్డు చేసింది. అలాగే అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ స్టేట్‌మెంట్‌ను కూడా మరోసారి నమోదు చేసింది. ఎస్‌ఐబీ ఓఎస్‌డీగా ప్రభాకర్ రావు నియామకంపై ఐఏఎస్ అధికారులను సిట్ పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
ఈ కేసు దర్యాప్తులో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. ప్రభాకర్ రావు సూచించిన ఫోన్ నంబర్లను యథావిధిగా హోం శాఖకు పంపినట్లు మాజీ ఐపీఎస్ అధికారులు వ్యవహరించిన అంశాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు సిట్ తుది దశ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆదేశించిన విషయం తెలిసిందే.