రూ.20కోట్ల బంగారం డిపాజిట్ కేసులో బీజేపీ నాయకులు
సిరి గోల్డ్ మర్చంట్స్ సంస్థ పెట్టుబడి దారులను మోసం చేసిందంటూ కేసు నమోదు.
రూ.20 కోట్ల బంగారం డిపాజిట్ మోసం కేసులో ఇద్దరు సీనియర్ తెలంగాణ బీజేపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప్పల్‌లోని సిరి గోల్డ్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోసంపూడి రవీంద్ర, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావుపై ఈ కేసు నమోదైంది. పెట్టుబడి పెడితే రోజువారీ లాభాలు ఇస్తామని నమ్మించి వేలాది మందిని ఆకర్షించిన సంస్థ ప్రమోటర్లు, పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ.20 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. హామీ ఇచ్చినట్లుగా లాభాలు ఇవ్వకపోవడమే కాకుండా, పెట్టుబడి మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించలేదని ఆరోపించారు.
ఈ ఫిర్యాదుల ఆధారంగా సీసీఎస్ (CCS) పోలీసులు BNS సెక్షన్ 316(2), 318(4) కింద కేసు నమోదు చేశారు. అలాగే BNS సెక్షన్ 3(5) ప్రకారం సిరి గోల్డ్ మర్చంట్స్ సంస్థ యాజమాన్యంతో పాటు సీనియర్ బీజేపీ నేతలు కోసంపూడి రవీంద్ర, నెల్లూరు కోటేశ్వరరావుపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, బాధితుల నుంచి మరిన్ని ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని సీసీఎస్ పోలీసులు వెల్లడించారు.
నాకు సంబంధం లేదు: కోటేశ్వరరావు
అయితే సిరి గోల్డ్ మర్చంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు తనకు ఎటువంటి సంబంధం లేదని ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు చెప్పారు. తనపై దాఖలైన కేసు అంశంపై ఆయన ‘ఫెడరల్ తెలంగాణ’తో మాట్లాడుతూ స్పష్టతనిచ్చారు. అసలు తనకు గోల్డ్ మర్చంట్ సంస్థకు సంబంధం లేదని, కానీ ఆ సంస్థలో పార్ట్‌నర్ అయిన రవీంద్ర తనకు మంచి స్నేహితుడని చెప్పారు. సదరు సంస్థలో రవీంద్ర, అతని సతీమణి భాగస్వాములుగా ఉన్నారని వెల్లడించారు. అంతేకాకుండా తమపై యాచా నాగేశ్వరరావు అనే వ్యక్తం ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
‘‘నాకు రవీంద్ర మంచి స్నేహితుడు. అతని భార్య నాకు తెలీదు. ఫిర్యాదు చేసిన నాగేశ్వరరావు కూడా అదే సంస్థలో మార్కెటింగ్ మర్చెంట్‌గా పనిచేశారు. కొన్నాళ్ల క్రితం అతని తీసేశారు. అతడు కూడా బయటకు వెళ్లిపోయాడు. అయితే రవీంద్ర, నాగేశ్వర రావు మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వాటిని సెటిల్ చేయడానికి నేను ప్రయత్నించాను. కానీ కుదరలేదు. బహుశా ఆర్థిక లావాదేవీలను సెటిల్ చేయలేదనే కోపంతోనే నాపైన కూడా ఫిర్యాదు చేసి ఉండొచ్చు’’ అని కోటేశ్వరరావు వివరించారు. ఏ సంబంధం లేకపోయినా తనపైన కూడా ఫిర్యాదు చేసినందుకు పరువునష్టం దావా వేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.