ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై ఏసీబీ ఫోకస్.
మహబూబ్‌నగర్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దాదాపు 12 బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లలో మొత్తం 12 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన పాపారావుకు కిషన్ నాయక్ ప్రధాన శిష్యుడిగా ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు కిషన్ నాయక్‌పై ఉన్నాయి. వీటిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. మహబూబ్‌నగర్ ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్‌గా కిషన్ నాయక్.. డిసెంబర్ 2024లో బాధ్యతలు స్వీకరించారు.
ఏసీబీ అధికారుల అంచనా ప్రకారం కిషన్ నాయక్ వద్ద సుమారు రూ.100 కోట్ల వరకు అక్రమ ఆస్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రవాణా శాఖలో కీలక పదవిలో ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమంగా ఆస్తులు సమకూర్చుకున్నారనే ఫిర్యాదులు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. కిషన్ నాయక్ 2024 డిసెంబర్‌లో మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో పాపారావుకు ప్రధాన శిష్యుడిగా పనిచేసిన నేపథ్యం కూడా ఉన్నట్లు సమాచారం.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైసలు ఇస్తే గానీ పనులు జరగడం లేదంటూ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఖమ్మం ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన సోదాల్లో వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్‌లకు సంబంధించిన ఫైళ్లు ఏజెంట్ల వద్ద లభ్యమవడం సంచలనం రేపింది. ఏజెంట్ల నుంచి వచ్చే ప్రతి ఫైల్‌కు ప్రత్యేక కోడ్ ఉండటాన్ని గమనించిన ఏసీబీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో తాజా సోదాలు రవాణా శాఖలో అవినీతిపై మరోసారి తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.