సీఐడీ ముందుకు మరోసారి సెలబ్రిటీలు
ఆర్థిక లావాదేవీలపై ఈడీ, సీఐడీ అధికారులు సమాంతరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బెట్టింగ్స్ యాప్స్ కేసులో సీఐడీ ముందుకు సెలబ్రిటీలు మరోసారి వస్తున్నారు. మంగళవారం నటి మంచు లక్ష్మీ.. సీఐడీ ముందు హాజరయ్యారు. ఆమెను అధికారులు పలు అంశాలపై విచారించారు. లావాదేవీలు, పారితోషికం ఇలా అనేక విషయాలపై అధికారులు విచారించినట్లు సమాచారం. ఈ కేసులో మంచు లక్ష్మీతో పాటు చాలా మంది సెలబ్రిటీలను సీఐడీ అధికారులు ఇప్పటికే విచారించారు.
ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులు విచారణకు హాజరయ్యారు. నటులు ప్రకాశ్ రాజ్, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ ఈడీ ఎదుట వివరణ ఇచ్చారు. అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, నటి అమృత చౌదరి గతంలో విచారణ సంస్థల ఎదుట హాజరై తమ వాంగ్మూలాలు నమోదు చేశారు.
బెట్టింగ్ యాప్స్‌ను ఎందుకు ప్రమోట్ చేశారు, అందుకు ఎంత పారితోషికం తీసుకున్నారు, యాప్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాల వివరాలపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.