కాసేపట్లో రాహుల్ ‘ఓట్ అధికార్ యాత్ర’ ప్రారంభం..
16 రోజులు.. 23 జిల్లాలు..1300 కి.మీ..;
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదివారం (ఆగస్టు 17, 2025) బీహార్‌లో 'ఓట్ అధికార్ యాత్ర'ను ప్రారంభించనున్నారు. కాసేపటి క్రితం ఆయనతో పాటు కాంగ్రెస్ (Congress) పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ససారాం చేరుకున్నారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఓటరు జాబితా సవరణ(SIR)ను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఓట్ల దొంగతనం కోసమే ఈ ప్రక్రియ తీసుకువచ్చారని రాహుల్ ఆరోపిస్తున్నారు. SIRకు వ్యతిరేకంగా యాత్రకు శ్రీకారం చుట్టారు. 16 రోజుల పాటు జరిగే ఈ యాత్ర రోహతస్ జిల్లా ససారాం నుంచి ప్రారంభమవుతుంది. 23 జిల్లాలను కవర్ చేస్తూ 1300 కిలోమీటర్లు దూరం యాత్ర సాగనుంది. సెప్టెంబర్ 1న పాట్నాలో మెగా ర్యాలీతో ముగుస్తుంది. మహాఘట్ బంధన్ కూటమి రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav), మూడు లెప్ట్ పార్టీ నేతలు యాత్రలో పాల్గొననున్నారు. యాత్రలో మూడు రోజులు (ఆగస్టు 20, 25, 31 తేదీలు) బ్రేక్ ఉంటుంది. రాహుల్ యాత్రలో పాల్గొంటామని స్పష్టం చేశారు. అలాగే సీపీఐ నేత సుభాషిణి అలీ కూడా యాత్రకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
తన యాత్ర వివరాలను రాహుల్ ఎక్స్‌లో పంచుకున్నారు..
“16 రోజులు. 20+ జిల్లాలు. 1,300+ కి.మీ. మేము జనం వద్దకు వస్తున్నాం. ఓటు హక్కు కోసం చేస్తున్న మా పోరాటానికి మద్దతివ్వండి.. రాజ్యాంగాన్ని కాపాడటానికి మాతో జతకట్టండి,”అని కోరారు.