‘మతతత్వ రాజకీయాలు దేశ ఐక్యత, ప్రగతికి ప్రమాదకరం’
‘‘స్వాతంత్య్ర సమరంలో ఎలాంటి పాత్ర లేనివాళ్లు ఇప్పుడు పటేల్ వారసులమని ప్రకటించుకోవడం హాస్యాస్పదం’’ - ఏఐసీసీ చీఫ్ ఖర్గే.;
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) పోరాట స్ఫూర్తితో ముందుకు సాగనున్నట్లు కాంగ్రెస్(Congress) ప్రకటించింది. మతతత్వ, విభజన రాజకీయాలు దేశ ప్రగతికి అటంకంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. గుజరాత్(Gujarat)లోని అహ్మదాబాద్(Ahmedabad)లో సర్దార్ పటేల్ స్మారకం వద్ద మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) విస్తృతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పటేల్, నెహ్రూ మధ్య విభేదాలున్నాయని కాషాయ పార్టీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని, మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్‌ల నాయకత్వాన్ని విడివిడిగా చూడలేమని పేర్కొంది. ముప్పై ఏళ్ల అనుబంధంపై నెహ్రూకు పటేల్ రాసిన ఒక లేఖను ప్రస్తావిస్తూ.. సర్దార్ చూపిన మార్గంలో రాజ్యాంగ పరిరక్షణకు కార్యకర్తలంతా కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. పటేల్‌ను తమ సర్దార్‌గా సంబోధించింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే (Mallikarjun Kharge) ప్రారంభోపన్యాసం చేశారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన జాతీయ నాయకులు పటేల్, నెహ్రూల మధ్య ఎప్పుడూ విభేదాలు తలెత్తలేదని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరంలో ఎలాంటి పాత్ర లేనివాళ్లు ఇప్పుడు పటేల్ వారసులమని ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
బీజేపీ(BJP) తీరుపై తీవ్ర విమర్శలు..
సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంలో కొన్ని ఘటనలను ఉదాహరణగా చూపుతూ బీజేపీ పాలనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. 1918లో ఖేడా, 1928లో బార్డోలీ రైతుల కోసం పటేల్ చేసిన పోరాటాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదే రైతులను బానిసలుగా మార్చే విధానాలను అనుసరిస్తోందని, MSP కల్పించకపోవడం, లఖింపూర్ ఖేరి ఘటన, పెన్షన్ చట్టాల మార్పులను ఉదాహరణగా పేర్కొంది.
దేశ ఐక్యతకు ప్రమాదం..
బీజేపీ భాష, ప్రాంతం, సంస్కృతి ఆధారంగా ప్రజల మధ్య విభేదాలు పెంచేందుకు ప్రయత్నిస్తోందని, ఇది దేశ ఐక్యతకు ప్రమాదమని కాంగ్రెస్ హెచ్చరించింది. 1948లో గాంధీ హత్య తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించిన వ్యక్తి పటేల్ అని గుర్తుచేసే తీర్మానం, నేడు ఆ సంస్థను బీజేపీ ఆదరిస్తోందని విమర్శించింది.
పార్టీ కీలక నిర్ణయాలు..
పార్టీ పునరుజ్జీవనం, సంస్థాగత పునర్నిర్మాణంపై నేతలు చర్చించారు. కె.సి. వేణుగోపాల్, సచిన్ పైలట్ వంటి నాయకులు జిల్లాల స్థాయిలో పార్టీ బలోపేతానికి కొత్త సూచనలు చేశారు.
గుజరాత్ ఎన్నికలకు దిశానిర్దేశం..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ‘‘మోదీ-షా దేశ చరిత్రను మార్చాలని చూస్తున్నారు. కానీ గుజరాత్ ప్రజలకు గాంధీ, పటేల్ సిద్ధాంతాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉంది,’’ అని ఒక సీనియర్ నాయకుడు పేర్కొన్నారు.